భౌగోళిక అద్భుతం నయాగరా...

24 Aug, 2014 18:52 IST|Sakshi
భౌగోళిక అద్భుతం నయాగరా...

విదేశాలలో!
 
ప్రపంచంలోనే భౌగోళికంగా ప్రసిద్ధి చెందిన నయాగరా జలపాతం కెనడా, అమెరికా దేశాల సరిహద్దులో ఉంది. 167 అడుగుల ఎత్తు నుంచి జలపాతం కొండపై నుంచి కిందికి పడుతుండే దశ్యం మనోహరం. న్యూయార్క్ రాష్ర్టంలోని బఫెల్లో పట్టణానికి సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లను చేసింది. ఒకే సమయం లో కెనడా, అమెరికా దేశాల ప్రజలు, టూరిస్టులు సందర్శించేందుకు భారీ ఏర్పాట్లున్నాయి.

కెనడాలోని హార్‌షూ జలపాతం, నయాగరా జలపాతం పక్క పక్కనే ఉన్నాయి. అయితే విస్తీర్ణంలో హార్‌షూ జలపాతం కంటె నయాగరానే పెద్దది. నయాగర జలపాతాన్ని అతి సమీపం నుంచి పడవలోనూ, సొరంగమార్గం ద్వారా సందర్శించవచ్చు. పడవలో 17 డాలర్లు, సొరంగమార్గంలో వెళ్లేందుకు 12 డాలర్లు చెల్లించాలి. నయాగరాను సందర్శించేందుకు మెయిడ్ మిస్త్ నుంచి కిందికి లిఫ్ట్‌లో వెళ్లాలి. పడవలోకి వెళ్లే ముందు సందర్శకులకు రెయిన్‌కోట్ ఇస్తారు.

పడవ కెనడాలోని హార్స్‌షూ జలపాతం దగ్గరగా వెళుతుంది. అ సమయంలో పై నుంచి దుముకుతున్న జలపాతాన్ని అతి సమీపం నుంచి తిలకించడం జీవితంలో మరపురాని అనుభూతిగా మిగులుతుంది. అక్కడ నుంచి పడవ నయాగరా జలపాతం వైపు మళ్లుతుంది. అక్కడ సాయంత్రం సూర్యకిరణాలు పడడం వల్ల ఇంధ్రదనుస్సు సందర్శకులకు కనువిందు చేస్తుంది. కెనడా వైపు నుంచి వచ్చే సందర్శకులకు ఎర్ర రంగు రెయిన్‌కోట్, అమెరికా వైపు నుంచి వచ్చే వారికి నీలిరంగు రెయిన్‌కోట్ ఇస్తారు.

అమెరికా సరిహద్దు నుంచి కెనడాలోని భవనాలు, రోడ్లు, కార్లు, ఇతర దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. నయాగరా జలపాతం అడుగు భాగానికి చేరుకునేందుకు కొండ ను చీల్చి సొరంగ మార్గం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలోకి వెళ్లేందుకు నయాగర నది పై నిర్మించిన వంతెన దాటి అవతలి వైపుకు వెళ్లాలి. ఈ మార్గంలో వెళ్లే సందర్శకులకు జారిపడిపోకుండా ప్రత్యేకమైన పాదరక్షలు ఇస్తారు.

ఆ మార్గం దాటి వెళ్లే దారిలో తెల్లని పక్షులు స్వాగతం పలుకుతాయి. పక్షులను దాటి మెట్ల మార్గం ద్వారా నది సమీపంలోకి వెళ్లి, అక్కడ నుంచి జలపాతం పడుతున్న ప్రాంతాన్ని అతి సమీపం నుంచి చూడవచ్చు. రాత్రి పూట జలపాతం నీరు నీలి, ఎరుపు, పసుపు రంగుల్లో తిలకించవచ్చు.                             
 
  - జి.గంగాధర్
 

మరిన్ని వార్తలు