ల్యాప్‌టాప్‌

21 Feb, 2019 00:04 IST|Sakshi

ఫర్‌ హిమ్‌? ఫర్‌ హర్‌?

‘నేను మగ’ అని హెల్ప్‌ చెయ్యకపోవడం కాదు. ‘ఆమె ఆడ’ అని హెల్ప్‌ చెయ్యడం కాదు. ఇంట్లో పనిని మగవాళ్లు పని అనుకోవడం, అనుకోకపోవడాన్ని బట్టే.. ఇంట్లో ఆడవాళ్లకు సహాయం అందడం, అందకపోవడం ఉంటుంది!

కెవ్వుమంది ఆమె! ‘ఏంటీ?!’ అని పైకి లేచాడతను. ‘బ..బ.. బల్లి’ అంది. ‘ఎక్కడ?’. ‘బాత్రూమ్‌’లో. చిరాకుపడ్డాడు. బల్లికి భయపడ్డం ఏంటి! నేరుగా బాత్రూమ్‌లోకి వెళ్లాడు. కిటికీలో బల్లి ఇంకా అక్కడే ఉంది. అతడి వెనుక నుంచి ఆమె ఇంకా భయంగానే బల్లివైపు చూస్తోంది. ‘మీవారిని తీసుకొచ్చావా?’ అని ఆ బల్లి తననే చూస్తున్నట్లు అనిపించింది ఆమెకు. బల్లి దగ్గరకు వెళ్లాడు అతను. అదిలించాడు. కదిలించాడు. ఎగిరి కిందపడింది. మళ్లీ కెవ్వుమంది ఆమె. ఆమె చేతిలోని చీపురును తను తీసుకుని బల్లిని తరిమేశాడు.కయ్యిమన్నాడు అతడు! ‘ఏంటీ!’ అని పరుగెత్తుకొచ్చింది ఆమె. ‘బూజు’ అన్నాడు. ‘ఎక్కడ?’ అంది. ‘అదేమిటి?’ అన్నాడు. తలెత్తి చూసింది. గదికి పైన ఓ మూల ఉంది. బూజుకర్ర తెచ్చింది. ‘నిన్ను పంపించారా మీవారు, తను చెయ్యనని’ అని ఆ బూజు తనను అడిగినట్లుగా ఆమెకేమీ అనిపించలేదు. తనకు అందకపోతే కదా భర్తనే వెళ్లమనడం. కర్రను రెండు చుట్లు చుట్టి శుభ్రం చేసి వెళ్లిందామె. ఈలోపు, నోటికి తీసుకోబోతూ పక్కన పెట్టేసిన టీ కొంచెం చల్లారిపోయింది. నష్టమేం లేదు. మళ్లీ వేడి చేసుకుంటుంది. తాగబోతుండగా మళ్లీ కయ్యిమని పిలుపొచ్చినా మళ్లీ టీని అక్కడ పెట్టేసి వెళుతుంది. ఆమెకు మూమూలే.. రోజుకి రెండు మూడు ‘కయ్‌’లన్నా వినడం. ఆమెకు కోపం రాదు. ఆమె కెవ్వుమన్నందుకు అతడికి చిరాగ్గా అనిపించవచ్చు కానీ, అతను కయ్‌మన్నందుకు ఆమెకు కోపం రాదు! 

