మమ్మీ నా బుక్సేవీ!

29 May, 2019 02:09 IST|Sakshi

చదువు

చక్కగా చదువుకునే అమ్మాయిల్లో సెలబ్రిటీ కళ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్లు చిరుప్రాయపు సెలబ్రిటీలు అయి ఉన్నా.. ‘ప్లస్‌ టూ’లో నైంటీ పర్సెంట్‌తో పాసయ్యారనో, మాస్టర్స్‌ డిగ్రీలో జాయిన్‌ అయ్యారనో తెలిస్తే ముచ్చటగా ఉంటుంది. చదువులో ఉన్న మహిమ అది.

మాధవ్‌ శింగరాజు
కాబోయే భర్తతో కన్నా, చేయబోయే డిగ్రీతోనే ఎక్కువ కనెక్ట్‌ అవుతారు ఆడపిల్లలు. భర్తొస్తే భార్య హోదా వస్తుందని, భార్య హోదా గుర్తింపు తెస్తుందని వాళ్లకేం ఉండదు. చదువు పూర్తి చేస్తే మంచి ఉద్యోగం తెచ్చుకోవచ్చని, కెరీర్‌ని చక్కగా తమకు ఇష్టమైనట్లు మలుచుకోవచ్చని ఉంటుంది. ఒకవేళ డిగ్రీ కంటే భర్తగారే ముందొచ్చినా, ఆ భర్తగారిని కూడా కెరీర్‌లో ఒక భాగంగానే చూస్తారు.. కెరీర్‌కి అడ్డంకి గానో, కెరీర్‌కి సపోర్ట్‌గానో. మంచి భర్త దొరకాలని ఈ జనరేషన్‌లో ఆడపిల్లలెవరూ ఆలయాలకు వెళ్లి రావడం లేదు. వచ్చేవాడు ఎలాంటి వాడో దేవుడికే తెలియనప్పుడు గుడికెళ్లి ప్రదక్షిణలు చేసే బదులు  కెమిస్ట్రీలో, మేథ్స్‌లో ఏం ప్రశ్నలు వస్తాయో ఇంట్లో కూర్చుని గెస్‌ పేపర్‌ తయారు చేసుకుంటే కొంత ఫలితం ఉంటుంది. ఊహించిన ప్రశ్నలే రాకున్నా, పూర్తిగా ఊహకు అందనివైతే రావు. భర్తగా ఎలాంటి వాడు వస్తాడో దేవుడే గెస్‌ చెయ్యలేనప్పుడు టెన్తో, ఇంటరో అయిన పిల్లేం గెస్‌ చేస్తుంది.

చదువులో ఎంత ‘టెన్‌ బై టెన్‌’ గ్రేడ్‌ తెచ్చుకుంటే మాత్రం?! అక్క భర్తను అంతా దేవుడు అంటున్నా, ఆ భర్తలో ఎంత శాతం దేవుడున్నాడో అక్క చెప్పకపోయినా, తనకు తెలియందా! పెళ్లయి ఏళ్లవుతున్నా అక్క చెప్పులు గుమ్మం లోపలే అరగని ఆభరణాల్లా ఉండిపోయాయంటే అక్క ఆశలన్నిటినీ ఎటూ కదలనివ్వకుండా దేవుడులాంటి ఆ భర్తగారే భుజాలపై మోసుకు తిరుగుతున్నాడనే కదా. మోయడమే కనిపిస్తుంది లోకానికి. ‘‘నన్ను కిందికి దింపు ప్లీజ్‌.. నేనూ నడవగలను కదా’’ అని అక్క చేసే మూగ ఆక్రందనలు వినిపించవు. నడవడమే కాదు, తను పరుగెత్తగలదు, ఎగరగలదు. కాళ్లల్లో సత్తువ ఉంటుంది. రెక్కల్లో బలం ఉంటుంది. అయినా సరే.. దేవుడి లాంటి భర్త కదా.. అక్కను మోసుకునే తిరుగుతాడు! అంత మంచి భర్త పొరపాటున ఎక్కడొచ్చి పడతాడోనని భయము, బెంగ ఉండే ఆడపిల్లలు కనిపిస్తారేమో బహుశా గుళ్లలో.. ‘దేవుడి లాంటి భర్తను మాత్రం ఇవ్వకు దేవుడా’ అని వేడుకోడానికి. అమ్మ, నాన్న వినకపోతే దేవుడే కదా చెప్పుకోడానికి మిగిలేది.

దేవుడి దగ్గర కూడా వాళ్ల ఫస్ట్‌ ప్రయారిటీ చదువు. ‘సీటొచ్చేటట్టు చెయ్‌ ప్లీజ్‌’ అని. లీస్ట్‌ ప్రయారిటీ భర్త. ‘ఇప్పట్లో పెళ్లి ముహూర్తాన్ని దగ్గరకు రానీయకు ప్లీజ్‌’ అని. చదువుకి, జీవితానికి అంత లింకు పెట్టేసుకుంటారు అమ్మాయిలు. చదువు.. వాళ్ల లవ్‌ ఇంట్రెస్ట్‌. బాలికల్ని చదివించని కాలంలో ‘మళ్లీ బాలురదే పైచేయి’ అని ఏటా రిజల్ట్స్‌ వచ్చేవి. బాలురు ఇప్పుడు ఏ ఫలితాల్లోనైనా మునుపటంత ధారాళంగా కనిపిస్తున్నారా? లేదు. బాలికల్ని కూడా చదివిస్తున్నాం కదా. చదువంటే తమకెంత ప్రాణమో చూపిస్తున్నారు. ప్రాణాలు గుండెల్లో ఉంటాయనుకుంటాం. ఆడపిల్లలకు పుస్తకాల్లోని పాఠాల్లో ఉంటాయి.చక్కగా చదువుకునే అమ్మాయిల్లో సెలబ్రిటీ కళ కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్లు చిరుప్రాయపు సెలబ్రిటీలు అయి ఉన్నా.. ‘ప్లస్‌ టూ’లో నైంటీ పర్సెంట్‌తో పాసయ్యారనో, మాస్టర్స్‌ డిగ్రీలో జాయిన్‌ అయ్యారనో తెలిస్తే ముచ్చటగా ఉంటుంది. చదువులో ఉన్న మహిమ అది. ఆ మహిమ అలా ప్రవహించి చదివే వాళ్ల ముఖాల్లోకీ వచ్చేస్తుంది.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇన్ని కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని తెలిస్తే ఏం అనిపించదు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ‘జీసస్‌ అండ్‌ మేరీ కాలేజ్‌’లో మేథమేటిక్స్‌ చదివారట అని తెలిస్తే అందులోకి గ్లామర్‌ వచ్చేస్తుంది! రష్మికా మండన్నా మళ్లొకసారి విజయ్‌ దేవరకొండతో నటిస్తున్నారని తెలిస్తే ఏం అనిపించదు. ఆమె కూర్గ్‌ పబ్లిక్‌ స్కూల్లో చదివారని, సైకాలజీ–జర్నలిజం–ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో డిగ్రీ చేశారంటే ‘ఇంట్రెస్టింగ్‌!’ అనిపిస్తుంది. చదువు కోసం కెరీర్‌లో, చేస్తున్న పెద్ద జాబ్‌లో బ్రేక్‌ తీసుకునే అమ్మాయిలు కొందరు ఉంటారు! ‘రియల్లీ గ్రేట్‌’ అనిపిస్తుంది. జాబ్‌నీ, చదువునీ బ్యాలెన్స్‌ చేసుకునే వాళ్లు ఇంకా గ్రేట్‌గా కనిపిస్తారు. ఇక ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటూ చదువుకునే వాళ్లైతే గ్రేట్‌ అనే మాట సరిపోదు. సెల్యూట్‌ కొట్టాలి. ఎంత పేరు, ఎంత డబ్బు, ఎన్ని ఆభరణాలు, ఎంత మంచి భర్త ఉన్నా.. వాళ్లింకా ఏదో చదువుతున్నారంటే గౌరవం వచ్చేస్తుంది వాటన్నిటికీ. దివ్యమైన వెలుగేదో ఫోకస్‌ అవుతుంది వాటన్నిటిపైన.

