వెల్లుల్లితో సూపర్‌బగ్స్‌కు చెక్‌

4 Dec, 2017 14:15 IST|Sakshi

దాదాపుగా అందరి వంటిళ్లలో విరివిగా వాడే వెల్లుల్లిలో యాంటీబాక్టీరియల్‌ లక్షణాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, యాంటీ బయోటిక్స్‌కు లొంగని సూపర్‌బగ్స్‌ను కూడా వెల్లుల్లితో సమర్థంగా అరికట్టవచ్చని ఒక తాజా పరిశోధనలో తేలింది. వెల్లుల్లిలో ఉండే ‘అజోనే’ అనే రసాయనం ఎలాంటి మొండిరకం బ్యాక్టీరియాలనైనా ఇట్టే నాశనం చేయగలదని డానిష్‌ శాస్త్రవేత్తల ప్రయోగాల్లో తేలింది.

యాంటీబయోటిక్స్‌ను తట్టుకుని మరీ మనుషుల శరీరంలోని కణజాలానికి అంటిపెట్టుకుని ఉండే బ్యాక్టీరియా డీఎన్‌ఏను వెల్లుల్లిలోని ‘అజోనే’ అనే రసాయనం నాశనం చేయగలుగుతోందని తమ ప్రయోగాల్లో తేలినట్లు కోపెన్‌హాగెన్‌ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ టిమ్‌ హామ్‌ జాకబ్‌సన్‌ వెల్లడించారు. మొండి బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్లు సోకిన వారికి యాంటీ బయోటిక్స్‌తో పాటు వెల్లుల్లి నుంచి సేకరించిన ‘అజోనే’తో తయారు చేసిన ఔషధాలను వాడినట్లయితే ప్రాణాంతక పరిస్థితుల నుంచి బయటపడవచ్చని కోపెన్‌హాగెన్‌ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

మరిన్ని వార్తలు