గజేంద్ర ఘోష..!

2 Nov, 2014 23:20 IST|Sakshi
గజేంద్ర ఘోష..!

యాచనం... భారతదేశంలో తరతరాలుగా ఇది కూడా ఒక వృత్తి. మన సంస్కృతిలో యాచకులకు తోచింది ఇవ్వడం ‘ధర్మం’ కాబట్టి యాచకత్వం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. కేవలం భారత్ మాత్రమే కాదు... చుట్టపక్కలున్న దక్షిణాసియా దేశాల్లో కూడా యాచకత్వం చాలా సహజమైనదే. అయితే ఈ దేశాల్లో మనుషులు మాత్రమే కాదు.. దయగల ప్రభువులు చేసే దానం కోసం జంతువులు కూడా ఎదురు చూస్తుంటాయి. ఆలయాల దగ్గర వానరాలు... అక్కడకు వచ్చే భక్తులు ఇచ్చే కొబ్బరిచిప్పలు, అరటిపండ్ల మీద ఆధారపడి జీవిస్తుంటాయి.

ఏం వేస్తారా అని మనుషులవైపు ఆశగా చూస్తూంటాయి. ఏమీ వేయకపోతే చోరీకి కూడా వెనుకాడవు. అవి మాత్రమే కాదు... ఒక మోస్తరు పట్టణాల్లో ఆవులు వీధుల వెంట తిరుగుతూ ఉంటాయి. అవి ప్రతి దుకాణం ముందుకూ వెళ్లి ఆగుతాయి. షాపు యజమాని ఏదో ఒకటి నోటికి అందిస్తాడు. అందుకొని మరో షాపు ముందుకు వెళ్తాయి. కడుపు నిండే వరకూ అలా ఎన్ని షాపులు వీలైతే అన్ని షాపులు తిరుగుతాయి ఆ ఆవులు.
 
ఈ వానరాలు, ఆవులు మన దేశంలో సంగతి. అదే శ్రీలంకలో అయితే వాటి స్థానంలో ఏనుగులు ఉంటాయి. టూరిస్టులతో అలరారే అటవీ ప్రాంతాల్లో ఉండే ఏనుగులకు పర్యాటకులు పెట్టే తిండి తినడం అలవాటు అయ్యింది. దాంతో ఒకటి కాదు.. రెండు కాదు... పదుల సంఖ్యలో గజరాజులు రోడ్డు పక్కకు వస్తుంటాయి. ఎవరో ఒకరు ఏదో ఒకటి తినిపించి వెళ్లకపోతారా అని వాహనాల వంక ఆశగా చూస్తుంటాయి. కొంత వరకూ ఇది ముచ్చటగానే ఉంది.

వాటికి సరదాగా అవీ ఇవీ తినిపించడం టూరిస్టులకు మొదట్లో మురిపెంగానే అనిపించింది. కానీ రానురాను ఇలా వచ్చే ఏనుగుల సంఖ్య ఎక్కువ కావడం, అన్నీ కలిసి రోడ్లకు అడ్డంగా వచ్చేయడం మాత్రం సమస్యగా మారింది. దాంతో ఈ‘బెగ్గింగ్ ఎలిఫెంట్స్’ని నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు.

అలాగని వీటిని మరో చోటికి తరలించడం, పట్టి బంధించడం వారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతానికి శోభ కూడా ఇవే కదా! పైగా ఇవి పర్యాటకులకు ఎలాంటి హానీ చేయడం లేదు. వారి నుంచి తిండిని మాత్రమే ఆశిస్తున్నాయి. దాంతో వాటికి బాధ కలిగించకుండా, కేవలం ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకుంటే చాలనుకుంటున్నారు అధికారులు. చూడాలి మరి గజరాజులు వారి మాట ఎంత వింటాయో!
 

మరిన్ని వార్తలు