గురుదేవుడి మహాత్ముడు

3 Oct, 2018 01:39 IST|Sakshi

మహాత్మా గాంధీ 150వ జయంత్యోత్సవాలు

రవీంద్రనాథ్‌ టాగోర్‌ గాంధీజీని ‘మహాత్ముడు’ అన్నాడు.ఆయన ఇచ్చిన ఆ గౌరవ సంబోధనను జాతి స్వీకరించడంతో గాంధీ ‘మహాత్మా గాంధీ’ అయ్యాడు.టాగోర్‌ని గాంధీజీ ‘గురుదేవ్‌’ అన్నాడు.అప్పటి నుంచి టాగోర్‌ అనే పేరుకు ‘గురుదేవ్‌’ సమానార్థకం అయ్యింది.టాగోర్, గాంధీజీ  ఆత్మీయులు. పరస్పరం సత్యాన్ని అన్వేషించినవారు. సత్యాన్వేషణ కోసం పరస్పరం ఘర్షించుకున్నవారు.గురు దేవుని దృష్టి నుంచి మహాత్ముడిని చూసినప్పుడు మామూలు మనుషులుగా మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది.పాలకులు, యువత, ప్రజలు మహాత్ముడి ఆత్మధోరణిని సంపూర్తిగా అక్కర్లేదు... సహస్రాంశం అనుసరించినా ఈ దేశం సర్వోన్నతం అవుతుందనిపిస్తుంది.గురుదేవులు టాగోర్‌ వివిధ సందర్భాలలో గాంధీజీని ఉద్దేశించి అన్న మాటలు ఇవి.

మహాత్ముడంటే
గాంధీజీని నేను మహాత్ముడని అన్నాను. ఆ మాటకు నిజమైన అర్థమేమిటి? ఎవరి ఆత్మ అయితే విముక్తి చెంది అన్ని ఆత్మల్లోనూ దర్శనమిస్తుందో ఆ ఆత్మ కలిగినవాడే మహాత్ముడు. ఆ అర్థంలో గాంధీజీ మహాత్ముడు. మహాత్ముల కార్యకలాపాలు ఒకరి కోసమో ఇద్దరి కోసమో కావు. అవి మొత్తం ప్రపంచమంతటి కోసం. వాటికి  పరిమితులేమీ లేవు. నిర్బంధాలు లేవు. అవి మొత్తం విశ్వం కోసం. గాంధీజీ కార్యకలాపాలు ఒక కులం మతం జాతి కోసం కాదు. అవి సకల మానవాళి కోసం. అందుకే ఆయన మహాత్ముడు.

స్వీయ సేవను చేసుకోగలమా?
మహాత్మునికి ఉన్న స్వీయ క్రమశిక్షణ మనలో ఎంతమందికి ఉంది... ఎప్పటికైనా ఆ క్రమశిక్షణను వదలకుండా ఆచరించదగ్గ చిత్తశుద్ధిని పొందగలమా చూసుకోవాలి. ఒకసారి మార్చి నెలలో గాంధీజీ శాంతినికేతన్‌లో కొద్ది రోజులు గడిపారు. దక్షిణాఫ్రికాలో మొదలుపెట్టుకున్న నియమావళికి అనుగుణంగా శాంతినికేతన్‌లో కూడా ఆయన ఏ సేవకుడి సహాయమూ కోరలేదు. తన గది తనే తుడుచుకున్నాడు. తన పక్క తనే సర్దుకున్నాడు. తన గిన్నెలు తనే కడుక్కున్నాడు. తన గుడ్డలు తనే ఉతుక్కున్నాడు. శాంతినికేతన్‌లో చదువుకుంటున్న విద్యార్థులు ఇది చూసి ప్రభావితులయ్యారు.వాళ్లల్లో చాలామంది గాంధీని అనుసరించాలని ఆరాటపడ్డారు. మార్చి 10వ తేదీన ఒక ప్రయత్నంగా విద్యార్థులు వంటవాళ్ల పనివాళ్ల పాకీవాళ్ల సేవల్ని పక్కన పెట్టేశారు. ఇదంతా గాంధీజీ పర్యవేక్షణలో జరిగింది. కాని కొన్నాళ్లకు కొన్ని ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఈ స్వీయ సేవను విడిచిపెట్టారు. కాని గాంధీజీ విడిచిపెట్టలేదు. విడువక పోవడమే మహాత్ముల లక్షణం. 

ఆయన త్యాగమూర్తి
చాలామంది ప్రజానాయకులు త్యాగాలు చేస్తుంటారు. కాని అవి రేపు తాము పొందబోయే ఆకర్షణీయమైన లాభాలకు పెట్టుబడి అని భావిస్తారు. గాంధీజీ అందుకు విరుద్ధం. ఆయన  త్యాగానికి మరోపేరు. ఆయన ఎట్లాంటి అధికారాన్నిగాని పదవినిగానీ సంపదనుగానీ పేరునుగానీ కీర్తిగానీ కోరుకోలేదు. కోరుకోరు. మొత్తం భారతదేశ సింహాసనాన్ని ఆయనకు సమర్పిస్తే ఆయన స్వీకరించడు. పైగా ఆ సింహాసనానికున్న వజ్రాలను ఒలిచి పేదలకు పంచి పెట్టేస్తాడు. అమెరికాలో ఉన్న డబ్బంతా ఆయనకు ఇస్తే దానిని మానవాళిని ఉద్ధరించడానికి పనికొచ్చే ఏదో ఒక పనికి ఖర్చు పెట్టేస్తాడు. ఇతరులకు ఏదైనా ఇవ్వడం కోసమే ఆయన ఆత్మ ఎప్పటికీ ఆరాటపడుతూ ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా ఆయనేదీ ఆశించడు. చివరకు కృతజ్ఞతలు కూడా.

ఆయనది క్రీస్తు ప్రభావం
నన్నెవరన్నా గొంతు నులమబోతే నేను సహాయం కోసం అరుస్తాను. కాని గాంధీజీకి ఆ పరిస్థితి ఎదురైతే ఆయన సహాయం కోసం అరవడని కచ్చితంగా చెప్పగలను. తన గొంతు నులిమేవాడిని చూసి ఆయన చిరునవ్వు నవ్వుతాడు. తాను మరణించవలసి వస్తే చిరునవ్వుతోనే మరణిస్తాడు.  క్రీస్తు ప్రభావం అని మనం దేన్నయితే అంటామో అది ఆయనకుంది. ఆయన గురించి ఎంత తెలుçసుకుంటే అంత ప్రేమించగలుగుతాం. 

చెడును ద్వేషించాలి... చెడ్డవారిని కాదు
మనం ద్వేషించవలసింది చెడును తప్ప చెడ్డవారిని కాదని మహాత్ముడు చెప్పాడు. దీనిని పాటించడం అసాధ్యం అనిపిస్తుంది. కాని దాన్నాయన తన జీవితంలో పాటించడం నేను చూశాను. కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా బహిష్కరించిన ఒక ప్రసిద్ధ రాజకీయవేత్తతో ఆయన మాట్లాడుతుండగా నేనక్కడున్నాడు. ఆ పెద్దమనిషితో మాట్లాడుతున్నది వేరే కాంగ్రెస్‌ నాయకుడైతే ఆ నాయకుడు ఆ పెద్దమనిషిని చాలా ఏహ్యభావంతో చూసి ఉండేవాడు. కాని గాంధీజీ అలా చేయలేదు. అతడు చెప్తున్నది సహనంతో సానుభూతితో పూర్తిగా విన్నాడు. అతన్ని కించపరిచే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. అది చూసి నేను ‘గాంధీజీ తాను ప్రవచిస్తున్న సిద్ధాంతాల కన్నా ఉన్నతుడు’ అని అనుకున్నాను.

ముందు తన మీదే.... 
మహాత్ముడు సమాజం కోసం ఒక ప్రయోగాన్ని ప్రతిపాదించే ముందు ఆ కఠిన పరీక్షని తన మీద తాను విధించుకుంటాడు. త్యాగం కోసం ఎదుటివాళ్లకు పిలుపునిచ్చేముందు తనే స్వయంగా దాని మూల్యం చెల్లిస్తాడు.  ముందు ఆయన తన సౌకర్యాలని వదులుకుని తక్కినవాళ్లను త్యాగం చేయమనడానికి సాహసిస్తాడు. ఒక చెడు విజయం కోసం ఆత్మను తాకట్టు పెట్టుకోవడం కన్నా సర్వం కోల్పోవడమే మంచిదనేది గాంధీజీ ఆదర్శం. ఈ ఆదర్శాన్ని రాజకీయాలలో ఆయన బలంగా ప్రతిపాదించాడు. ఇందుకు మనం మహాత్మాగాంధీని గౌరవించుకోవాలి. అవమానాన్ని ధైర్యంగా సహిస్తూ బాధను సహిస్తూ కూడా మనం తిరిగి హింసకు పూనుకోకపోతే మన మీద పీడన చేసే వారు తెల్లముఖం వేసి అశక్తులవుతారని ఆయన నేతృత్వంలో భారతదేశం ప్రతిరోజూ నిరూపిస్తూనే ఉంది. ఆ మనిషి నిజంగానే దేవదూత.ఆయనను మనం మహాత్ముడని పిలుచు కోవడం సముచితం. ఆయన నివసిస్తున్నది ఒక వ్యక్తిగత, సంకుచిత శరీరంలో కాదు. ఈరోజు భారతదేశంలో జన్మించిన రేపు జన్మించనున్న లక్షలాది ప్రజా హృదయాలలో ఆయన నివసిస్తున్నాడు. 

మరిన్ని వార్తలు