మారబోయేది ఏమీ లేదు

13 Aug, 2018 00:16 IST|Sakshi

శాస్త్రపరంగా.. సాంకేతికపరంగా.. మేధోపరంగా.. వైజ్ఞానికపరంగా మానవాళి ఇంకా అంతగా అభివృద్ధి చెందని రోజులవి. ఉదాహరణకు మనందరికీ కనిపిస్తున్నట్లుగా సూర్యుడు భూమి చుట్లూ తిరగట్లేదని, వాస్తవానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని, అయినా అలా అది మనకు కనిపించదని గెలీలియో తన పుస్తకంలో రాశాడు. వెంటనే నాటి మతపెద్దలు అతన్ని తమ న్యాయస్థానానికి పిలిపించారు. గెలీలియో 75 ఏళ్ల వృద్ధుడు. పైగా అనారోగ్యంతో మరణశయ్యపై ఉన్నాడు. అతనితో వాళ్లు ‘‘మీ పుస్తకంలోని విషయాన్ని వెంటనే మార్చాలి. ఎందుకంటే, అది మతగ్రంథాలకు వ్యతిరేకంగా ఉంది. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడని పవిత్ర గ్రంథాలలో ఉంది. ఈ విషయంలో ఎలాంటి వాదనలూ వినేందుకు మేము సిద్ధంగా లేము. వెంటనే దాన్ని మార్చండి. లేకపోతే మీకు మరణ శిక్ష విధించాల్సి వస్తుంది’’అన్నారు.

కనీసం ఎలాంటి వాదనను వినేందుకు సిద్ధంగా లేని, ‘‘చెప్పినట్లు చెయ్యి, లేదా చావు’’అనే నియంతృత్వ ధోరణి మాత్రమే తెలిసిన మూర్ఖమైన బృందం అది.గెలీలియో కాస్త హాస్య చతురుడు. ‘‘నన్ను చంపడానికి మీరు అంత శ్రమ పడనక్కరలేదు. ఎలాగూ నేను మరణించబోతున్నాను. మీరు చెప్పినట్లుగా నా పుస్తకంలో దాన్నిసవరిస్తాను. కానీ, పుస్తకంలో దాన్ని సవరించినంత మాత్రాన భూమి కానీ, సూర్యుడు కానీ మారబోయేది ఏమీ లేదు. ఎందుకంటే, అవి నా పుస్తకాన్ని చదవవు, వాటికి నేను ఏమి రాశాను అనేది కూడా అక్కరలేదు. కాబట్టి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది’’ అన్నాడు.

గెలీలియో తాను చెప్పినట్లుగానే పుస్తకంలో సవరణ చేసి పేజీ చివర్లో ‘‘నా కథనాన్ని రద్దు చేసుకుంటున్నాను. దానివల్ల తేడా ఏమీ ఉండదని నాకు తెలుసు. ఎందుకంటే, వాస్తవంలో మార్పు ఉండదు మరి’’ అని రాశాడు.కొందరంతే! తాము కనుగొన్న దానిని, నిజమని నమ్మినదాన్ని సమాజం ఎంతగా వ్యతిరేకించినా వెనక్కి తగ్గరు. చివరకు ప్రాణాలను కూడా లెక్క చేయరు. ఒక విషయం సత్యమే అయినప్పుడు, దానిని నిరూపించుకోవడానికి ప్రయాస పడవలసిన అవసరం ఏముందసలు?

– ఓషో భరత్‌

మరిన్ని వార్తలు