ఉందిలే మంచికాలం ముందు ముందునా...

31 Dec, 2015 22:46 IST|Sakshi
ఉందిలే మంచికాలం ముందు ముందునా...

కొత్త సంవత్సరం సరదాతో మొదలవ్వాలి. నవ్వులతో గడవాలి. ఆనందాలు నిండాలి.
ఆత్మీయతలు పండాలి. కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్... జీవితంలో భాగం.
కానీ మనం నవ్వుతూ ఉండాలి. నవ్విస్తూ ఉండాలి.

 
ఒకసారి మా ఇంటికొచ్చిన గెస్ట్‌లకి మా ఆవిడ స్వయంగా వండిన స్వీట్స్ పెట్టింది. ఆ స్వీట్ మెమరీస్‌తో వాళ్లు మళ్లీ కనిపించలేదు.కొత్త సంవత్సరం రానే వచ్చింది. గుళ్లకు వెళ్లేవారు వెళుతున్నారు. అతి కష్టం మీద మందుబాబులు ఇళ్లకు చేరుకుంటున్నారు. కవులు గొంతు సవరించి దండయాత్రకు బయలుదేరారు. అందరి మొహాల్లో వెలుగు, ఆశ, ఆకాంక్ష. సూర్యుడు కూడా లేతగా కిరణాలు పంపిస్తున్నాడు. ఈ రోజు చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు. ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే యాడ్ చూసి చూసి విసుగెత్తినవాళ్లు సిగరెట్లు మానేస్తారు. ఇదే లాస్ట్ పెగ్ అంటూ పది పెగ్గులు తాగేవాళ్లు హ్యాంగోవర్‌ని భరించలేక మందు మానేస్తారు. కొందరు డైరీ రాయడం ప్రారంభిస్తారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కూడా జరగొచ్చు. అయితే ఇవన్నీ జనవరి రెండో తేదీకి మాయమై మళ్లీ మొదటికి రావచ్చు.

కొత్త సంవత్సరం రకరకాల పిచ్చోళ్లు తారసపడతారు. కొందరికి క్యాలెండర్ల పిచ్చి. కనిపించిన ప్రతివాణ్ని క్యాలెండర్ అడుగుతారు. రకరకాల క్యాలెండర్లు పోగుచేసి వాటిని ఏం చేసుకోవాలో తెలియక అటకమీద దాస్తారు. గ్రహస్థితి బాగుంటే అవి కిందకి దిగొచ్చు. లేదంటే అటకపైనున్న చెదలకి పంచాంగకర్తలుగా మిగలొచ్చు. ఇంకొందరు డైరీలని కలవరిస్తారు. స్నేహితులందరి లిస్ట్ ముందరేసుకుని ఫోన్లు చేసి విసిగిస్తారు. పాకెట్ డైరీ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరీ వరకూ సంపాదించి, వాటిని చూస్తూ ఆనందిస్తూ ఒక నెలంతా గడుపుతారు. ఫిబ్రవరి నెలలో అవి అడుగడుగునా అడ్డమొచ్చి తూకానికి వేసేస్తారు. డైరీ రాయడం కూడా ఒక కళ. ఎంత రాయాలో ఏది రాయాలో తెలియకపోతే వీపు వాస్తుంది. ఉదయాన్నే పళ్లు తోమడం నుంచి రాత్రి టీవీ చూడ్డం వరకు రాసి ఇంకేం రాయాలో తెలియక మానేసిన వాళ్లున్నారు. మనం అడక్కపోయినా డైరీలు ఇచ్చేవాళ్లు కూడా ఉంటారు. ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఇచ్చే డైరీలు డేంజరస్. వాటి వెనుక కొన్ని పాలసీలు ఉంటాయి. కొంతమంది డైరీ ఇచ్చారంటే, దేనికో టెండర్ పెట్టారని అర్థం.

ఇప్పుడు తగ్గింది కానీ ఒకప్పుడు ఆడవాళ్లు ఉత్సాహంగా ముగ్గులేసేవాళ్లు. 31 రాత్రి వీధులన్నీ కళకళలాడేవి. కాకపోతే మందుబాబులు ఆ ముగ్గుల షేపుల్ని మార్చేసేవాళ్లు. సెల్‌ఫోన్లు వచ్చిన తరువాత గ్రీటింగ్‌లు కనుమరుగైపోయాయి. మెసేజ్‌ల్లో కూడా బోలెడు క్రియేటివిటీ వచ్చేసింది. సమ్మేళనంలో జాగా దొరకని కవులు మెసేజ్‌లు, వాట్సప్‌ల్లో విజృంభిస్తున్నారు. ఈ రోజు ఫేస్‌బుక్కులన్నీ నిండుగా ఉంటాయి. అనేక మంది ప్రొఫైల్ పిక్చర్స్ మార్చి కనువిందు చేస్తారు. కొంతమంది పాతికేళ్ల క్రితం ఫొటో పెట్టి కన్‌ఫ్యూజ్ చేస్తారు.
 జనవరి ఫస్ట్‌న కొత్త కథ రాయాలని గత 20 ఏళ్లుగా అనుకుంటున్నాను. క్యాలెండర్లు మారాయి కానీ కథ రాలేదు. కొత్త తరానికి ఈ బాధ లేదు. వాళ్లు అదో టైప్. ఏదైనా టైప్ చేసేస్తారు.

న్యూ ఇయర్ నాడు బంధుమిత్రుల్ని కలవడం అదో సరదా. ఒకసారి మా ఇంటికొచ్చిన గెస్ట్‌లకి మా ఆవిడ స్వయంగా వండిన స్వీట్స్ పెట్టింది. ఆ స్వీట్ మెమరీస్‌తో వాళ్లు మళ్లీ కనిపించలేదు. మన ప్రయోగాలు ఒక్కోసారి ఎదుటివాళ్లకి ప్రాణాంతకమవుతుంటాయి. స్వీట్ స్టాల్స్, కర్రీ సెంటర్ల వల్ల ఉపయోగం ఏమంటే మన మిత్రులు దూరం కాకుండా అవి కాపాడుతాయి.గత సంవత్సరం సినిమావాళ్లు పగబట్టి ప్రేక్షకుల్ని కకావికలు చేశారు. థియేటర్ల నుంచి బయటికి రావడానికి బోలెడంత తొక్కిసలాట జరిగింది. ఈ ఏడాదైనా వాళ్లు గాల్లో ఎగిరి మనల్ని తన్నకుండా ఉంటే మంచిది. టీవీవాళ్లు ఎలాగూ మారరు. ఆ సీరియల్స్ ఎవరు చూస్తున్నారో ఎవరికీ తెలియదు కాబట్టి వాళ్లు అలాగే తీస్తూవుంటారు.

మనం గుర్తించం కానీ వెళ్లిపోతున్న కాలం మన మొహాలపై తన గుర్తుల్ని ముద్రించి వెళుతుంది. చాలా నేర్పించి వెళుతుంది. బాధల్ని, సంతోషాల్ని మిక్సీలో రుబ్బి మరీ బహుమతిగా ఇస్తుంది. నవ్వుతూ జీవించడమే జీవితానికి అర్థం. హ్యాపీ న్యూ ఇయర్.
 - జి.ఆర్. మహర్షి
 

మరిన్ని వార్తలు