మనసులో నాటుకుపోయాయి

16 Apr, 2014 00:24 IST|Sakshi
మనసులో నాటుకుపోయాయి

 నేను సైతం
 పన్నెండేళ్లకే భర్తను పోగొట్టుకున్న పసిహృదయం...పెద్దయ్యాక పచ్చని అడవుల తరపున పోరాటం చేసింది. తనకు నీడలేకపోయినా పదిమందికి తోడుగా నిలబడిన ఆమె పేరు బసంతి. ‘జీవితంతో పోరాడడం మనకెప్పటికప్పుడు తాత్కాలికం. ప్రకృతిని కాపాడుకోవడం కోసం చేసే పోరాటమే శాశ్వతమైంది’ అని చెప్పే ఈ టీచరమ్మ సాధించిన విజయం ప్రకృతి ప్రేమికులకే కాదు... పరిస్థితులు అనుకూలించని ప్రతి ఒక్క మహిళకూ ఆదర్శమే.
 
ఉత్తరాఖాండ్‌లో అల్మొరా జిల్లాలోని ‘గాంధీ ఆశ్రమం’ బసంతి లాంటి వారికోసమే నిర్మించారు. 1980లో పన్నెండేళ్ల వయసులో భర్తను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన బసంతి ఆశ్రమంలో చేరాక ముందు తన చదువు మీద శ్రద్ధ పెట్టింది. నాలుగో తరగతితో ఆగిపోయిన ఆమె చదువు ఆటంకం లేకుండా ఇంటర్ వరకూ వెళ్లింది. ఆ తర్వాత ‘లక్ష్మి ఆశ్రమం’లో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఇక్కడ  వితంతు మహిళలకు ఉచితంగా విద్య నేర్పుతారు. ఒక పక్క టీచర్‌గా పనిచేస్తూనే మరో పక్క ‘మహిళా సంఘటన్స్’ పేరుతో మహిళల్ని చైతన్యపరిచే కార్యక్రమం మొదలుపెట్టింది.
 
కొన్నాళ్లు అక్కడ పనిచేశాక తను పుట్టి పెరిగిన కొండ ప్రాంతం గుర్తుకొచ్చింది. 2002లో డెహ్రాడూన్ డెర్హాడన్ ప్రాంతంలోని కౌసాని నది ప్రాంతానికి వెళ్లి అక్కడ గిరిజన మహిళల కోసం పనిచేద్దామని బయలుదేరింది. ఈలోగా ‘అమర్ ఉజాలా’ పత్రికలో ఒక వార్త చదివింది. ‘నదుల ఒడ్డున అడవుల నరికివేత’ అనే పేరుతో వచ్చిన వార్తాకథనం బసంతిని ఆలోచనలో పడేసింది. ఇంకో పదేళ్లపాటు ఇలాగే అడవుల్ని నరుక్కుంటూ పోతే కౌసాని నది పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని ఆ కథనం సారాంశం. ఆ క్షణమే బసంతి తన లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. కొండప్రాంత మహిళల అండతో అడవుల్ని నరకడాన్ని అరికట్టవచ్చనుకుంది.
 
వంటచెరుకు కోసం అడవులబాట పట్టే మహిళల వెనకే బసంతి కూడా వెళ్లేది. అడవిని ఆనుకుని ఉన్న  ప్రాంతంలో మహిళా సర్పంచ్ పేరు పార్వతీ గోస్వామి. ఆమెతో బసంతికి ఇదివరకే పరిచయం ఉండడంతో మహిళలందర్ని ఒకచోటకు రప్పించి మాట్లాడటం తేలికైంది. ‘మీరు చెట్లను నరకడం వల్లే నదిలో నీళ్లు తగ్గిపోతున్నాయని’ చెబితే మహిళలంతా నోరెళ్లబెట్టారు. చెట్టుకు, నీటికి ఉన్న అనుబంధాన్ని వారికి తెలియజేయడానికి చాలా సమయం పట్టింది. విషయం అర్థమయ్యాక మహిళలంతా బసంతిబాటలో నడవడానికి ఒప్పుకున్నారు.
 
 మహిళలే కాపలా...
అడవిలో ఎండిపోయిన మొక్కల్ని నరికి తీసుకెళ్లే హక్కు గిరిజనలకు ఉంటుంది. పచ్చటి మొక్కల్ని మాత్రం నరకొద్దు. కానీ కొండప్రాంతంలో అటవీఅధికారులు గిరిజనులను అడవిలోపలకి రాకుండా కట్టుదిట్టమైన కంచె ఏర్పాటు చేశారు. గిరిజన మహిళల సాయంతో అడవి చుట్టుపక్కలంతా తిరిగిన బసంతి ఒకరోజు అటవీఅధికారులతో మహిళలకు ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ‘పచ్చటి మొక్కలను కాపాడే బాధ్యత మీదే కాదు... మాది కూడా. ఎండిపోయిన మొక్కలను మాత్రం వంటచెరుకు కోసం తీసుకెళతాం. దీనికి మీరు అనుమతినివ్వండి’ అంటూ ఒక పత్రాన్ని పోలీసులకు ఇచ్చారు అక్కడి మహిళలు. దానికి అటవీ అధికారులు ఒప్పుకున్నారు.  
 
 గిరిజన మహిళలంతా ఒక్కమాటపై నిలబడి పచ్చటి చెట్లను కొట్టకుండా కాపలా కాయడం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం పదేళ్లపాటు కొనసాగింది. ఈలోగా  ఆ మహిళలు అడవిని కాపాడడంతో పాటు బసంతి దగ్గర అక్షరాలు కూడా నేర్చుకున్నారు. గడచిన పదేళ్లలో అడవిలో పెరిగిన సిందూరవృక్షాల సంఖ్యను చూసి అటవీ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ‘ఈ అడవితల్లి ప్రభుత్వానిది కాదు మీది...’ అని చెప్పిన బసంతి మాటలు గిరిజన మహిళల మనసులో నాటుకుపోయాయి. ప్రతిఫలంగా వేలసంఖ్యలో కొత్త మొలకలు మొలిచాయి కౌసాని చుట్టుపక్కల అడవిలో.

మరిన్ని వార్తలు