మై డియర్‌  బ్రేవ్‌ సిస్టర్స్‌ 

10 Oct, 2018 00:01 IST|Sakshi

బిహార్‌లోని సుపాల్‌ జిల్లా (బిహార్‌) దర్పాఖలో.. పక్క గ్రామంలోని అబ్బాయిలు తమ గ్రామంలోని స్కూలు గోడలపై అసభ్య రాతలు రాయడాన్ని అడ్డుకుని, వారిపై తిరగబడి.. ‘మీరసలు ఆడపిల్లలేనా?’ అని తల్లిదండ్రుల చేత తీవ్రంగా దెబ్బలు తిని ఆసుపత్రి పాలైన 30 మంది కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) బాలికలను ఉద్దేశించి.. సి.ఎన్‌.ఎన్‌. న్యూస్‌ 18 పొలిటికల్‌ ఎడిటర్‌ మారియా షకీల్‌ స్ఫూర్తిదాయకమైన ఉత్తరం రాశారు. చెడు రాతలపై తిరగబడిన బాలికలకు మారియా తన ఉత్తరంలో ‘అమ్మాయిలంటే మీలాగే ఉండాలి’ అని కూడా అభినందనలు తెలిపారు. 

మై డియర్‌ బ్రేవ్‌ సిస్టర్స్‌...
బిహార్‌ వీధుల్లో సైకిళ్ల మీద కార్లు, బస్సులతో మీరు పోటీ పడడం చూశా. ‘‘మీ లైఫ్‌లో ఈ సైకిల్‌ రోల్‌ ఏంటీ?’’అని నేను అడిగినప్పుడల్లా ప్రపంచాన్ని జయించినట్టు  విరిసిన  మీ నవ్వుల్ని చూశా. మీ సాధికారత చూశా. చదువుకునే హక్కుకోసం పోరాడి పురుషాధిపత్యాన్ని వెక్కిరించిన మీ తెగువకు ముచ్చటపడ్డా.  తల్లులు తమ కూతుళ్ల చదువుకు ఇంపార్టెన్స్‌ ఇచ్చేలా వాళ్ల ఆలోచనలను మార్చిన మీ తీరుకు మురిసిపోయా. మన అమ్మలు ఆడ బిడ్డలుగా ఉన్నప్పుడు చేయలేని పనిని మీరు చేశారు. మీ ఈ అచీవ్‌మెంట్‌ను చూసి గర్వపడుతున్నా. కానీ సుపాల్‌లో జరిగిన ఈ ఒక్క సంఘటనతో మీ శ్రమంతా వృథా అయిపోయి..  మళ్లీ ఈ సైకిల్‌ వెనక్కి వెళ్లిపోతుందేమోనని భయంగా ఉంది. 

స్కూల్లో మీ పాటికి మీరు చదువుకుంటుంటే.. పక్క ఊరి మగపిల్లలు వచ్చి మీ మీద కారుకూతలు కూస్తుంటే.. వేధింపులకు పాల్పడుతుంటే.. వాళ్లతో యుద్ధం చేశారు. ఆ ఆకతాయిలకు బుద్ధి చెప్పారు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు. ఈ గెలుపుని జీర్ణించుకోలేని పెద్దలు.. అమ్మాయిల స్వేచ్ఛ, సాధికారతకు హద్దులు గీశారు.  ఆ గీత దాటొద్దని మీ ఒళ్లు చీరారు. మూల్యం.. మీలో 30 మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా సరే.. భయపడి వెనక్కి వెళ్లొద్దు. మీ సైకిళ్లను యూటర్న్‌ చేసుకోవద్దు. జరిగిన దాంట్లో మీ తప్పు కించిత్తయినా లేదు. మీరు సేఫ్‌ జోన్‌లోనే ఉన్నారు. మీరు మితిమీరారు అనే అధికారం ఎవరికీ లేదు. మీరు మీ స్కూల్‌ ప్లే గ్రౌండ్‌లో ఆడుకుంటున్నారు. అల్లరి మూకలు విరుచుకుపడ్డప్పుడు మీ హెడ్‌మాస్టర్, టీచర్లు అక్కడే ఉన్నారు. ఆ మూకను తరిమి, వెంటనే పోలీసులను పిలవాల్సింది పోయి చోద్యం చూస్తూ నిలబడ్డారు సిగ్గులేకుండా! స్కూల్‌ తన నమ్మకాన్ని పోగొట్టుకుంది. మీ భద్రతను ప్రశ్నగా మిగిల్చింది. అందుకే నాకు భయమేస్తోంది.. పోరాడి సాధించుకున్న మీ హక్కు మళ్లీ ఇంటి గడపలో దాక్కుంటుందేమోనని. అయినా మీరు వెనక్కి వెళ్లొద్దు.. మీరు ఏ తప్పూ చేయలేదు. బిహార్‌ పతనానికి ఈ సంఘటన ఓ ప్రతీక. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలకు, శాంతిభద్రతల మీద ముఖ్యమంత్రి కోల్పోతున్న నియంత్రణకు ఓ ఉదాహరణ. మహిళల, మైనార్టీల రక్షణ విషయంలో సీఎం నితీశ్‌ కుమార్‌ వైఫల్యం ఇది. 

