ఆరగించవయ్యా...ఓ బొజ్జ గణపయ్య...

16 Sep, 2015 04:28 IST|Sakshi
ఆరగించవయ్యా...ఓ బొజ్జ గణపయ్య...

 ఏకదంతుడు, వక్రతుండుడు, లంబోదరుడు, గజాననుడు, విఘ్ననాయకుడు... ఎన్ని పేర్లతో పిలిచినా పలుకుతాడు... ఏ నైవేద్యం పెట్టినా మారు మాటాడక ఆర గిస్తాడు... సామాన్యుడైనా... సంపదలు కలిగినవాడైనా..అందరూ పెట్టేవి ఉండ్రాళ్లే... ఒక్కోరాష్ర్టంలో ఒక్కో రకంగా తయారవుతాయి ఈ ఉండ్రాళ్లు...రేపు వినాయకచవితి... ఈ సందర్భంగా వినాయక నైవేద్యాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం...
 

వేయించిన ఉండ్రాళ్లు
 కావలసినవి:  గోధుమపిండి - పావు కేజీ
 బెల్లం పొడి - 100 గ్రా.
 కొబ్బరి తురుము - 100 గ్రా.
 ఏలకుల పొడి - టీ స్పూను
 నూనె - వేయించడానికి తగినంత
 నువ్వులు - 100 గ్రా. (దోరగా వేయించాలి)
 జాజికాయ పొడి - చిటికెడు
 ఉప్పు - చిటికెడు

 తయారీ : ముందుగా గోధుమపిండిని శుభ్రంగా జల్లించి, అందులో టీ స్పూను నూనె, చిటికెడు ఉప్పు జత చేసి ఉండలు లేకుండా కలపాలి.  తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీ పిండిలా కలిపి సుమారు అరగంటసేపు నాననివ్వాలి.  బాణలిలో బెల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము, ఏలకుల పొడి, జాజికాయ పొడి వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి సన్న మంట మీద సుమారు పావు గంట సేపు ఉడికించాలి.  కలిపి ఉంచుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలు చేసి, చిన్న పూరీలా ఒత్తి, బెల్లం మిశ్రమం అందులో ఉంచి, నాలుగువైపులా పువ్వు ఆకారంలో వచ్చేలా మూసేయాలి. (ఎక్కడా రంధ్రం లేకుండా చూడాలి. ఖాళీలు ఉంటే, స్టఫ్ చేసిన పదార్థం బయటకు వచ్చేస్తుంది).   ఇలా అన్నీ తయారుచేసుకోవాలి.  బాణలిలో నూనె కాగాక ఒక్కో మోదకం వేసి దోరగా వేయించి తీసేయాలి.  వినాయకుడికి నివేదన చేసి ప్రసాదంగా భుజించాలి.
 
 బనానా షీరా
 కావలసినవి : బొంబాయి రవ్వ - కప్పు, నీళ్లు - 2 కప్పులు, అరటి పండు - 1 (మెత్తగా గుజ్జు చేయాలి), నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి = టీ స్పూను, జీడిపప్పులు - 15, కిస్‌మిస్ - 15
 తయారీ :  బాణలిలో నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి వేయించి పక్కన ఉంచాలి.  బొంబాయిరవ్వ వేసి దోరగా వేయించాక, నీళ్లు పోయాలి.
  రవ్వ బాగా ఉడికిన తరవాత అరటి పండు గుజ్జు, ఏలకుల పొడి, పంచదార వేసి బాగా కలపాలి.  పదార్థాలన్నీ బాగా కలిసి ఉడికిన తర్వాత కిందకు దింపేయాలి.  వేడివేడిగా వడ్డించాలి.
 
బెల్లం ఉండ్రాళ్లు
 కావలసినవి : బియ్యప్పిండి - కప్పు, నీళ్లు - ముప్పావు కప్పు, ఏలకుల పొడి - అర టీ స్పూను, బెల్లం పొడి - కప్పు, నెయ్యి - టీ స్పూను, పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు, సెనగపప్పు - టేబుల్ స్పూను

 తయారీ :  సెనగపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి. (నీళ్ల తడి ఉండకూడదు)  బాణలిలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు కలిపి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగించి దింపేయాలి.
  బియ్యప్పిండి, ఏలకుల పొడి, కొబ్బరి తురుము జతచేసి బాగా కలపాలి.
  సెనగ పప్పు జత చేసి మిశ్రమాన్ని మెత్తగా అయ్యేలా బాగా కలపాలి.
  నెయ్యి జత చేసి మరోమారు కలపాలి.  ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి.  ఇడ్లీ రేకులలో వీటిని ఉంచి, కుకర్‌లో పెట్టి, ఆవిరి మీద సుమారు ఏడెనిమిది నిమిషాలు ఉడికించి దించేయాలి.
 
పాఠోళీ
కావలసినవి : పసుపు ఆకులు - 10 పెద్దవి, 20 చిన్నవి, బియ్యప్పిండి - రెండు కప్పులు
 ఉప్పు - అర టీ స్పూను, నీళ్లు - సుమారు ఒకటిన్నర కప్పులు

 ఫిల్లింగ్ కోసం : పచ్చి కొబ్బరి తురుము -  2 కప్పులు, బెల్లం తురుము - 2 కప్పులు
 ఏలకుల పొడి - టీ స్పూను, జాజికాయ పొడి - చిటికెడు

 తయారీ :  ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలాగ గట్టిగా కలిపి సుమారు అరగంట సేపు పక్కన ఉంచాలి.  ఫిల్లింగ్ కోసం తీసుకున్న పదార్థాలను కలిపి పక్కన ఉంచాలి.  పసుపు ఆకులను నీళ్లలో శుభ్రంగా జాడించి, బాగా తుడిచి పక్కన ఉంచాలి.  ఆకు మధ్యలో ఈనెలా ఎత్తుగా ఉండే భాగాన్ని చాకుతో జాగ్రత్తగా తీసేయాలి.  బియ్యప్పిండిని ఆకు మీద సమానంగా పరవాలి.  మధ్య భాగంలో ఫిల్లింగ్ పదార్థం తగు పరిమాణంలో ఉంచాలి.  ఆకుని మధ్యకు మడిచి అంచులను గట్టిగా ఒత్తాలి.  ఇలా అన్నీ తయారుచేసుకుని ఒక్కో ఆకుని ఇడ్లీ రేకులలో ఉంచి కుకర్‌లో పెట్టి ఆవిరి మీద సుమారు పావుగంటసేపు ఉడికించి దింపేయాలి. (విజిల్ పెట్టకూడదు)  కొద్దిగా చల్లారాక వీటిని ఆకుల నుంచి వేరు చేసి పాలతో కాని, నెయ్యితో కాని అందించాలి.

>
మరిన్ని వార్తలు