జన్యువులను నిర్వీర్యం చేసి బ్యాక్టీరియాను చంపేస్తారు

9 Jun, 2018 01:32 IST|Sakshi

వ్యాధికారక బ్యాక్టీరియాను చంపేయాలంటే ఏం చేస్తాం. యాంటీబయాటిక్స్‌ వాడతాం. అంతేకదా.. అయితే ఈ క్రమంలో మనకు మేలు చేసే బ్యాక్టీరియా కూడా అంతమైపోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పెన్‌ స్టేట్‌ మెడికల్‌ కాలేజీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. బ్యాక్టీరియా జన్యువులను నిర్వీర్యం చేయడం ద్వారా కేవలం చెడు బ్యాక్టీరియా మాత్రమే నాశనమయ్యేలా చేయవచ్చునని వీరు అంటున్నారు. యాంటీబయాటిక్స్‌ వాడినప్పుడు మన పేగుల్లో సి.డిఫికైల్‌ అనే బ్యాక్టీరియా ఎక్కువవుతుంది.

ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఆ బ్యాక్టీరియా మనుగడకు కీలకమైన జన్యువులను నిర్వీర్యం చేసే మందులు తయారు చేసి వాడారు. సక్రమంగా పనిచేయడంతో ఇదే పద్ధతిని ఇతర బ్యాక్టీరియాకు వర్తింప చేయవచ్చునని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అరుణ్‌ శర్మ అంటున్నారు. బ్యాక్టీరియా రకాన్ని బట్టి మందును తయారు చేస్తున్నాం కాబట్టి ఆ బ్యాక్టీరియా మాత్రమే నాశనమవుతుందని.. మిగిలినవాటికి ఏ మాత్రం హాని జరగదు కాబట్టి దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని వివరించారు. అభివృద్ధి చేసిన మూడు ముందుల ద్వారా కూడా అతితక్కువ దుష్ప్రభావాలు కనిపించడం ఇంకో విశేషమని చెప్పారు.  

>
మరిన్ని వార్తలు