బల్లినంటే ఆమె తరమలేకపోయింది కానీ, బూజును అతడు తుడిచేయొచ్చు. బూజేమీ బల్లిలా ఒళ్లు తిప్పుకుంటూ వెళ్లదు. కళ్లు మిటకరిస్తూ చూడదు. తోకను కదల్చదు. అదో టైపులో కటకటమని అరవదు. ఇవన్నీ కాదు, బల్లి అంటే ఆమెకు ఉన్నట్లుగా, బూజు అంటే అతడికి  భయం లేదు. మరి తనే బూజుకర్ర తీసుకొచ్చి ఆమె చుట్టినట్లు రెండు చుట్లు చుట్టి బూజును తీసేయొచ్చు కదా! తీసేయొచ్చు కానీ, ఆమేం పుట్టింట్లో లేదు కదా.. వచ్చేందుకు టైమ్‌ పడుతుంది, ఈలోపు బూజు ఎగిరొచ్చి తన నెత్తి మీదో, భుజం మీదో పడుతుంది.. అనుకుని బూజుకర్ర అందుకోవడానికి!తప్పేం లేదు. సరిగ్గానే ఉన్నాడతడు. ఇల్లు దులపడం ఆడ పని, మగ పని అని అనుకునేంత దూరంగా కూడా ఏమీ వెళ్లిపోలేదు. తను పనిలో ఉన్నట్లుగానే, తనలా ఇంట్లో ఉన్న మరో మనిషి కూడా ఏదో పనిలో ఉంటుందన్న ఆలోచనైతే రావాలి. రాలేదు. బూజు కనిపించింది.. కయ్యిమన్నాడు. అది కూడా కాదు. బూజు దులపడాన్ని అసలతడు పనే అనుకోలేదు. దాన్ని పని అనుకుని ఉంటే, లోపల మనిషి చేస్తున్నదీ పనే అనుకునేవాడు. పనిలో ఉన్న మనిషిని పిలిచి మళ్లీ ఒక పని చెప్పేవాడు కాదు. లేచి తనే చేసేవాడు. లేదంటే, ఆమె తన పని పూర్తి చేసుకుని అటుగా వచ్చినప్పుడు.. పని గురించి వినే తీరికలో, వినే ఓపికలో ఆమె ఉందా అని గమనించి చెప్పేవాడు. ఆ చెప్పడం కూడా.. ‘ఓ సెలవు రోజు ఇద్దరం కలిసి ఇంటిని శుభ్రం చేయాలి’ అని సీలింగ్‌ వైపు చూస్తూ చెప్పేవాడు. ఆ తర్వాత ఆమెకు కుదిరినప్పుడు ఆమె, అతడికి కుదిరితే అతడు, ఇద్దరికీ కుదిరితే ఇద్దరూ కలిసి చేసుకునేవాళ్లు. 

ఇంటి పనుల్లో మగవాళ్లు హెల్ప్‌ చెయ్యకపోవడానికి  కనిపించే సాధారణ కారణం.. ‘ఎవరి పని వారు’ చెయ్యాలనే ఒక ఆలోచన వారిలో ఇన్‌బిల్ట్‌గా ఉండిపోవడం అనుకుంటాం. ఆలోచన కాదు, ‘అనాలోచన’ ఇన్‌బిల్ట్‌గా ఉండిపోవడం అసలు కారణం. టమాటాలు తరగడం పనిలా కనిపించనప్పుడు..  టమాటాలు తరిగే మనిషి కూడా పని చేస్తున్నట్లుగా కనిపించదు. పని చేస్తున్నట్లు కనిపించనప్పుడు పనిగట్టుకుని వెళ్లి హెల్ప్‌ చేయడం ఏమంటుందనే ఆ అనాలోచన.. సెన్సిటివిటీ లేకపోవడమే కానీ, జెండర్‌ సెన్సిటివిటీ లేకపోవడం కాదు.  ఇంటపనుల్లో చక్కగా హెల్ప్‌ చేస్తుండే మగవాళ్లు కూడా.. ‘అయ్యో పాపం.. ఆడ మనిషి’ అని హెల్ప్‌ చెయ్యడం కాదు. స్త్రీ పురుష సమానత్వం అనుకుని టమాటాల్ని, కత్తిపీటను ఆమె నుంచి లాక్కోవడం కాదు. హెల్ప్‌ చెయ్యాలని అనిపించడం కాదు. హెల్ప్‌ చేస్తున్నామని అనుకోవడమూ కాదు. ఎదురుగా ఒక మనిషికి ఏకకాలంలో రెండు మూడు పనులున్నాయి కనుక సాటి మనిషిగా వాటిల్లో ఒక పనిని చేతికి అందుకోవడం. అది కూడా సెన్సిటివిటీ తప్ప జెండర్‌ సెన్సిటివిటీ కాదు. ఇంట్లో పనిని మగవాళ్లు పని అనుకోవడం, అనుకోకపోవడాన్ని బట్టే ఇంట్లో ఆడవాళ్లకు సహాయం అందడం, అందకపోవడం తప్ప.. ఇది మగ పని, ఇది ఆడ పని అని జనరల్‌గా అక్కడ పురాతత్వ పని విభజన నియమాలేవీ అప్లయ్‌ అవ్వవు. కొందరికి పేస్ట్‌ అందించాలి. బ్రష్‌ అందించాలి. బ్రష్‌లో పేస్ట్‌ వేసి కూడా అందించాలి. తమ పళ్లు, తమ పని అనుకోరు. మీరు తినడానికే మేము పళ్లు తోముకుంటున్నాం అన్నట్లుంటారు. ఇలాంటి వాళ్లను సెన్సిటైజ్‌ చెయ్యడానికి తప్ప, మహిళలూ పెద్దగా ఉద్యమాలేం చెయ్యరు కూడా. ‘ఇల్లు క్లీన్‌ చెయ్యడం ఆడవాళ్ల పని, ల్యాప్‌టాప్‌ ఒళ్లో పెట్టుకుని కూర్చోవడం మగవాళ్ల పని అనుకోకండి. మనుషులకు తప్ప, పనులకు జెండర్‌ లేదు’ అని చెప్పడానికి మాత్రమే వాళ్ల ప్రయత్నమంతా.  

