కష్టపడితే ఇంజనీరింగ్ సర్వీసెస్ సులువే!

8 Mar, 2015 23:34 IST|Sakshi
కష్టపడితే ఇంజనీరింగ్ సర్వీసెస్ సులువే!

సక్సెస్ స్టోరీ
అమ్మాన్నాన్న ఇద్దరూ సివిల్ ఇంజనీర్లే. అందుకు తగ్గట్లుగా ఆ యువకుడికి కూడా ఇంజనీరింగ్ సబ్జెక్టులంటే అమితాసక్తి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ సర్వీసులో చేరాలనే లక్ష్యం.. కలిసి అతడిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఈఎస్) -2014 రాసేలా చేశాయి. లక్షల మంది పోటీని ఎదుర్కొని ఐఈఎస్ (సివిల్ ఇంజనీరింగ్ విభాగం) లో జాతీయస్థాయిలో 25వ ర్యాంకును సాధించాడు తిరుపతికి చెందిన జిల్లెల్ల అభిషేక్. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో చేరి సమాజాభివృద్ధికి సేవ చేస్తానంటున్న అభిషేక్ సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే..  
 
కుటుంబ నేపథ్యం..
మా స్వస్థలం తిరుపతి. నాన్న జి.ప్రభాకర్‌రావు ఏపీ రోడ్లు, భవనాల శాఖ రాజంపేట కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్  ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ రోజారమణి ఏపీ పంచాయతీరాజ్ శాఖ-తిరుపతిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నా చదువు విషయంలో అమ్మానాన్న నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎంచుకున్న కోర్సును విజయవంతంగా పూర్తి చేయడానికి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. ఆశించిన ర్యాంకులు, ఫలితాలు సాధించలేకపోయినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించారు. గేట్‌లో ఆశించిన ర్యాంకు రాలేదని నేను కలత చెందినప్పుడు నాలో ధైర్యం నింపారు. అదే స్ఫూర్తిని కొనసాగించి ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో విజయం సాధించాను.
 
చదువులో ముందంజ
ఇంటర్ వరకు తిరుపతిలోనే చదివాను. పదో తరగతిలో 94 శాతం, ఇంటర్‌లో 97 శాతం మార్కులు సాధించాను. ఏఐట్రిపుల్‌ఈ-2009లో జాతీయస్థాయిలో 4200 ర్యాంకు సాధించి ఎన్‌ఐటీ- తిరుచిరాపల్లిలో సివిల్ ఇంజనీరింగ్‌లో చేరాను. బీటెక్‌లో 94.4 శాతం మార్కులు వచ్చాయి. తర్వాత గేట్‌లో 496 ర్యాంకు సాధించాను. ప్రస్తుతం ఐఐటీ- బాంబేలో ఎంటెక్ చేస్తున్నాను.  
 
బీటెక్‌లోనే కోచింగ్
బీటెక్ మూడో ఏడాది సెలవుల్లో హైదరాబాద్‌లో ఐఈఎస్‌కు రెండు నెలలు కోచింగ్ తీసుకున్నాను. అయితే బీటెక్ పూర్తయ్యేనాటికి నాకు 21 ఏళ్లు నిండలేదు. ఐఈఎస్‌కు హాజరయ్యేందుకు కనీస వయసు లేనందున పరీక్ష రాయలేకపోయాను. దీంతో ప్రిపరేషన్‌కు మరో ఏడాది సమయం లభించింది. దాంతో ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకున్నాను. ఏడాదిపాటు ఐఈఎస్‌కు కష్టపడి చదివాను.
 
ప్రిపరేషన్
ఐఈఎస్‌కు బీటెక్ సిలబస్ మించి సిద్ధమవ్వాలి. ఐఈఎస్‌లో అడిగే ప్రశ్నలతో పోల్చుకుంటే బీటెక్‌లో నేర్చుకుంది చాలా తక్కువ అనిపిస్తుంది. అయినప్పటికీ పట్టుదల, పక్కా ప్రణాళిక ఉంటే ఐఈఎస్ కలను సొంతం చేసుకోవచ్చు. శిక్ష ణలో రోజుకు 4 నుంచి 5 గంటలు తగ్గకుండా ఇంజనీరింగ్ సబ్జెక్టులను చదివేవాడిని. పుస్తకాలతోపాటు మానసిక ఉల్లాసానికి ప్రాధ్యానతనిచ్చాను. నేను స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్‌ని. రోజూ గంట నుంచి గంటన్నర వరకు శారీరక వ్యాయామం చేసేవాడిని. దీనివల్ల మంచి ఉత్తేజం లభించేది.
 
పరీక్ష విధానం
ఐఈఎస్ పరీక్షను సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో నిర్వహిస్తారు. రాత పరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-1 జనరల్ ఎబిలిటీ టెస్ట్‌తోపాటు ఇంజనీరింగ్‌కు సంబంధించిన రెండు పేపర్లుంటాయి. సెక్షన్ -1 పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. సెక్షన్-2లో ఇంజనీరింగ్‌కు సంబంధించిన రెండు కన్వెన్షనల్ పేపర్లు ఉంటాయి. రాత పరీక్షలో ఒక్కో పేపర్‌కు 200 మార్కుల చొప్పున మొత్తం ఐదు పేపర్లకు కలిపి 1000 మార్కులుంటాయి. పరీక్ష ఉత్తీర్ణులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులు.
 
ఇంటర్వ్యూ సాగిందిలా
ఐదుగురు సభ్యులున్న మన్‌బీర్ సింగ్ ప్యానెల్ నన్ను ఇంటర్వ్యూ చేసింది. ఉత్తరాఖండ్ వరదలపై, ప్రకృతి, మానవ కారణాల విశ్లేషణపై ప్రశ్నలు అడిగారు. తర్వాత సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన నాలుగు సబ్జెక్టులు.. ఆర్‌సీసీ, బిల్డింగ్ మెటీరియల్స్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్‌పై ప్రశ్నలు అడిగారు. అరగంట సేపు ప్రశాంత వాతావరణంలో ఇంటర్వ్యూ సాగింది.
 
లక్ష్యం
ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో నేను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగాన్ని ఎంచుకున్నాను. ప్రజలకు సేవ చేయడానికి వీలయ్యే ఈ రంగం అంటే నాకెంతో ఆసక్తి. అంకిత భావంతో పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేదే నా లక్ష్యం.
 
సలహా
గేట్‌లో ప్రతిభ చూపినవారు మాత్రమే ఐఈఎస్‌లో రాణిస్తారనేది చాలామంది అపోహ. గేట్ లో ఆశించిన ఫలితాలు సాధించపోతే కుంగిపోతారు. కానీ గేట్‌లో విఫలమైనా ఐఈఎస్‌లో విజయం సాధించొచ్చు. పరీక్షకు ముందు ఆర్నెల్లు కష్టపడి చదవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. ఇంజనీరింగ్ సబ్జెక్టులపై పట్టు ఉండి, కష్టపడి చదివితే సులువుగా విజయం సాధించొచ్చు.

మరిన్ని వార్తలు