నేను పుట్టాను... లోకం పాడింది!

12 Dec, 2016 15:01 IST|Sakshi
నేను పుట్టాను... లోకం పాడింది!

నేను పుట్టాను ఒక జననం! టాటా వీడుకోలు ఒక మరణం! జననానికీ మరణానికీ మధ్యలో... నా హృదయంలో నిదురించే చెలీ ఒక ప్రేమ నిలువవే వాలు కనుల దాన ఒక టీజింగ్ జగమే మాయ బతుకే మాయ ఒక వైరాగ్యం నిదురపోరా తమ్ముడా ఒక వేదసారం నేనొక పూల మొక్క కడ నిల్చి ఒక విలాపం. ఘంటసాల గాత్రం జీవన సూత్రం. మానవ జన్మకు దివ్యగానామృతం. ఆ స్వర వేంకటేశ్వరునికిది.. ‘సాక్షి’ పట్టిన పాటల పల్లకీ! 

ఘంటసాల ఇప్పటివరకూ పాడిన పాటల్లో అందుబాటులో ఉన్నవి మూడు వేల పాటలు. అందుకని ఆయన పాడిన పాటల సంఖ్య అదే అని కొందరి వాదన. ‘కాదు... ఆయన పదివేల పాటల వరకూ పాడార’ని మరికొందరి వాదన. ఆయన ఎన్ని పాటలు పాడారు? అనే పరిశోధన ఇప్పటికీ జరుగుతోంది. ఘంటసాల పాడిన పాటల్లో ‘ఇవి పాపులర్’ అని కొన్నింటినే చెప్పడం... సముద్రంలో చెమ్చా పట్టుకుని నీటిని తోడే ప్రయత్నం లాంటిదే! ఎన్నని చెప్పగలం! అందుకే అందరికీ తెలిసిన ఆయన పాపులర్ సాంగ్స్‌లో మచ్చుకు ఒక 22 పాటల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ఎందుకంటే, ఆయన పుట్టింది 1922లో కదా!

రాజా, మ్యూజికాలజిస్ట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా... భగవద్గీత... ఓ రికార్డు! వేదవ్యాసుడు రాసిన ‘మహాభారతం’లో కురుక్షేత్ర సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణపరమాత్మ బోధించిన ‘భగవద్గీత’ భక్తులకూ, వేదాంతులకూ పరమ పవిత్రమైనది. జీవన వేదాంతమంతా చెప్పే ఆ మహత్తర గీతా శ్లోకాలనూ, వాటి భావాన్నీ తెలుగు నాట వాడవాడలా పాపులర్ చేసింది ఘంటసాలే అంటే అతిశయోక్తి కాదేమో! ఆయన కన్నా ముందు గాయనీమణులు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్ లాంటి కొందరు భగవద్గీత పాడినా, అవి ఏవీ అంతగా పాపులర్ కాలేదు. ఆ తర్వాత ఎంతోమంది ప్రయత్నించినా తెలుగునాట వేరే దేనికీ ఆ స్థాయి ప్రాచుర్యం రాలేదు. హెచ్.ఎం.వి. వారి గ్రామ్‌ఫోన్ రికార్డుల ద్వారా ఘంటసాల చేసిన ఈ మహోపకారం ఇవాళ్టికీ ఒక రికార్డే!

1. నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది.. (ప్రేమనగర్)
‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది...’ ఈ పాట నేటికీ వినపడుతుంటుంది. ‘ప్రేమ్‌నగర్’లోని ఈ పాట అప్పట్లో యమ పాపులర్. నిజానికి ఇది తాగుడు సందర్భంలో వచ్చే పాట. కానీ, ఆ సందర్భంతో సంబంధం లేకుండా ఈ పాట ఎవర్‌గ్రీన్ అయింది. ఈ పాటను యానిమేషన్ల కోసం ఇప్పుడు ఎక్కడ చూసినా వాడుతున్నారు. అక్కినేని నటించిన ఆఖరి చిత్రం ‘మనం’లో అక్కినేని కుటుంబమంతా కనిపించే సందర్భంలో ఈ పాటలో కొంత రీ-మిక్స్ చేసి వాడారు.