మొన్న చూడండి. వాలంటైన్స్‌ డేకి హాంకాంగ్, లండన్‌లలో హెచ్‌.ఎస్‌.బి.సి. సిబ్బందికి ఓ పెద్ద కంపెనీ బంపర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఆఫర్‌ చార్ట్‌లో ‘ఫర్‌ హిమ్‌’ సెక్షన్‌ కింద ల్యాప్‌టాప్‌ కంప్యూటర్లు, గోప్రో కెమెరాలు, వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్‌లు ఉన్నాయి. ‘ఫర్‌ హర్‌’ సెక్షన్‌ కింద వ్యాక్యూమ్‌ క్లీనర్‌లు, ఆహార పదార్థాల్ని కలియదిప్పే బ్లెండర్‌లు, కిచెన్‌ వాటర్‌ ట్యాప్‌లు ఉన్నాయి! ఈ లైంగిక వివక్ష ఉమెన్‌ స్టాఫ్‌కి ఆగ్రహం తెప్పించింది. ఆఫీస్‌ల నుంచి వాకవుట్‌ చేశారు. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ అనిపిస్తుంది. ఇంట్లో మగాళ్లు హెల్ప్‌ చెయ్యకపోవడం అనాలోచన వల్ల కాదేమో, ఆడా మగా అనే ఆలోచన వల్లనేనేమో అని! ఒక్క యుగంలో లోకం ఏమీ మారిపోదేమో. యుగాలుగా లోకం మగాళ్లదే కనుక. బల్లిని చూసి ఆమె భయపడినప్పుడు అతడు వెళ్లి తరిమేశాడు. కొన్నిసార్లు ఇంటి పని కూడా బల్లిలా ఆమెను భయపెడుతుంది. అప్పుడు బల్లిని తరమాల్సింది బల్లి అంటే భయం లేనివాళ్లే. అతడెళ్లి పని అందుకోవాలి. చిన్న పనులు కూడా ఒక్కోసారి ఆమెకు చేయలేని పనులవుతాయి. ఆ గమనింపు ఉంటే చాలు. పని చేయకున్నా పని అందుకున్నట్లే. మరి బూజు? బూజు అయినా, ల్యాప్‌టాప్‌ అయినా.. మేడమ్‌ వచ్చి తుడిస్తేనే నేను క్లీన్‌ అవుతానని, సారొచ్చి ఒడిలో పెట్టుకుంటేనే నేను ఆన్‌ అవుతాయని అంటాయా?! 
మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు