జనరల్ హెల్త్ కౌన్సెలింగ్

6 Jul, 2015 22:49 IST|Sakshi

అకస్మాత్తుగా మెలకువ వస్తోంది..?
 
నా వయస్సు 78 ఏళ్లు. ఇంతకు ముందులాగా గాఢనిద్ర పట్టడం లేదు. అర్ధరాత్రుళ్లు అకస్మాత్తుగా నిద్రలోంచి లేస్తున్నాను. చాలాసేపు నిద్రపట్టక అలాగే కూర్చుంటున్నాను. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
 - రాఘవేంద్రప్రసాద్, గుంటూరు

నిజానికి చాలామందిలో వయసు పెరుగుతున్న కొద్దీ నిద్రపోయే వ్యవధి తగ్గుతుంది. అయితే మీరు అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తున్నారని చెబుతున్నారు. బహుశా  దీనికి కారణం మీలోని అంతర్గత మానసిక ఆందోళన కావచ్చు. ఇక మీ వయసు 78 ఏళ్లు అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి పూర్తిస్థాయి వైద్యపరీక్షలు చేయించుకోండి. ఒక్కోసారి అధిక రక్తపోటు (హైబీపీ), సెరిబ్రల్ సర్క్యులేషన్ (మెదడుకు రక్తప్రసరణ) సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా వైద్యనిపుణులకు చూపించండి.
 
నాకు 28 ఏళ్లు. తరచూ వెన్నెముక, నడుం భాగాల్లో నొప్పి వస్తోంది. నోట్లో పెదవులపై, దవడలపై, నాలుక కింది భాగంలో తరచూ పొక్కులు వస్తున్నాయి. ఎప్పుడూ జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంటోంది. నా సమస్యకు కారణం ఏమిటి? దీనికి తగిన పరిష్కారం చెప్పండి.
 - ఎల్. దొరబాబు, మచిలీపట్నం

 మీరు వివరించిన లక్షణాలను బట్టి ప్రధానంగా మీ కీళ్లనొప్పులు, వెన్నెముక, మెడ, తుంటి భాగాల్లో ఉండటం, పెదవులపైనా, దవడలపైనా పొక్కులు, జ్వరంగా ఉండటం వంటివి చూస్తుంటే... మీకు కీళ్లవాతం (సీరోనెగెటివ్ ఆర్థోపతి) వంటి వ్యాధులు ఉండవచ్చునేమో అనిపిస్తోంది. ఇక కొన్ని సందర్భాల్లో విటమిన్ బి-12 లోపాల వల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట మీరు దీనికి సంబంధించిన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్-బి 12 లోపాలు లేవని నిర్ధారణ అయి, మీకు కీళ్లవాతానికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్లు తెలిస్తే దానికి తగిన మందులు కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మానసికంగా ఒత్తిడి, డిప్రెషన్ వంటివి ఉన్న సమయంలోనూ మీరు చెబుతున్న లక్షణాలు బాగా తీవ్రమవుతుంటాయి.  కాబట్టి మీకు అలాంటి ఒత్తిళ్లు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారాలు కనుగొని ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని అధిగమించడానికి యోగా వంటి మార్గాలను అనుసరించండి. మీరు ఒకసారి జనరల్ ఫిజీషియన్‌ను కలిసి వారి సలహా మేరకు అవసరమైన పరీక్షలు, చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
 
 

మరిన్ని వార్తలు