సముద్రమంత సంతోషం...

26 Sep, 2016 23:59 IST|Sakshi
సముద్రమంత సంతోషం...

గలపగోస్ దీవులు
నాలుగు కాళ్లతోనూ ఈదే చిన్నసైజు తిమింగలాల్లాంటి సీ లయన్స్... కాలిఫోర్నియా, జపాన్ సముద్రాల్లోనూ కనిపిస్తాయి. కానీ ఈక్వెడార్‌లోని గలపగోస్ దీవుల సీ లయన్స్ ప్రత్యేకతే వేరు. వీటిని చూస్తూ స్నోర్కెలింగ్ చేయటం... మన వెంటే నీలి పాదాల బూబీస్ (పక్షులు) ఎగరటం... ఈ గలపగోస్ దీవుల్లోనే సాధ్యం. ఈక్వెడార్ తీరానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. 10 రోజుల క్రూయిజ్‌ను బుక్ చేస్తే... బోలెడన్ని బీచ్‌లు, గుహల్ని చూసేయొచ్చు. 32 మందితో ప్రయాణించే చిన్న క్రూయిజ్ నౌకలు ఇక్కడి ప్రత్యేకత. దార్లో చల్లారిపోయిన అగ్నిపర్వతాన్ని, పెంగ్విన్లను... ఇంకా ఎన్నెన్నో ప్రాణుల్ని చూడొచ్చు. అలా కాదనుకుంటే మూడు ప్రధాన దీవుల్లో బస చేస్తూ... అక్కడి వన్యప్రాణి సంపదను చూడొచ్చు.
 
గలపగోస్‌కు వెళ్లేదెలా?
* హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలు లేవు. కానీ ఢిల్లీ, ముంబయి నుంచి ఉన్నాయి. కాస్తంత ముందుగా బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జీలు ఒకరికి రూ.1.6 లక్షల నుంచి 1.8 లక్షల మధ్య ఉంటాయి.
* గలపగోస్ కాస్త ఖరీదైన యాత్రే. ఇక్కడి హోటళ్ల ధరలు కూడా రోజుకు ఒకరికి కనీసం 250 నుంచి 300 డాలర్ల మధ్య ఉంటాయి. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.15వేలు.
* స్థానికంగా ప్యాకేజీలు కూడా లభిస్తాయి. ఈ ప్యాకేజీల్లో కొంత తక్కువ ధర ఉండే అవకాశముంటుంది.
 
ఏ సీజన్లో వెళ్లొచ్చు?
డిసెంబరు-మే: ఇది వర్షాకాలం. దాదాపు రోజూ ఎప్పుడో ఒకప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. కాకపోతే నీళ్లు కాస్త వెచ్చగా ఉంటాయి. దీంతో డైవింగ్, స్నోర్కెలింగ్ చేయటం సులువు. చేపలకు, తాబేళ్లకు ఇది గుడ్లుపెట్టే సమయం. వాటిని చూడొచ్చు. ఎక్కువ జంతుజాలం కనిపించదు.

మే- డిసెంబరు: నీళ్లు చల్లగా ఉంటాయి. ఎప్పుడూ మేఘాలుంటాయి కానీ వర్షం పడటం అరుదు. సముద్రంలో జంతుజాలం ఎక్కువగా ఉంటుంది. యాత్రికులకు ఇదే సరైన సమయమని అనుభవం ఉన్న డైవర్లు చెబుతారు. కాకపోతే ఆ చల్లటి నీళ్లలో డైవింగ్, స్నోర్కెలింగ్ చేయటమంటే కొంత సాహసమే.

మరిన్ని వార్తలు