భర్తను అలా దారికి తెచ్చుకుంది

21 Mar, 2016 12:12 IST|Sakshi
భర్తను అలా దారికి తెచ్చుకుంది

కేస్ స్టడీ


లక్ష్మమ్మకు కానిస్టేబుల్ కనకరాజుతో వివాహమై ఐదేళ్లయింది. ఒక్కతే అమ్మాయి కావడంతో లక్ష్మమ్మ తలిదండ్రులు కడుపుకట్టుకుని మరీ చీటీలు వేసి, ఐదులక్షల వరకు కూడబెట్టారు. దూరపు బంధువైన కనకరాజు పోలీసుగా సెలక్టయ్యాడని ఐదులక్షలు అతని చేతిలో పోసి,పెళ్లి చేశారు. ఓ రెండేళ్లు సజావుగా ఉన్నాడు కనకరాజు. కానిస్టేబుల్‌గా పోస్టింగ్ వచ్చాక భార్యను నిర్లక్షం చేయడం, కొట్టడం,  కట్నం చాలలేదని హింసించడం ఎక్కువ చేశాడు. లక్ష్మమ్మను అకారణంగా ఇంటినుండి గెంటివేశాడు.

లక్ష్మమ్మ విధిలేక 498 ఎ కేసు పెట్టింది. పోలీసు ఉద్యోగంలో ఉండటం వల్ల పైఅధికారులను కాకాపట్టి, కేసు బుక్ కానివ్వకుండా మేనేజ్ చేశాడు కనకరాజు. దాంతో ప్రైవేట్ కేస్ వేసింది లక్ష్మమ్మ. అధికారుల కాళ్లావేళ్లాపడి కేసు బుక్ కానివ్వలేదు. తీవ్రంగా కుంగిపోయిన లక్ష్మమ్మ, తెలిసిన వారి సలహాతో మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ప్రకారం మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు చర్య తీసుకునే అధికారం కమిషన్‌కు ఉంది.

ఎవరినైనా చట్టవ్యతిరేకంగా నిర్బంధించడం, బుద్ధిపూర్వకంగా కేసులో ఇరికించటం, బలవంతంగా బాల్యవివాహం చేయడానికి ప్రయత్నించడం, అపహరణ, మానభంగం, హత్యాయత్నం, మహిళలపై వేధింపులు జరిగినప్పుడు తగిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం అవడం వంటి సందర్భాలలో మానవ హక్కుల కమిషన్ చర్యలు తీసుకోవచ్చు. లక్ష్మమ్మ కేసులో కమిషన్ స్పందించి, కేసు నమోదు చేయమని పోలీసులను ఆదేశించింది. భార్య చేసిన ఆరోపణలు రుజువైతే ఉద్యోగం ఊడడంతోపాటు శిక్ష కూడా తప్పదని గ్రహించిన కనకరత్నం భార్యను క్షమాపణ వేడుకుని, కాపురానికి తెచ్చుకున్నాడు కనకరాజు. లక్ష్మమ్మ కథ అలా సుఖాంతమైంది.

మరిన్ని వార్తలు