2. ఎంత ఘాటు ప్రేమయో... (పాతాళ భైరవి)
గాయకుడు బడే గులామ్ అలీఖాన్‌ను మద్రాసు తీసుకొ చ్చి, పాడించడానికి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రయత్నించినప్పుడు అప్పట్లో చాలామంది వ్యతిరేకించారు. అయినప్పటికీ ఎంతో కష్టపడి ఆయన కచ్చేరీని మద్రాసులో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఘంటసాల తన ఇంట్లోనే బడే గులామ్ అలీఖాన్‌కీ, ఆయన వాద్య బృందానికీ రెండు రోజుల పాటు ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఆయన సతీమణి సావిత్రమ్మ వీళ్లందరికీ స్వయంగా చపాతీలు తయారు చేసేవారు. ఘంటసాల ఉదయం రికార్డింగ్ స్టూడియోకు వెళ్ళి, సాయంత్రం రాగానే బడే గులామ్ అలీఖాన్ బృందంతో రాగ సాధన చేసేవారు. హిందుస్తానీ రాగాలను ఆకళింపు చేసుకున్నారు . ఆ ప్రభావంతోనే ‘ఎంత ఘాటు ప్రేమయో...’ పాటను రాగేశ్రీ రాగాన్ని ఉపయోగించి స్వరపరిచారని అప్పట్లో కొందరు అనేవారు. ఘంటసాల స్వరపరచి, పాడిన ప్రేమగీతాల్లో ఇది ఎవర్ గ్రీన్.

3. నా హృదయంలో నిదురించే చెలి... (ఆరాధన)
ప్రేమ పాటల్లో మరో చెప్పుకోదగ్గ పాట ‘నా హృదయంలో నిదురించే చెలి’. అక్కినేని నాగేశ్వరరావు అభినయించిన ప్రేమ పాటల్లో ఆయన సతీమణి అన్నపూర్ణకు బాగా నచ్చిన పాట ఇది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆవిడ స్వయంగా చెప్పారు.

4. అత్త లేని కోడలుత్తమురాలు... (మన దేశం)
అప్పటి నుంచి ఇప్పటి దాకా శాశ్వతంగా ఉన్న పాటల్లో ఘంటసాల పాడిన ‘అత్త లేని కోడలుత్తమురాలు’ ఒకటి. విశేషం ఏమిటంటే...  సినిమా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన ఈ పాట ‘ప్రైవేట్ సాంగ్’గా కూడా శ్రోతల మనసు దోచుకుంది. చివరికి ‘అత్త లేని కోడలుత్తమురాలు’ ఒక నానుడి అయింది.

5. నిలువవే వాలుకనుల దానా... (ఇల్లరికం)
ఏ పాట అయినా ఘంటసాల నోట ప్రాణం పోసుకోవాల్సిందే. హీరోయిన్లను హీరో ఆటపట్టించే  టీజింగ్ సాంగ్ ‘నిలువవే వాలు కనుల దాన..’ అలాంటిదే. ‘ఇల్లరికం’లోని ఈ పాటలో నటించడానికి అక్కినేని ఇష్టపడలేదు. అదే మాట చిత్రదర్శకుడు తాతినేని ప్రకాశరావుతో అన్నారు. కానీ, దర్శక-నిర్మాతలను కాదనలేక నటించారు. చేసిన తర్వాత కూడా ఆయనకు మనసొప్పలేదు. ‘ఈ పాటకు ఎంత ఖర్చయితే అంత ఇస్తా... సినిమాలో నుంచి తీసేయండి’ అని విన్నవించుకున్నారు. అప్పటికే సినిమా చూసిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు  ఈ పాట గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఉంచేశారు. మామూలుగా ఏయన్నార్ నటించిన ప్రతి సినిమా ఆయన భార్య అన్నపూర్ణ చూస్తారు. ఈ సినిమాను మూడు, నాలుగుసార్లు చూడటంతో ఆయన కారణం అడిగితే.. ‘ఈ పాట చాలా నచ్చింది.. అందుకే’ అన్నారట.