హిమాదాస్‌ స్ప్రింటర్‌. అస్సాం అమ్మాయి. 2000 సంవత్సరంలో పుట్టింది. 2018లో ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కొట్టింది. ‘ధింగ్‌ ఎక్స్‌ప్రెస్‌’ అని పేరు. ధింగ్‌ ఆమె పుట్టిన ఊరు. వరల్డ్‌ యు20 ఛాంపియన్‌షిప్స్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి హిమాదాస్‌. దోహాలో ఈ సెప్టెంబరులోనో, అక్టోబరులోనో జరగబోతున్న వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌ పోటీల కోసం ప్రస్తుతం టర్కీలో ట్రైనింగ్‌ తీసుకుంటోంది. ఆమె అక్కడ ఉండగానే ఇక్కడ ఇంటర్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. ఫస్ట్‌ క్లాస్‌లో పాసైంది.  500కి 349 మార్కులు వచ్చాయి. అస్సామీ లాంగ్వేజ్‌ పేపర్‌లో 80 శాతానికి పైగా స్కోర్‌ చేసింది హిమ. పరీక్షలు గత ఫిబ్రవరిలో జరిగాయి. అప్పటికే తను టర్కీలో ఉంది. పరీక్షలకు ప్రిపేర్‌ అవడం కోసం ట్రైనింగ్‌కి బ్రేక్‌ తీసుకుని వచ్చింది! ఇంట్లో ఉండి ప్రిపేర్‌ అయితే టైమ్‌ అంతా ప్రిపరేషన్‌కే అవుతుందని గౌహతి వెళ్లి అక్కడి ‘స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ హాస్టల్‌లో ఉండి చదువుకుంది.

ఎగ్జామ్‌కీ, ఎగ్జామ్‌కీ మధ్య విరామాలలో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌కి ప్రాక్టీస్‌ చేసింది. తిరిగి టర్కీ వెళ్లిపోయింది. గతేడాది కూతురు బంగారు పతకం సాధించుకొచ్చినప్పుడు కూడా ఇంత ఆనందంగా లేరు ఆమె తల్లిదండ్రులు. ఆమె ఫస్ట్‌క్లాస్‌లో పాసైందని తెలిసినప్పట్నుంచీ ఇంటిపైన మేఘాలలోనే వాళ్ల నివాసం!ఆడపిల్లలు చదువుతో ఇంత గౌరవాన్ని, గర్వాన్ని తెచ్చిపెడతారు కదా..  ఎందుకని మనం హఠాత్తుగా ‘ఇక దిగమ్మా’ అని మధ్యలోనే చదువు నిచ్చెనని పక్కకు తీసేస్తాం?! నిచ్చెన పైనుంచి దించి, భుజాలపైకి ఎక్కించడానికి మంచి కుర్రాడుంటే చూడమని ఎందుకు వాళ్లకూ వీళ్లకూ చెప్పడం మొదలుపెడతాం? బాధ్యతను నెరవేర్చడం! బాధ్యతగా నిచ్చెన వేశాం కదా, అలాగే బాధ్యతగా భుజాల్ని వెతుకుతాం. నిచ్చెన చివరివరకు ఆడపిల్లని ఎక్కనిస్తే భుజాలను వెతికే అవసరం ఉండదన్న ఆలోచనను మన బాధ్యత మనకు రానివ్వదేమో మరి. పిల్లలు తమ చదువుని  బాధ్యతగా కాక, ప్రాణంగా ఫీల్‌ అవుతున్నప్పుడు మన ప్రాణసమానం అయిన పిల్లల చదువుల్ని, ఆశల్ని ఎందుకు అర్ధంతరంగా ఎవరి భుజాలపైనో ఎక్కించాలని చూడడం! భుజాలపైకి ఎక్కితేనే కానీ కిచెన్‌లోని ఉప్పు డబ్బానో, షెల్ఫ్‌లోని పాల డబ్బానో అందదని ఆడపిల్లల్ని చదువు మాన్పించేస్తామా?!              ∙


 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా