సంబంధాల దారపు ఉండ

23 Sep, 2019 01:27 IST|Sakshi
ఘాచర్‌ ఘోచర్‌    వివేక్‌ షాన్‌బాగ్‌ 

కొత్త బంగారం

వివేక్‌ షాన్‌బాగ్‌ కన్నడంలో రాసిన ‘ఘాచర్‌ ఘోచర్‌’ నవలికలో, పేరుండని కథకుడు– బెంగళూరులో ‘వందేళ్ళగా పేరు మారని కాఫీహౌస్‌’లో ‘లెమన్‌ సోడా’ తాగుతుంటాడు. అతను పాత గర్ల్‌ఫ్రెండును అక్కడే కలుసుకునేవాడు. ఇప్పుడతనికి పెళ్ళయి ఉంటుంది. ‘ఇంటి గొడవలను తప్పించుకోవడానికి ఇక్కడికి వస్తాను’ అని ఒప్పుకుంటాడు. ఇక్కడినుండీ, తన జీవితాన్ని ఏ క్రమం పాటించకుండా వర్ణిస్తాడు. 
అతని అప్పా (తండ్రి)సేల్స్‌మాన్‌. ‘ప్రతీ పొద్దూ తన జోళ్ళు పాలిష్‌ చేసుకుని, ఇస్త్రీ చేసిన చొక్కా తొడుక్కునేవాడు.’ తన కొద్దిపాటి ఆదాయంతోనే తమ్ముడైన వెంకటాచల (చిక్కప్ప)ని చదివిస్తాడు. అప్పుడు వారి కుటుంబం, ‘వరుసగా ఉండే రైలు కంపార్టుమెంట్ల వంటి, చీమలుపట్టిన నాలుగు గదుల్లో ఉండేది. సమస్త కుటుంబం కలిసుండి, ఒకే శరీరంలా– బిగుతు పరిస్థితుల తాడుపైన నడిచేది.’
తన ఉద్యోగం పోయిన తరువాత అందిన డబ్బుతో అప్పా– చిక్కప్ప సహాయంతో, ‘సోనా మసాలా’ కంపెనీ ప్రారంభిస్తాడు. కలిమిలోకి అడుగు పెట్టిన ఇంటి సభ్యులందరికీ తమతమ గదులు ఏర్పడతాయి. చిక్కప్ప, కథకుడిని కంపెనీ సీఓవో నియమిస్తాడు. అయితే, బాబాయే మొత్తం వ్యాపారం నడుపుతుండటంతో కథకుడికే కాక మరెవరికీ కూడా పని చేసే అవసరం పడదు.
‘అత్యవసర వంటలే చేస్తే గ్యాస్‌ సిలిండర్‌ రెండు నెలలు వచ్చేది. గ్యాస్‌ అయిపోయాక, సిలిండర్‌ను బోర్లా పడుకోబెడితే మరి కొన్ని రోజులు.’ తమ పేదరికపు రోజుల ‘అమ్మ’ మాటలను గుర్తు చేసుకుంటాడు కథకుడు. ‘డబ్బుని అదుపులో ఉంచేది మనం కాదు. డబ్బే మనల్ని నియంత్రిస్తుంది. కొద్దిపాటి డబ్బే ఉన్నప్పుడు అది వినయంగా మసులుకుంటుంది. అది హెచ్చయినప్పుడు, మొండిధైర్యంతో మనమీద హక్కు చూపించుకుంటుందని జనాలనే మాటలు నిజమే... పేదరికం అనుభవిస్తున్నప్పుడు, పూర్తి కుటుంబం కలిసే భోంచేసేది. ఇప్పుడు, మేము భోజనాలప్పుడు కలుసుకున్నాగానీ ధ్యాస మరెక్కడో ఉంటుంది’ అంటాడు. ఇంటివారు అతనికి, ఒక ప్రొఫెసర్‌ కూతురైన అనితతో పెళ్ళి చేస్తారు. ఆమె బాగా చదువుకున్నది. హనీమూనప్పుడు, కథకుడు అనిత లంగా బొందు విప్పడానికి ప్రయత్నిస్తాడు. అది మరిన్ని ముళ్ళు పడుతుంది. అది‘ఘాచర్‌ ఘోచర్‌’ అయిందంటుంది అనిత. దాని అర్థం, ‘విడలేకపోయేంతగా ముళ్ళు పడటం’ అని వివరిస్తుంది.
భర్త ఏ పనీ చేయడని తెలిసి అనిత కోపం తెచ్చుకుంటుంది. అలాకాదని నిరూపించేందుకు అతను మళ్ళీ రోజూ కాఫీహౌస్‌కు వెళ్ళడం మొదలుపెడతాడు. హఠాత్తుగా వచ్చిపడిన డబ్బు కుటుంబ సమీకరణాలను మార్చివేసి, వారి నైతిక ధైర్యాన్నీ, మనశ్శాంతినీ పోగొడుతుంది. ఇంటి సభ్యులు బయటివారితో పెట్టుకున్న సంబంధాలన్నీ విఫలమే అవుతాయి. కథకుని అక్క మాలతి పెళ్ళికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా, అత్తగారింట్లో ఇమడలేక పుట్టింటికి వచ్చేస్తుంది. అనితకు– అత్తగారితోనూ, ఆడపడుచుతోనూ పోట్లాటలవుతుంటాయి. అనిత, తన బొందుకు పడిన ముళ్ళను ‘ఎంత జాగ్రత్తగా విడతీసిందో’ కథకుడూ అంతే పదిలంగా, తను చిక్కుకున్న కుటుంబపు దారాలని విప్పుకోవాలిప్పుడు.
కథకుడి నిరుత్సాహం, అనిత కోపం, మాలతి అల్పత్వం, అప్పా నిస్సహాయత, చిక్కప్పకుండే నైతిక అస్పష్టతవంటి బలహీనతలన్నిటినీ, యీ 118 పేజీల నవలికలో చూపుతారు రచయిత.  దీని కన్నడ ముద్రణ 2013లో. శ్రీనాథ్‌ పెరూర్‌ ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ పుస్తకాన్ని పెంగ్విన్‌ బుక్స్‌ 2017లోప్రచురించింది. తెలుగులోకి రంగనాథ రామచంద్రరావు అనువదించారు.
కృష్ణ వేణి

మరిన్ని వార్తలు