డెంగీని దూరం పెట్టే దోమలు!

18 Jan, 2020 03:06 IST|Sakshi

డెంగీ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది దోమే. ఈ దోమలు గనక డెంగీ కారక వైరస్‌ను తమ శరీరంలోకి రానివ్వకపోతే వ్యాధన్నదే లేదు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్త ఒమర్‌ అక్బరీ ఓ విన్నూతమైన ప్రయత్నం చేశారు. డెంగీ వైరస్‌ను దూరంగా పెట్టేలా దోమలను డిజైన్‌ చేశారు. అంటే ఈ దోమలతో డెంగీ అస్సలు వ్యాపించదన్నమాట. పీఎల్‌ఓఎస్‌ పాథోజెన్స్‌ జర్నల్‌లో పరిశోధన తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. నాలుగు వెరైటీల డెంగీ వైరస్‌లను దూరంగా పెట్టేలా కొత్త రకం దోమలును డిజైన్‌ చేశారు. డెంగీని వ్యాప్తి చేసే ఆడ దోమల్లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఓ యాంటీబాడీ ఉత్పత్తి అయ్యేలా చేశారు. దీంతో ఆడదోమ రక్తం పీల్చుకోగానే ఈ యాంటీబాడీ పనిచేయడం మొదలవుతుంది.

ఈ రకమైన దోమల సాయంతో అన్ని దోమజాతుల్లోనూ ఈ యాంటీబాడీ ఉత్పత్తి అయ్యేలా చేయవచ్చునని ఒమర్‌ అక్బరీ తెలిపారు. మనిషి రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టి అవి వ్యాధులను అడ్డుకునేలా చేయడం ఈ పరిశోధన తాలూకూ విశేషం. దోమల ద్వారా వచ్చే ఇతర వ్యాధులను కూడా ఈ పద్ధతితో అడ్డుకోవచ్చునని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఉష్ణమండల ప్రాంతాల్లో డెంగీ సమస్య కొన్ని లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. ఆసియా, లాటిన్‌ అమెరికాల్లో ఈ వ్యాధి కారణంగా చాలామంది పసిపిల్లలు మరణిస్తున్నారు కూడా. ప్రస్తుతం ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోగా.. లక్షణాలను నియంత్రిస్తూ వేచి ఉండటమే ప్రస్తుతం ఆచరిస్తున్న పద్ధతి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా