ముగ్గురు పిల్లలు... నాయినమ్మ

15 Feb, 2020 12:47 IST|Sakshi
గంగవ్వ, ఆమె మనవడు, మనవరాళ్లు

‘అవ్వా, అయ్యా... ఒక్క రూపాయి దానం చెయ్యండయ్యా’ అంటూ బస్టాండ్‌లో చేయిజాపి అడుక్కునే గంగవ్వ వెనుక మూడు ప్రాణాలున్నాయి. వాళ్లే జీవితంగా బతుకుతూ, వాళ్ల ఉన్నతి కోసమే బతుకుతున్న గంగవ్వను కదిలిస్తే కన్నీళ్లే సమాధానం చెబుతాయి.కామారెడ్డి బస్టాండ్‌ ప్రాంతంలో ప్రతి నిత్యం భిక్షాటన చేస్తూ కనిపించే గంగవ్వ వయసు 70 దాటింది. కొడుకులు కూతుళ్లు ఆదరించడం లేదేమో.. అందుకే అడుక్కుంటోందేమో అనుకుంటారంతా. కానీ, అర్ధాంతరంగా మరణించిన కొడుకు పిల్లలను ఎలాగైనా చదివించుకోవాలని ఆ భిక్షాటన చేస్తోందని ఎవరూ ఊహించరు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంలోని కుప్రియాల్‌ ఊరి చివరన ఓ పూరిగుడిసెలో ఉంటుంది గంగవ్వ. ఇద్దరు మనవరాళ్లు, ఓమనవడు ఆమె ఆస్తి. రోజూ పొద్దున లేవగానే గిన్నె చేతిలో పట్టుకుని నాలుగిళ్లు తిరిగి అన్నం అడుక్కువచ్చి ముగ్గురి ఆకలి తీరుస్తుంది. వాళ్లను తయారు చేసి బడికి పంపి, తాను కామారెడ్డి బస్టాండ్‌కు చేరుకుంటుంది. మధ్యాహ్నం వరకు డబ్బులు అడుక్కుని, ఎవరైనా దయతలచి ఏదైనా పెడితే తిని కడుపు నింపుకుని సాయంత్రానికి ఇంటికి చేరుకోవడం ఆమె దినచర్య.

వృద్ధాప్యాన ఒంటి చేత్తో..
గంగవ్వకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. గంగవ్వ పెద్ద కొడుకు సంజీవులు, కోడలు పోచవ్వలను పదేళ్లక్రితం మాయదారి రోగం మింగేసింది. అప్పుడు వాళ్ల పిల్లలు చామంతి, శ్రీకాంత్, వసంతలు పసివారు. ఆ సమయంలో మనవరాళ్లు, మనవడిని గంగవ్వ అక్కున చేర్చుకుంది. అదే సమయంలో ఆమె భర్త కూడా చనిపోవడంతో ఒక్కతే ముగ్గురు పిల్లల బాధ్యతలు తీసుకుంది. రోజూ ఉదయం అన్నం భిక్షం అడిగి  పిల్లలకు తలా కొంచెం తిండి పెట్టి వారిని బడికి పంపేది. మధ్యాహ్నం పూట బడిలో భోజనం తిని ఆకలి తీర్చుకునేవారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత నానమ్మ ఏదైనా పెడితే తిని చదువుకునేవారు. రోజూ బడిలో మధ్యాహ్న భోజనంతో ఆకలి తీర్చుకునే ఆ పిల్లలు బడి సెలవులప్పుడు  పూట గడవక ఇబ్బంది పడుతుంటారు. పెద్ద మనవరాలు చామంతి గతేడాది పదో తరగతి పాసైంది. ఇంటర్‌ చదవాలన్న ఆరాటం ఉన్నా ఆర్థిక స్తోమత లేదని ఇంటి దగ్గరే ఉంటోంది. ఈ మధ్యనే కామారెడ్డిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వర్కర్‌గా చేరింది. ఆమెకు ఇచ్చే వేతనం రోజూ రానుపోను ఖర్చులకే సరిపోతోంది. మనవడు శ్రీకాంత్‌ ప్రస్తుతం కుప్రియాల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. చిన్న మనవరాలు తొమ్మిదో తరగతి చదువుతోంది.

