జార్జ్‌ లూయీ బోర్హెస్‌ గ్రేట్‌ రైటర్‌

5 Nov, 2018 00:39 IST|Sakshi

బోర్హెస్‌ ఎంత రచయితో, అంతకంటే ఎక్కువ పాఠకుడు. ఒక పాఠకుని జీవితం కూడా వేరే ఏ జీవితంతోనైనా సమానంగా సమృద్ధమైనదే అంటాడు. ‘అందరూ తాము రాసిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటారు. కాని నేను చదివిన పుస్తకాల గురించి గొప్ప చెప్పుకుంటాను’ అనేవాడు. పఠనాన్ని బోర్హెస్‌ ఎంత ఆనందమయం చేసుకున్నాడంటే, స్వర్గం కూడా గ్రంథాలయంలా ఉండివుంటే బాగుండేదని తలపోశాడు. అర్జెంటీనాలో జన్మించిన బోర్హెస్‌(1899–1986) తొమ్మిదేళ్లప్పుడే ఆస్కార్‌ వైల్డ్‌ ‘ద హ్యాపీ ప్రిన్స్‌’ను స్పానిష్‌ భాషలోకి అనువదించాడు. కానీ అది వాళ్ల నాన్న చేశాడనుకున్నారట. తరువాత ఆయన ఎన్నో పుస్తకాలు రాసినప్పటికీ, వాటిలో కొన్ని అచ్చువేసినప్పటికీ వాటన్నింటినీ తన ‘ప్రాక్టీస్‌’గా మాత్రమే పరిగణించాడు. కవీ, విమర్శకుడూ కూడా అయిన బోర్హెస్‌ మేజిక్‌ రియలిజంగా ప్రసిద్ధి చెందిన విశిష్ట కథన ప్రక్రియకు ఆద్యుడిగా నిలిచాడు.

‘ఫిక్షన్స్‌’, ‘ది అలెఫ్‌’ ఆయన కథాసంకలనాలు. తొమ్మిదేళ్లపాటు బోర్హెస్‌ లైబ్రరీలో పనిచేశాడు. అప్పుడో సహోద్యోగి, ‘జార్జ్‌ లూయీ బోర్హెస్‌’ అనే రచయిత పేరూ, ఇతడి పేరూ ఒకటేకావడం; పైగా ఇద్దరికీ ఒకే పుట్టినరోజు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట! రోజూ పుస్తకాలు సర్దే ఈ యువకుడే ఆ రచయితని అతడు మాత్రం ఎలా నమ్మగలడు! విపరీతంగా చదవడం వల్ల 55 ఏళ్ల వయసులో బోర్హెస్‌కు చూపు పోయింది. ఒక కళాకారునికి సంభవించే ప్రతిదీ అతని కళకు కావాల్సిన ముడిసరుకేనని నమ్మి, అంధత్వాన్ని కూడా తన జీవితానికి దక్కిన బహుమతిగా స్వీకరించాడు. డిక్టేషన్‌ చెబుతూ రచనలు చేశాడు.

మరిన్ని వార్తలు