ఈక్వల్‌ ఈక్వల్‌

28 Dec, 2017 23:45 IST|Sakshi

చెట్టు నీడ

దేవుడి సృష్టిలో మనుషులమంతా సమానమే. కాకపోతే సృష్టి అవసరాల కోసం ఆడ, మగ అని వేరు చేసి ఎవరి దేహధర్మాలను వారికి ఇచ్చాడు. ఆ ధర్మాలకు అనువుగా స్త్రీ పురుషుల పని విభజన జరిగింది తప్ప ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని కాదు. ఒక పని ఎక్కువ, ఒక పని తక్కువ అని కాదు. ప్రపంచాన్ని ఇప్పుడు కంప్యూటర్‌ నడిపిస్తోంది. అందులో హార్డ్‌వేర్‌ గొప్పా? సాఫ్ట్‌వేర్‌ గొప్పా? రెండూ గొప్పే. ఒకటి లేకపోయినా పని కాదు. అంటే రెండింటికీ సమానవైన విలువ ఉంది. దేన్నీ తక్కువ చెయ్యడానికీ, దేన్నీ ఎక్కువ చెయ్యడానికీ లేదు. ఈక్వల్‌ ఈక్వల్‌. ఇందులోనూ మళ్లీ హార్డ్‌వేర్‌ అంటే మగవాడనీ, సాఫ్ట్‌వేర్‌ అంటే స్త్రీ అనీ పోలిక తెస్తున్నారు. అదీ కరెక్టు కాదు. ఆడవాళ్లల్లో హార్డ్‌వేర్‌ నిపుణులు ఉన్నారు.

మగవాళ్లలో సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పర్ట్‌లు ఉన్నారు; బైక్‌లు నడుపుతున్న ఆడవాళ్లు ఉన్నారు. ఇంటిపనులన్నీ చక్కగా చేసే మగవాళ్లూ ఉన్నారు. ఎవరి ప్రాముఖ్యం వాళ్లది. అయితే గుర్తింపులో, కష్టానికి ప్రతిఫలం పొందడంలో మాత్రం మహిళలు మగవాళ్లకంటే తక్కువగా ఉంటున్నారు. ఎంత అన్యాయం! ఎంత అసమానత! పని గంటలు సమానం అయినప్పుడు, ప్రతిఫలం కూడా సమానంగానే కదా ఉండాలి. అలా కాకుండా.. వివక్ష చూపుతున్నామంటే దేవుడి సృష్టిపైనే వివక్ష చూపుతున్నాం అని. ఎంత అపరాధం! చరిత్రలో ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. 1975 డిసెంబర్‌ 29న బ్రిటన్‌ పార్లమెంటు.. ‘ఈక్వల్‌ పే, ఈక్వల్‌ రైట్‌..’ చట్టాన్ని తెచ్చింది. ఆఫీస్‌లలో, సమాజంలో స్త్రీపురుష సమానత్వం ఉండాలని శాసించింది. మనుషులు అనుకోవాలే కానీ, శాసనాలు అవసరమా? అవసరం లేదు. దేవుడి అభీష్టాన్ని నెరవేర్చడానికి మనిషికి శాసనాలు అక్కర్లేదు. సంకల్పం చాలు. 

మరిన్ని వార్తలు