పిల్లల కోసమే బతుకుతున్న
పెద్దోడు సంజీవులు, కోడలు పోచవ్వ సచ్చిపోయినప్పుడు ఈ ముగ్గురు సంటి పిల్లలు. ఆ దినం సంది వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకున్న. వాళ్లు పెరిగి పెద్దోళ్లైన్రు. నేను తిన్నా, తినకున్నా పిల్లల ఆకలి తీర్చేతందుకే బిచ్చం అడుక్కుంటున్న. వాళ్లు సదువుకుంటే కష్టాలు తీరుతయని సదివిస్తున్న.
– కరమంచి గంగవ్వ, కుప్రియాల్‌

ఆమె మాటనే వినుకుంటం

నాకు ఊహ తెలువకముందే అమ్మ, నాన్న చనిపోయిండ్రు. మాకు నాయినమ్మనే అన్నీ తానై చూసుకున్నది. ఇప్పటికీ ఎంతో కష్టపడుతది. అందరిలెక్క మాకు అమ్మా, నాన్న ఉంటే మంచిగుండు అనిపిస్తది. కాని ఏం చేస్తం. నాయినమ్మ మమ్ములను మంచిగ చూసుకుంటది. ఆమె చెప్పినట్టు నడుచుకుంటం.
– వసంత, చిన్న మనవరాలు


అమ్మ, నాయిన.. నాయినమ్మ
మా అమ్మ నాయిన ఎట్లుంటరో నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. మా నాయినమ్మనే అమ్మ, నాయిన లెక్క చూసుకున్నది. ఇప్పటికీ మా కోసమే కష్టపడుతున్నది. ఈ మధ్య కామారెడ్డిలోఆక్యుప్రెజర్‌ వైద్యశాలలో పనిలో చేరిన.  
– చామంతి, పెద్ద మనవరాలు

అన్నీ నాయినమ్మే...

నాకు అమ్మా, నాన్న అన్నీ నాయినమ్మే. చిన్నప్పటి నుంచి నానమ్మతోనే జీవితం. నాయినమ్మ మా కోసం ఎంతో కష్టపడుతోంది. నేను బాగా చదువుకుని నానమ్మ కష్టాలు తీరుస్తా. వానొస్తే గుడిసె మొత్తం కురుస్తది. మాకు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నం.
– శ్రీకాంత్, మనవడు

జీవితమంతా కష్టాలే...
గంగవ్వ జీవితమంతా కష్టాలతోనే సాగిపోయింది. వృద్ధాప్యంలో ఆసరా అవుతారనుకున్న కొడుకులు ఒక్కొక్కరు మాయమయ్యారు. ముగ్గురు కొడుకుల్లో పెద్దోడు సంజీవులు పదేళ్ల క్రితం నయంకాని రోగంతో కన్ను మూస్తే, రెండో కొడుకు రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. చిన్నోడు చిన్న వయసులోనే కనిపించకుండా పోయాడు. బతికున్నాడో లేడో కూడా తెలియదు. ఇద్దరు కూతుళ్లు.. ఎవరి కుటుంబం వారిది. కాలు చేయీ ఆడక తనకు చేసేవాళ్లు లేకపోగా, తనపైనే పెద్ద కొడుకు పిల్లలు ఆధారపడి ఉండడంతో ఆమె జీవితమంతా భిక్షాటనతోనే గడచిపోతోంది.

కుప్రియాల్‌ గ్రామంలో ఉన్న పూరి గుడిసె భారీ వర్షాలు కురిస్తే వాన నీరంతా చేరి ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్యన పైకప్పు నుంచి నీరు జారకుండా ప్లాస్టిక్‌ కవర్‌ కప్పించింది.గంగవ్వకు ఆహార భద్రతా కార్డు ద్వారా 24 కిలోల బియ్యం వస్తాయి. ముగ్గురు పిల్లలు, ఆమె నలుగురు తినాలంటే ఆ బియ్యం పదిహేను రోజులకు సరిపోవు. అంత్యోదయ కార్డు కోసం కలెక్టరేట్‌కు తిరిగినా ఎవరూ కనికరించలేదు. వృద్ధాప్య ఫించన్‌ నెలకు రూ.2016 వస్తోంది. రోజూ భిక్షమెత్తగా వచ్చే డబ్బులు, పింఛన్‌ డబ్బులతో తన మందులకు, పిల్లల చదువులకు, బట్టలకు వెచ్చిస్తోంది.
– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి
ఫోటోలు: అరుణ్‌ గౌడ్‌

మరిన్ని వార్తలు