అనారోగ్యాన్ని కడిగేయండి

15 Oct, 2019 13:18 IST|Sakshi

నేడు గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే

నేడు ‘గ్లోబల్‌ హ్యాండ్‌ వాషింగ్‌ డే’. పాశ్చాత్య దేశాల్లో భోజనాన్ని  చేతులకు బదులు ఫోర్క్‌లూ, స్పూన్లతో తింటారు కాబట్టి చేతులు కడుక్కోవడంలో ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి, దానికి నిర్దిష్టంగా ఒకరోజును కేటాయించారేమో గానీ బయటి నుంచి ఇంటికి రాగానే ఇంట్లోకి వచ్చే ముందర చేతులు–కాళ్లు కడుక్కోవడం మన సంస్కృతిలోనే ఒక భాగం. అతిథి ఇంటికి వచ్చినా  ముందుగా చేతులు–కాళ్లు కడుక్కునేందుకు నీళ్లివ్వడం మన ఆచారం. శుభ్రంగా చేతులు కడుక్కోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలెన్నో.

ఆటలాడుకొని పిల్లలు బయటి నుంచి రాగానే వాళ్లకు శుభ్రంగా చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి. ఒకసారి వాళ్లకిది అలవాటు అయితే ఏది తినాలన్నా చేతులు కడగందే ముట్టరు. ఒకవేళ అలా ముట్టాల్సి వస్తే వాళ్ల మనసు దానికి  అంగీకరించదు. దాంతో పిల్లల చేతులపై ఉండే వ్యాధిని వ్యాప్తి చేసే ఎన్నో క్రిములు కడుక్కుపోతాయి.
మరీ చిన్న పిల్లలకు అన్నం తినిపించే తల్లులు కూడా చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే ఆ పని చేయాలి. చేతులు కడగడం అంటే కేవలం మన అరచేతులను శుభ్రపరచుకోవడం మాత్రమే కాదు... ఎన్నెన్నో జబ్బులను నివారించడం... మరెన్నో వ్యాధుల నుంచి మన పిల్లలనూ, మన కుటుంబాన్ని సంరక్షించుకోవడం.
తినిపించడం, తినడం మాత్రమే కాదు... ఓ ఆహారాన్ని వండే ముందర, వండిన ఆహారాన్ని అల్మారాల్లో భద్రపరిచే ముందర, ఒక గిన్నెలోంచి మరో గిన్నెలోకి తీసుకునే ముందర... ఇలా ఫుడ్‌ను హ్యాండిల్‌ చేసే ప్రతి సందర్భంలోనూ చేతులు కడుక్కోవడం చాలా మంచిది.
పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఆహారం తీసుకునే ముందర, పదిమంది సామాజికంగా కలిసే చోట్లలో (కమ్యూనిటీల్లో), పెద్దల పని ప్రదేశాల్లో అంటే వర్క్‌ప్లేస్‌లలో, ఆసుపత్రుల్లో... ఇలా మనం నలుగురం కలిసే ప్రతి ప్రదేశంలోనూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఒక సంప్రదాయంగా, ఓ మంచి అలవాటుగా మారేలా చూడాలి.
స్వైన్‌ఫ్లూ లాంటి ప్రమాదకరమైన వ్యాధికి ఒకే ఒక నివారణ చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ఈ వ్యాక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా కేవలం స్వైన్‌ఫ్లూ మాత్రమే కాదు... మరెన్నో వ్యాధులు నివారితమవుతాయి. స్వైన్‌ఫ్లూ అన్నది ఒక ఉదాహరణ మాత్రమే.
మన చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్లు,  నీళ్లవిరేచనాలు (డయేరియా) వంటి వాటిని సమర్థంగా నివారించవచ్చు.
చేతులు కడుక్కోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. సబ్బుతో వేళ్ల సందులు మొదలుకొని, అరచేతులు బాగా శుభ్రపడేలా కడుక్కోవాలి. కొందరు మట్టితో చేతులు కడుగుతారు. పాత్రలూ కడుగుతారు. చేతులుగానీ, పాత్రలుగానీ శుభ్రపరచుకోడానికి మట్టి ఎంతమాత్రమే మంచిది కాదు. సబ్బును వాడటమే మంచిది. చేతులు కడుక్కోకపోవడం ద్వారా మనం ఆరోగ్యాన్ని చేజార్చుకోకూడదు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకునేలా మనం జాగ్రత్తపడగలం. ఆ సందేశం ఇవ్వడమే నేటి ‘గ్లోబల్‌ హ్యాండ్‌వాష్‌ డే’ లక్ష్యం.

మరిన్ని వార్తలు