6. సుందరి నీ వంటి... (మాయాబజార్)
సినీ చరిత్రలో ‘మాయాబజార్’ది ఓ ప్రత్యేకమై పేజీ. ఆ చిత్రానికి ఘంటసాల ఓ స్వరకర్తగా వ్యవహరించారు. ఇందులో ‘సుందరి నీ వంటి దివ్యస్వరూపము..’ పాట గురించి తెలియనవాళ్లు ఉండరు. ముందుగా ఈ పాటను గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు - సావిత్రి పాడగా రికార్డ్ చేయాలనుకున్నారు. ఇద్దరూ రిహార్సల్ కూడా చేశారు. ఈ పాటకు ఘంటసాల స్వరకర్త. చివరి నిమిషంలో దర్శక-నిర్మాతలు కేవీ రెడ్డి, బి. నాగిరెడ్డి ఈ పాటను ఘంటసాల పాడితే బాగుంటుందనుకున్నారు. అప్పటివరకూ హాస్యరస గీతాలంటే పిఠాపురం నాగేశ్వరరావు - మాధవపెద్ది సత్యమే. అలాంటిది ఘంటసాలతో ఈ పాట పాడించడం ఓ ప్రయోగం. ఈ పాటను ఘంటసాల ఎంత అద్భుతంగా పాడారంటే.. హాస్యరస గీతాలకు తనదైన ముద్ర సంపాదించుకున్నారు.

7. పడవా వచ్చిందే పిల్లా... (సిపాయి చిన్నయ్య)
పాట సాహిత్యం ఘంటసాల పట్టించుకునేవారు. ‘సిపాయి చిన్నయ్య’కి స్వరకర్త ఎమ్మెస్ విశ్వనాథన్.అందులో ‘పడవా వచ్చిందే పిల్లా’ పాటను రికార్డ్ చేస్తామనగా ముందు రోజు ఘంటసాలతో రిహార్సల్ చేయించారాయన. విశ్వనాథన్ పాన్ నములుతూ పదాలు పలికారు. దాంతో ‘పడవా’ బదులు ‘భడవా’ అని ఘంటసాలకు వినిపించింది. అది ఇబ్బంది అనిపించింది. ఇంటికెళ్లగానే భార్యతో ‘ఆత్రేయ ఇలా రాయడం బాధగా ఉంది’ అని వాపోయారట. అప్పుడామె ‘విశ్వనాథన్ పాన్ నములుతారుగా. స్క్రిప్ట్ తెప్పించుకు చూడండి’ అన్నారు. స్క్రిప్ట్‌లో ‘పడవ’ అని చూసి, ఘంటసాల ఊపిరి పీల్చుకున్నారు.

8. ఎట్టాగొ ఉన్నాది ఓలమ్మీ... (దసరా బుల్లోడు)
‘దసరా బుల్లోడు’లోని ‘అరెరెరెరె... ఎట్టాగొ ఉన్నాది ఓ లమ్మీ...’ మంచి మాస్ సాంగ్. ఈ పాటలో ఉన్న ‘అరెరెరెరె...’ అనే అక్షరాలు ఇన్‌స్ట్రుమెంట్ మీద వాయించడం కష్టం. అది ఘంటసాల అద్భుతంగా పలికించబట్టి మరింత పాపులర్ అయింది. ఈ పాటకు ఘంటసాల వాయిస్, ఏయన్నార్ స్టెప్స్ జనాలను ఆకట్టుకున్నాయి. ఇదే పాటను ‘నేనున్నాను’లో నాగార్జున రీ-మిక్స్ చేసి వాడారు. అక్కడ తండ్రి నర్తిస్తే, ఇక్కడ తనయుడు అంతే జోష్‌గా నర్తించారు.

9. జోరుగా హుషారుగా షికారు పోదమా... (భార్యాభర్తలు)
ఘంటసాల పాడిన సరదా పాటల్లో ‘భార్యాభర్తలు’లోని ‘జోరుగా హుషారుగా షికారు పోదమా..’ ఒకటి. నాటి తరంలోనే కాదు.. నేటి తరంలో కారులో వెళ్లేటప్పుడు సరదాగా ఈ పాట వినేవాళ్లు... పాడేవాళ్లు ఉన్నారు. ఈ పాట టైటిల్‌తో ‘జోరుగా హుషారుగా’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఈ పాటను మోడ్రన్ ఆర్కెస్ట్రాతో రీ-మిక్స్ చేసి, ఉపయోగించారు.

10.కోలొ కోలోయన్న కోలో నాసామి (గుండమ్మ కథ)
ఎన్టీఆర్, ఏయన్నార్.. వీరిద్దరిలో ఎవరికి పాడితే వారి గొంతులానే అనిపించడం ఘంటసాల వాయిస్ ప్రత్యేకత. ‘గుండమ్మ కథ’లో ‘కోలో కోలోయన్న కోలో నా సామి’ పాటలో ఇద్దరూ పాడుతున్నట్లు అనిపించి నా ఏ హీరోకు తగ్గట్లుగా ఆ హీరోకు ఘంటసాల గాత్రంలో వ్యత్యాసం స్పష్టంగా వినిపించింది. అలాగే ‘భూకైలాస్’లో ‘దేవ దేవ ధవళాచల మందిర...’ పాటను అటు ఎన్టీఆర్‌కీ, ఇటు ఏయన్నార్‌కీ తగ్గట్టుగా పాడారు. ‘శ్రీకృష్ణార్జున యుద్ధము’లో ఎన్టీఆర్, ఏయన్నార్‌ల మధ్య వాద-సంవాద పద్యం ఉంటుంది. ఆ పద్యాన్ని ఘంటసాల అద్భుతంగా పాడారు. అలా ఇద్దరు వ్యక్తులకు ఒకేసారి సంవాద పద్యాలు పాడడం చక్కటి ‘ఓకల్ ఫీట్’ అని చెప్పాలి.

11.పెను చీకటాయె లోకం... (మాంగల్యబలం)
ఘంటసాల పాడిన పాటల్లో ‘మాంగల్య బలం’లోని ‘పెను చీకటాయె లోకం..’ ఆయన తనయుడు ఘంటసాల రత్నకుమార్‌కు ఓ మంచి అనుభూతి. అఫ్‌కోర్స్ తండ్రి పాడిన పాటలన్నీ కుమారుడికి అలాంటివే అనుకోండి. అయితే ‘పెను చీకటాయె..’ స్పెషల్. ఒకసారి ఘంటసాల రత్నకుమార్ పెట్రోల్ పోయించుకోవడానికి బంక్‌కి వెళ్లారు. ఎంతసేపటికీ అక్కడి కుర్రాడు పెట్రోల్ కొట్టకపోవడంతో విషయమడిగారు. ‘ఒక్క నిమిషం సార్! ఘంటసాలగారి పాట వస్తోంది. అది అయిపోయాక కొడతా’ అన్నాడట. అప్పుడు రత్నకుమార్ ‘నేను ఘంటసాలగారి అబ్బాయిని’ అంటే ఆ కుర్రాడు ఆశ్చర్యానందాలతో చూశాడట. ఈ విషయాన్ని స్వయంగా రత్నకుమార్ పంచుకున్నారు.

12. జగమే మాయ బ్రతుకే మాయ... (దేవదాసు)
మద్యం మత్తులో హీరో పాడే పాటలకు ప్రాణం పోయడం అంటే ఘంటసాల గాత్రానికే చెల్లుబాటైంది. ‘దేవదాసు’లో ‘జగమే మాయ బ్రతుకే మాయ...’ పాట అందుకో ఉదాహరణ.. ‘దేవదాసు’ కథను శరత్‌చంద్ర రాయక ముందు తాగుబోతులకు ప్రత్యేకంగా పేరూ గట్రా లేవు. ఆ సినిమా తర్వాత తాగుబోతులను ‘దేవదాసు’ అనడం మొదలైంది. ‘జగమే మాయ’ పాట మందు బాబులకే కాదు.. పాడుకునేవాళ్లందరికీ ఒక మైకం. వేదాంత పరంగా కూడా ఈ పాట ఓ మైకమే.

13. మనసు గతి ఇంతే... (ప్రేమనగర్)
‘ప్రేమనగర్’ సినిమాలో  తాగుడు మానేసిన తర్వాత పాడే ‘మనసు గతి ఇంతే..’ అద్భుతంగా ఉంటుంది. మనసు పడే మథనానికి అద్భుత  ఆవిష్కరణ ఈ పాట.

14.నిదురపోరా తమ్ముడా... (సంతానం)
‘సంతానం’ సినిమాలో అనిసెట్టి సుబ్బారావు రాసిన ‘నిదుర పోరా తమ్ముడా...’ అనే పాట ఉంది. ఈ పాటను ఘంటసాల - లతా మంగేష్కర్ పాడారు. ముందు లత పాడారు. ఆ తర్వాత ఘంటసాల వాయిస్‌ని రికార్డ్ చేశారు. లత కన్నా ఘంటసాల హై పిచ్‌లో పాడారు. ఆ తర్వాత ఆయన భార్య ‘పాట ఎలా వచ్చింది?’ అని అడిగితే.. ‘‘ఆ సంగతలా ఉంచితే.. ఈ పాట కోసం సుసర్ల దక్షిణామూర్తి (సంగీత దర్శకుడు) సూట్ కుట్టించుకున్నారు. బొంబాయి నుంచి లతాగారు వస్తున్నారు కదా... అందుకే సూట్ తొడుక్కున్నారు. ఎప్పుడూ పంచెకట్టులో కనిపించే ఆయనను మొదటిసారి సూట్‌లో చూశా’’ అని చమత్కరించారు.

15. శేషశైలవాస... శ్రీవేంకటేశా...  (శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం)
ఘంటసాల గాత్రం కొన్ని పాటలకు శాశ్వతత్వాన్ని ఇచ్చింది. ఆయన పాడిన భక్తి పాటలు శ్రోతల్లో భక్తి పారవశ్యాన్ని నింపుతాయి. అణువణువునా భక్తి తత్వాన్ని నింపుకొని ఆయన పాడిన పాటల్లో ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం’ చిత్రంలోని ‘శేష శైలవాస... శ్రీవేంకటేశా...’ ఒకటి. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుడి దేవస్థానంలో ఈ పాట మోగుతూనే ఉంటుంది. కలియుగం ఉన్నంతవరకూ ఈ పాట ఉండి తీరుతుందంటే అతిశయోక్తి కాదేమో!

16. చల్లనివెన్నెలలో చక్కని కన్నె సమీపములో (సంతానం)
‘సంతానం’ సినిమాలోని ‘చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో..’ మంచి రొమాంటిక్ సాంగ్. ‘ప్రేమికుడు’లో ఎస్పీ బాలు-ప్రభుదేవా కాంబినేషన్‌లో వచ్చే సీన్లో ఎస్పీబీ ఈ పాటను ఆలపిస్తారు. అప్పటికే లబ్ధప్రతిష్ఠులైన బాలు ఘంటసాలను గుర్తు చేసుకుని ఈ పాటను ఆ సినిమాలో ఆలపించడం చెప్పుకోదగ్గ విషయం.

