‘మై డాడీ ఛేంజ్డ్‌ ద వరల్ట్‌’

17 Jun, 2020 02:45 IST|Sakshi
తండ్రి తలపులలో చిన్నారి జియానా

స్కూల్లో చేరే టైమ్‌ వచ్చేసింది.  సీటివ్వడానికి స్కూళ్లన్నీ రెడీగా ఉన్నాయి.  యూనివర్శిటీలు కూడా  స్కాలర్‌షిప్‌ సిద్ధం చేసి పెట్టాయి!! డిస్నీ షేర్స్‌ కానుకగా వచ్చాయి. డాలర్లు లక్షల్లో జమ అవుతున్నాయి. 
చిట్టి చిలకమ్మడల్‌గానే ఉంది.  ‘అమ్మ కొట్టిందా? అని అడగలేం.  నాన్నను పోలీసులు కొట్టిన సంగతి మనకు తెలియకపోతే కదా!!

‘మై డాడీ ఛేంజ్డ్‌ ద వరల్ట్‌’. జార్జి ఫ్లాయిడ్‌ నివాళి ప్రదర్శనలో ఆయన ఆరేళ్ల కూతురు జియానాను తన భుజాలపైకి ఎక్కించుకుని, ఆమె చేతుల్ని తన చేతులతో పైకి లేపుతూ.. డైరెక్టర్‌ స్కిప్ట్‌జ్‌ ఆ చిన్నారి చేత పదే పదే చెప్పించిన మాట.. మై డాడీ ఛేంజ్డ్‌ ద వరల్డ్‌. ‘మా నాన్న ప్రపంచాన్ని మార్చేశాడు’. నిజమే. ఫ్లాయిడ్‌ ఈ ప్రపంచాన్ని మార్చేశాడు. జాత్యహంకార దేశాలన్నీ మళ్లొకసారి నల్లజాతి వారి మనోభావాలకు తగ్గట్టు నడుచుకోవడమెలా అని నేర్చుకోవడం మొదలుపెట్టాయి! పోలీసు హింస, జాతి అసమానతలకు వ్యతిరేకంగా అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఒక బిల్లు కూడా ప్రతిపాదనకు వచ్చింది. అయితే ఫ్లాయిడ్‌ మార్చదలచుకున్నది తన కూతురు జీవితాన్ని మాత్రమే. ఆమెకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్లాన్‌ గీసుకుంటుండగా పోలీసుల అమానుషత్వానికి ఊపిరి ఆడక కుప్పకూలిపోయింది ఆ ఆశలసౌధం.

జియానాకు ఇప్పుడు తండ్రి లేడు. కానీ ప్రపంచం జియానా పక్కన ఉంది. జియానాను అక్కున చేర్చుకుంది. తల్లి, బంధువులు ఆమెకు తండ్రి లేని లోటు తెలియకుండా ఉండటం కోసం తండ్రి ఎంత గొప్పవాడో ఆమెఏడుపు మొదలుపెట్టబోయే ప్రతిసారీ తెలియబరుస్తున్నారు. జియానాకు తండ్రి గొప్పదనం తెలుస్తూనే ఉంది కానీ, తండ్రి భుజాలెక్కి తిరిగే తన గొప్పతనాన్ని కోల్పోయింది. మనసు లోపలి ఆ కోల్పోయిన భావాన్ని ఎలా చెప్పగలదు భాషైనా పూర్తిగా రాకుండానే. ఇంట్లో ఇలా ఉంటే.. బయట జియానాను తమ చైల్డ్‌గా సొంతం చేసుకుంటున్న తెల్లజాతి కుటుంబాలూ ఉన్నాయి. ‘‘ఫ్లాయిడ్‌ కూతురుకు నేను ఏనాటికైనా సమాధానం చెప్పుకోవలసి వస్తుంది’’ అంటూ సెరీనా భర్త అలెక్స్‌ ఇప్పటికే తన ‘రెడిట్‌’ కంపెనీ బోర్డులో తన స్థానం నుంచి వైదొలగి, ఆ స్థానాన్ని నల్లజాతి వారికి రిజర్వు చేశారు. ఫ్లాయిడ్‌ మరణంతో ఇంతవరకు జరుగుతూ వస్తున్నదంతా నల్లజాతి వారిని ప్రతి స్థాయిలోనూ గుర్తించి, గౌరవించడం. ఇక ఇప్పుడు జరుగుతున్నది ఆయన కూతుర్ని చేరదీయడం. 

ప్రముఖ అమెరికన్‌ గాయని, సీనియర్‌ నటి, నిర్మాత బార్బ్‌రా స్ట్రయిశాండ్‌ (78) జియానా పేరిట డిస్నీలాండ్‌ స్టాక్స్‌ కొని జియానాకు కానుకగా ఇచ్చారు. దాంతో జియానా ఇప్పుడు డిస్నీలాంyŠ  కంపెనీలో యాజమాన్య హక్కులు గల ఒక భాగస్వామి అయింది! ఆ స్టాక్‌ సర్టిఫికెట్‌ను చిరునవ్వుతో రెండుచేతుల మధ్య పెట్టుకుని తీయించుకున్న ఫొటోను జియానా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి.. ‘ఐ యామ్‌ నౌ ఎ డిస్నీ స్టాక్‌హోల్డర్‌. థ్యాంక్యూ’ అని బార్బ్‌రాకు ధన్యవాదాలు తెలిపింది. ఇటీవలే మొదలైన జియానా ఇన్‌స్టాగ్రామ్‌లో 36 వేలమందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఓఫ్రా విన్‌ఫ్రే, మిషెల్‌ ఒబామా వంటి ప్రముఖులు కూడా ఈ చిన్నారిని ఫాలో అవుతున్నారు. సోమవారం ఆమె ఇన్‌స్టాలో ఆమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ కాన్యే వెస్ట్‌ ప్రత్యక్షం అయ్యాడు. తన కాలేజీ చదువుకయ్యే ఖర్చంతా సేవ్‌ చేసి ఉంచుతానని హామీ ఇచ్చిన కాన్యేకు ధన్యవాదాలు తెలుపుతో జియానా ఒక పోస్ట్‌ పెట్టింది.

టెక్సాస్‌ సదరన్‌ యూనివర్సిటీ పూర్తి స్కాలర్‌షిప్‌తో జియానాను చదివించుకుంటామని గతవారం తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది! జియానా కోసం ఏర్పాటైన ‘గో ఫండ్‌ మీ’కి ఇప్పటి వరకు 20 లక్షల డాలర్లకు పైగా విరాళాలు జమ అయ్యాయి. ఈ సహాయాలన్నిటికీ జియానా థ్యాంక్స్‌ చెబుతూనేమధ్య మధ్య ‘స్టాప్‌ కిల్లింగ్‌ ఫాదర్స్‌’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ విజ్ఞప్తులను పోస్ట్‌ చేస్తోంది.


చేతిలో డిస్నీ స్టాక్స్‌తో , తండ్రి, తను ఉన్న ఫొటోతో 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు