కోటీశ్వర గణపతి...

28 Aug, 2014 23:13 IST|Sakshi
కోటీశ్వర గణపతి...

అగజానన పద్మార్కమ్
 గజాననమహర్నిశమ్
 అనేకదం తం భక్తానామ్
 ఏకదంతముపాస్మహే ॥

 
జిఎస్‌బి సేవా మండలి వినాయకుడు విలక్షణుడు. ఆయన బంగారు మేని చాయ వాడు. అంతేనా ఆయన ఒళ్లంతా బంగారమే. అందుకే ఈయన అత్యంత సంపన్నుడు. 80 కిలోల బంగారం, 450 కిలోల వెండితో మెరిసిపోయే స్వామి ఆభరణాలలో... నాలుగు చేతులు, భుజాలు, చెవులు, రెండు కాళ్లు, సింహాసనం, తిలకం, జంధ్యం, శంఖం తదితరాలు ఉంటాయి. ప్రభావళి (మకర్), మూషికం, వినాయకుని నైవేద్యం సమర్పించే సామాగ్రి వంటివన్నీ వెండితో రూపొందినవి. ఈ సారి వజ్రోత్సవాల కారణంగా ఏకదంతుడికి... మరో మూడు కిలోల బంగారం, అయిదు కిలోల వెండితో ప్రత్యేకమైన వైజయంతిమాల (హారం) రూపొందించారు. ఈ హారాన్ని కర్నాటకలోని ఉడిపి ప్రాంతంలోని స్వర్ణకారులు తయారుచేశారు. ఈ హారంతో పాటు కెంపులు, పచ్చలు పొదిగిన ఆభరణాలు వినాయకుని కోసం ప్రత్యేకంగా చేయించారు. కేవలం అయిదు రోజులు మాత్రమే కొలువుండే ఈ వినాయకుడిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

కాపాడే స్వామికి కాపలా

వినాయక చవితి వస్తోందంటే ఎక్కడ చూసినా నెల రోజుల ముందు నుంచే సంబరాలు ప్రారంభమవుతాయి... అయితే ప్రత్యేకంగా ముంబైలో దశాబ్దాలుగా వేలాది మండళ్లు ఇక్కడ వినాయకుడికి ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో దేశంలోనే అత్యంత సంపన్నమైనది... ముంబై కింగ్స్ సర్కిల్ ప్రాంతంలోని ‘గౌడ సారస్వత్  బ్రాహ్మణ్ (జిఎస్‌బి) సేవా మండలి’. అరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మండలి వినాయకుడు అత్యంత శ్రీమంతుడు. గత కొన్ని సంవత్సరాలుగా గణేశ విగ్రహం ఎత్తును 12 అడుగులకు మించనీయకుండా జాగ్రత్తపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఈ మండలి. ‘‘ఈసారి వజ్రోత్సవాలు కావడంతో మా జిఎస్‌బి సేవా మండలి వినాయకుని ఉత్సవాలకు మరింత ప్రాముఖ్యత ఇస్తున్నాం’’ అంటున్నారు ఈ కమిటీ ట్రస్టీ సతీశ్ నాయక్. భక్తులను కంటికి రెప్పలా కాపాడే వినాయకుని ఆభరణాలను కాపాడటానికి ఆ భక్తులే శ్రద్ధ తీసుకుంటారు.
 
శ్రీమంతుడికి బీమా...
 
అత్యంత సంపన్నుడైన ఇక్కడి వినాయకుడికి ఈ మండలివారు 258.90 కోట్ల రూపాయలకు బీమా చేశారు. ఈ వినాయకుని ఉత్సవాల్లో ఒక్క రోజు కోసం సుమారు రూ.51.7 కోట్లు బీమా చేశారు. ఈ బీమా... ఉత్సవాలలో పాల్గొనే భక్తులు, అర్చకులు, సిబ్బందితో పాటు విగ్రహం, బంగారం, వెండి ఆభరణాలు... మొదలైన వాటి మీద చేయడం విశేషం. అగ్ని ప్రమాదం, ఉగ్రవాదుల దాడులు, అల్లర్లు ఇలా ఆరు రకాల విపత్తులకు ఈ బీమా వర్తిస్తుంది. వినాయక చవితిని పురస్కరించుకొని మొదటి రోజే ఈ బీమా ప్రారంభం అవుతోంది. ఈ విగ్రహానికి మొదటి రోజే బంగారు ఆభరణాలతో ముస్తాబు చేస్తారు. నిమజ్జనకు కొన్ని గంటల ముందు విగ్రహానికి అలంకరించిన బంగారు ఆభరణాలను తొలగించి వాటిని జాగ్రత్తగా బ్యాంక్ లాకర్‌లో భద్రపర్చే వరకు బీమా కొనసాగుతుంది.
 
భద్రతకు పెద్ద పీట...

వినాయకుడిని దర్శించుకోవడం కోసం అయిదు ద్వారాలు (గేట్లు) ఏర్పాటయ్యాయి. ముఖదర్శనం కోసం సుమారు ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించిన స్కై వాక్‌పై భక్తులు వినాయకుని ముఖదర్శనం చేసుకుని తరిస్తారు.
 
- గుండారపు శ్రీనివాస్
 ఫొటోలు: పిట్ల రాము, సాక్షి ముంబై
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా