పర్యావరణ గాంధేయుడు

20 Jul, 2014 22:39 IST|Sakshi
పర్యావరణ గాంధేయుడు

యూపీఏ ప్రభుత్వం గద్దెదిగుతూ తీసుకొన్న ఏకైక మంచి నిర్ణయం అంటూ అనేక మంది ప్రశంసిస్తున్నారు..  యాభై సంవత్సరాల ఆ ఉద్యమ రూపానికి ఈ అవార్డు దక్కడం హర్షణీయమని మరికొందరంటున్నారు. ఆయనకు ‘గాంధీ శాంతి పురస్కారం’ ప్రదానం చేయడం గాంధేయవాదానికే పురస్కారం అనే ప్రశంసలూ వినిపిస్తున్నాయి. ఈ విధంగా నేటి తరానికి పునఃపరిచయమవుతున్నారు చండీప్రసాద్ భట్.
 
దశాబ్దాల క్రితమే పర్యావరణ వేత్తగా పేరు తెచ్చుకొని... ఆ పేరుతో పనిలేకుండా తన మటుకు తాను హిమాలయపర్వత సానువుల్లో ప్రకృతి పరిరక్షణకు పాటుపడుతూ ఉన్న చండీప్రసాద్‌ను ‘గాంధీ పీస్ ప్రైజ్’ వరించింది. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న ఆయన... ఇప్పటికే రామన్ మెగసేసే, పద్మభూషణ్ అవార్డులను అందుకొన్నారు.
 
పర్యావరణ పరిరక్షణ కోసం జరిగిన ముఖ్యమైన సామాజిక ఉద్యమాల్లో ఒకటి ‘చిప్కో’ ఉద్యమం. చరిత్రలో అంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఉద్యమం అది. చెట్లను కాపాడుకోవడానికి వాటిని కౌగిలించుకొని, తమను నరికిన తర్వాతే వాటిని నరకాలంటూ హిమాలయ పర్వత సానువుల్లోని ప్రజలు చేసిన ఉద్యమం అది. అలాంటి ఉద్యమానికి అండదండగా నిలిచిన వ్యక్తుల్లో చండీప్రసాద్ భట్ ముఖ్యులు. సుందర్‌లాల్ బహుగుణ వంటి వారితో కలిసి గ్రామీణ ప్రాంత ప్రజల్లో స్ఫూర్తి నింపారాయన.    
 
రిషికేష్ - బదరీనాథ్ ప్రాంతంలో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న చండీప్రసాద్‌కు అప్పటి సోషలిస్టు నేత జయప్రకాశ్‌నారాయణ్ అంటే అభిమానం. ఆయన ప్రసంగాలు విని స్ఫూర్తి పొందిన భట్... తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితమివ్వాలని భావించారు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో భాగమైన గోపీశ్వర్ ప్రాంతంలో ప్రజాశ్రేయస్సును లక్ష్యంగా చేసుకొని 1964లో దషోలి గ్రామస్వరాజ్ సంఘ్‌ను స్థాపించారు. పండ్లతోటలు, పశుపోషణ, అటవీ ఉత్పత్తులు, అడవులు-సహజవనరుల పరిరక్షణే లక్ష్యంగా అటవీ ప్రాంత ప్రజల్లో అవగాహన నింపడమే ఆ సంస్థ లక్ష్యం.
 
ప్రశాంతంగా ఉన్న గోపీశ్వర్ ప్రాంతాన్ని 1970లో అలకనందా వరదలు ముంచెత్తడంతో జనజీవితం అతలాకుతలం అయ్యింది. చరిత్రలో ఎన్నడూ కలగనంత నష్టం జరిగింది. ప్రభుత్వం దాన్ని ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. అయితే దషోలీ గ్రామ్ స్వరాజ్ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. అది ప్రకృతి విపత్తు కాదు, మానవ తప్పదం వల్ల జరిగిన తప్పు అంటూ వాదించారు.

సహజంగా తన దారిన వెళ్లాల్సిన అలకనందా నదికి అభివృద్ధి పేరుతో జరిగిన విఘాతమే వరదలకు కారణమని వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం వారి వాదనను పట్టించుకోలేదు. దాంతో దషోలీ గ్రామ్‌స్వరాజ్ మండల్ రంగంలోకి దిగింది. వరదలు ఎందుకు వచ్చాయో ప్రజలకు తెలియజెప్పింది. చెట్లను కాపాడుకోవాలని ఉద్బోధించింది. ప్రభుత్వానికి ఆ విషయం అర్థం కాలేదు కానీ, ప్రజలకు మాత్రం బాగా అర్థమైంది. అందుకు రుజువే చిప్కో ఉద్యమం.
 
1980 నాటికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యాపార అవసరాల కోసం చెట్లను నరకడాన్ని పూర్తిగా నిషేధించడంతో చిప్కో ఉద్యమం విజయవంతం అయ్యింది. చండీప్రసాద్ సేవకు గానూ 1984లో ఆసియా నోబెల్‌ప్రైజ్‌గా పేరు పొందిన ‘రామన్ మెగసేసే’ అవార్డు దక్కింది. భట్ సేవలను భారత ప్రభుత్వం ఆలస్యంగానైనా గుర్తించి, 2005లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఈ యేడు మార్చిలో ‘గాంధీ శాంతి బహుమతి’ని ప్రకటించింది. జూలై 15వ తేదీన ఆయనకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేసింది.

ప్రస్తుతం భట్ వయసు 80 యేళ్లు. ఇప్పటికీ ఆయన గోపేశ్వర్ ప్రాంతంలో, రిషికేష్ పక్కన ఉన్న పర్వత సానువుల్లో తిరుగుతూ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. అడవులను, ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటారు. జీవితాంతం ఇలా పర్యావరణ పరిరక్షకుడిగానే కొనసాగుతానంటాడు ఈ అసమాన సేవకుడు!
 
- బి. జీవన్‌రెడ్డి
 

>
మరిన్ని వార్తలు