ఒళ్లు గగుర్పొడిచే.. గుండె పిండేసే .. కడుపు రగిలే ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోమ్‌ గాయం... ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు సుపాల్‌ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ! సంఘటనలు వేరు కావచ్చు.. కానీ సారం ఒక్కటే. అమ్మాయిల మీద దాడి... అది ఏ రకంగానైనా!  2015లో నా రాష్ట్రంలో వస్తున్న మార్పులను చూసి సంతోషపడ్డాను.  ఫ్యూడల్‌ వ్యవస్థ బలంగా ఉన్న బిహార్‌ లాంటి స్టేట్‌లో స్త్రీలు మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించి దాని వాసన లేకుండా చేశారు. మహిళలంతా కుల ప్రాధాన్యం, ప్రభావంలేని సమూహంగా ఏర్పడ్డారు. నిజంగా ఇది గొప్ప విజయం. ఒకానొక దశలో  రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరు చూసి బిహారీలమంతా గర్వంగా ఫీలయ్యాం. ప్రజోపయోగ కార్యక్రమాలు, ప్రణాళికలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న నితీశ్‌కుమార్‌లో భవిష్యత్‌ ప్రధానమంత్రి కనిపించాడు.  కానీ ఏం చేస్తున్నాడిప్పుడు? మద్యనిషేధం హామీతోనే గద్దెనెక్కిన నితీశ్‌ కుమార్‌.. మూడేళ్లలో మద్యాన్ని మళ్లీ పారించి ఆడవాళ్ల కష్టాన్ని బూడిదలో పోశాడు.  అమ్మాయిలు చదువును ప్రోత్సహించడానికి సైకిళ్లను పంచిన ఆయనే ఇప్పుడు సైకిళ్లను ఇవ్వడం రద్దు చేశాడు.. రక్షణ, భద్రత ప్రధానాంశాలనీ మరిచిపోయాడు. ఆ పాత మంచి రోజులన్నీ పోయాయి. బిహార్‌ను ‘జంగిల్‌ రాజ్‌’గా పిలుస్తున్న రోజుల్లో కూడా మా అమ్మానాన్నలకు నేను స్కూల్‌కి ఎలా వెళ్తానో..  తిరిగి ఇంటికెలా  చేరుకుంటానో అనే భయం తప్ప నా  స్కూల్‌ గురించి ఎలాంటి అనుమానం ఉండేది కాదు. స్కూల్లో  నేను భద్రంగా ఉంటాననే వాళ్ల  నమ్మకం. నాకు బాగా గుర్తు.. నా కాలేజ్‌ డేస్‌లో.. కాలేజ్‌ టైమ్‌ అయిపోయాక బయటకు ఫ్రెండ్స్‌తో ఔటింగ్‌ అంటే ‘నో’ అనే వాళ్లు మా పేరెంట్స్‌. ఎందుకంటే సేఫ్‌గా ఉండదని. అంటే స్కూళ్లు, కాలేజ్‌లు అంత భద్రంగా ఉండేవి. 

కానీ మీ విషయంలో రివర్స్‌ అయింది. వరెస్ట్‌గా మారింది. మీరేం తప్పు చేయలేదు. మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఆ మూకది తప్పు. వాళ్లు చేసిన బూతు కామెంట్లు తప్పు. ఆ తప్పును ఎత్తి చూపడానికి ధైర్యం కావాలి. అది మీకు దండిగా ఉంది.  మీలో ప్రతి ఒక్కరిని చూసి గర్వపడుతున్నాను. మీ చర్యతో సమాజంలోని స్త్రీ ద్వేషాన్ని ఎండగట్టారు. మహిళలను గౌరవించని వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో చూపించారు. స్త్రీ శక్తికి ఉదాహరణగా నిలిచారు. మీ సహజ ప్రవర్తన వల్ల మీకు అందిన ప్రతిఫలం.. నా గుండెను పిండేస్తోంది. ఆ బాధ అక్షరాలను సాగనివ్వట్లేదు. అయినా మీలో ఉత్సాహం నింపాలనే ఈ తాపత్రయం. మీరు తల వంచాల్సిన పనిలేదు. మీ హక్కులను అటకెక్కించాల్సిన  అవసరం లేదు. 

మారియా షకీల్‌ 
సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ చానల్‌ పొలిటికల్‌ ఎడిటర్‌. కేవలం ప్రజాపక్షంగా మాత్రమే సాగుతున్న జర్నో ఆమె. ఆ నిష్పక్షపాత రిపోర్టింగ్‌కే రామ్‌నాథ్‌ గోయెంకా అవార్డ్‌ వచ్చింది. మారియా షకీల్‌ పాట్నాలోని ఓ రాజకీయ కుటుంబంలో పుట్టింది.  జామియా ఇస్లామియా యూనివర్శిటీలో మాస్‌ కమ్యూనికేషన్‌ చదివింది. 2005లో సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌లోనే రిపోర్ట్‌గా మొదలై పొలిటికల్‌ ఎడిటర్‌ స్థాయికి ఎదిగింది. కరప్షన్, పొలిటికల్‌ ఇన్వెస్టిగేషన్‌ స్టోరీస్‌తో ఆమె  ప్రాచుర్యంలోకి వచ్చింది.  2014లో మోదీ వేవ్‌ ఉండబోతోందని, 2015 బీహార్‌ ఎన్నికలప్పుడు మహాఘట్‌బంధన్‌ (మహా కూటమి) విజయం సాధించబోతోందని, 2017 ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ మూడువందలకు పైగా సీట్లను గెలుచుకోబోతోందని పర్‌ఫెక్ట్‌ జోస్యం చెప్పిన ఏకైక జర్నలిస్ట్‌ మారియా షకీల్‌. 

మరిన్ని వార్తలు