17. మాణిక్యవీణామ్... (శ్యామలా దండకం) (మహాకవి కాళిదాసు)
‘మహాకవి కాళిదాసు’ చిత్రంలోని ‘మాణిక్యవీణామ్’ అని మొదలై, ‘చతుర్భుజే.. చంద్రకళా వతంసే...’ అని వచ్చే శ్యామలా దండకాన్ని ఘంటసాల పాడుతున్నప్పుడు స్వరకర్త పెండ్యాల నాగేశ్వరరావుకి విచిత్ర అనుభూతి కలిగింది. పాడుతున్నప్పుడు ఘంటసాల చుట్టూ ఓ కాంతి పుంజం ఉన్న భావన తనకు కలిగిందని పెండ్యాల స్వయంగా పేర్కొన్నారు. దండకం పూర్తయ్యాక ఘంటసాల దగ్గరకు వెళ్లే సాహసం చేయలేకపోయానని ఆయన అనడం విశేషం. ఆ దండకంలో ఘంటసాల గాత్రంలో దైవత్వం ఉట్టిపడిందనడానికి ఇదొక నిదర్శనం.

18. ధారుణి రాజ్యసంపద మదంబున... (పాండవ వనవాసం)
ఘంటసాల పాడిన పద్యాలు.. స్తోత్రాలు ఎవర్‌గ్రీన్ అనాలి. ఘంటసాలకు ముందు ‘ఈలపాట’ రఘురామయ్య, సూరిబాబు.... వీళ్లందరూ పద్యాలు పాడిన పద్ధతి ఒక ఎత్తు. ఘంటసాలది మరో ఎత్తు. ‘మహాభారతం’లోని పద్యాల్లో ఘంటసాల ద్వారా పాపులర్ అయిన పద్యాల్లో ‘పాండవ వనవాసం’లోని ‘ధారుణి రాజ్యసంపద మదంబున..’, ‘కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్...’ లాంటివి చాలా ఉన్నాయి.

‘నర్తనశాల’లో తిక్కన పద్యాలు, ‘కాళహస్తీ మాహాత్మ్యం’లో ధూర్జటి మహాకవిపద్యాలు ఘంటసాల గాత్రం ద్వారా సామాన్య జనాల్లో కూడా ప్రసిద్ధి పొందాయి. స్తోత్రాల్లో ‘సీతారామ కల్యాణం’లో వాడిన ‘రావణ భుజంగ...’ స్తోత్రం ఒకటి. ఇది రావణకృతం. ఆ విషయం చాలామందికి తెలియదు. ఘంటసాల ఆలపించడంతో ఆ స్తోత్రం పాపులర్ అయింది.

19.రసికరాజ తగువారము కామా... (జయభేరి)
స్వరసహితంగా ఘంటసాలగారు పాడటం మొదలుపెట్టాక ఔత్సాహిక గాయకులు కూడా ఆ ప్రయత్నం చేసేవారు. ‘జయభేరి’ చిత్రంలోని ‘రసిక రాజ తగువారము కామా...’ పాట వారికి లిట్మస్ టెస్ట్ లాంటిది.

20. శివశంకరీ... శివానందలహరి శివశంకరీ... (జగదేకవీరుని కథ)   
‘జగదేకవీరుని కథ’లోని ‘శివశంకరి...’ పాట కూడా అంతే. ఔత్సాహిక గాయనీ గాయకులు తమ ప్రతిభను పరీక్షించుకోవడానికి ‘రసిక రాజ తగువారము కామా...’, ‘శివశంకరి...’ - ఈ రెండు పాటలూ పాడాల్సిందే. ఈ పాటల్ని అద్భుతంగా పాడినవాళ్లు ఏ పాటనైనా పాడగలుగుతారు. వర్ధమాన గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న హేమచంద్ర ఈ రెండు పాటల ద్వారానే బాగా పాపులర్ అయ్యాడు. గాయని కల్పన కూడా ఈ పాట ద్వారా చాలా పేరు తెచ్చుకున్నారు. చెన్నైకి చెందిన చిన్నారి స్ఫూర్తి ఈ పాట పాడి, ప్రశంసలు పొందింది. అంటే... వయసు తారతమ్యం లేకుండా అన్ని వయసులవారికీ ఘంటసాల పాటలు ఓ స్ఫూర్తి.

21. నేనొక పూల మొక్క కడ నిల్చి... (పుష్పవిలాపం కావ్యం)
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు రచించిన ‘కుంతీ కుమారి’, ‘పుష్ప విలాపం’... - ఈ రెండు ప్రైవేట్ సాంగ్స్ ఘంటసాల గాత్రంతో సామాన్య జనంలోకి ఎంతగానో చొచ్చుకుపోయాయి. ఈ రెండూ హృదయానికి హత్తుకునేవే. ముఖ్యంగా ‘పుష్ప విలాపం’లో ‘ఎంత దయలేనివారు మీ ఆడువారు..’ అంటూ ఘంటసాల పాడిన పద్ధతి ఆ తర్వాతి తరం కుర్రకారు ఆడవారిని ఆటపట్టించడానికి ఉపయోగించడం మొదలైంది.

ఇక, ‘కుంతీ కుమారి’లోని ‘అది రమణీయ పుష్ప వనము’ అని రచయిత కరుణశ్రీ రాస్తే, పాడే సౌకర్యం కోసం ‘అది ఒక రమణీయ పుష్ప వనము’ అని ఘంటసాల మార్చారు. దానివల్ల ఛందస్సు దెబ్బతిన్నదనే విషయాన్ని కూడా ఎవరూ గ్రహించలేదు. ఘంటసాల పాట పాడే పద్ధతికి ఉన్న ప్రత్యేకత అది అని ఓ సందర్భంలో గాయకుడు పీబీ శ్రీనివాస్ అన్నారు.

22. టాటా వీడుకోలు... గుడ్‌బై ఇంక సెలవు... (బుద్ధిమంతుడు)
‘టాటా వీడుకోలు..’ తాగుబోతు పాట అని ‘బుద్ధిమంతుడు’ సినిమా చూసినవాళ్లకు తెలుస్తుంది. చూడనివాళ్లు ఇదేదో సరదా పాట అనుకుంటారు. ‘వీడుకోలూ...’ అంటూ ఘంటసాల ఒక రకమైన మత్తుతో పాడతారు. మత్తు పాటలకు ఘంటసాల ఇచ్చినంత పాపులారిటీ ఏ గాయకుడూ ఇవ్వలేదు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే... దేశంలో ఏ గాయకుడికీ దక్కనంత గౌరవం ఘంటసాలకు దక్కింది. ఏ గాయకుడికీ లేనన్ని శిలా విగ్రహాలు ఆయనకే ఉన్నాయి. ఘంటసాల అకాడమీ ఉంది. ఆయన పాటలు సేకరించే వాళ్ల సంఖ్య బోలెడు. ఘంటసాల మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అలా ఆయన, ఆయన పాటలు ఎప్పటికీ చిరంజీవులే.

తెలుగు సినిమాలో  మరాఠీ గీతం!

‘పాండురంగ మాహాత్మ్యం’ సినిమాలో ఘంటసాల మరాఠీ గీతం పాడారు. ‘హే కృష్ణా ముకుందా మురారి..’ పాట తర్వాత కృష్ణుడి భక్తులందరూ కృష్ణుడిలో కలిసిపోతారు. అప్పుడు తుకారామ్ కూడా కృష్ణుడిలో కలసిపోతాడు. ‘తూ హీ.. బీజాజీ ఛలే..’ అనే మరాఠీ గీతాన్ని ఘంటసాల పాడారు. ఇలా ఒక తెలుగు సినిమాలో మరాఠీ గీతాన్ని  ఘంటసాల పాడిన విషయం చాలామంది తెలియకపోవచ్చు.

ఘంటసాల స్పెషల్ ‘స్టార్ స్టార్ సూపర్ స్టార్’ ఈరోజు రాత్రి  7.30 గం.లకు సాక్షి టీవీలో

మరిన్ని వార్తలు