జీవితం వెనక్కి లాగుతున్నప్పుడే ధైర్యంగా... ముందుకు సాగాలి!

12 Dec, 2013 00:24 IST|Sakshi

ఏ మనిషీ ముళ్లు ఉన్న చోట అడుగు వేయడు. ముళ్లున్నాయని తెలిసి కూడా ఆ తోవలో వెళ్లాలని అనుకోడు. తను వెళ్లాల్సిన దారిలో ముళ్లు పరిచివుంటే ఏం చేయగలరు ఎవరైనా? వాటిని ఏరి పారేసుకుంటూ వెళ్లాలి. లేదంటే వాటి మీద అడుగులు వేయకుండా తప్పించుకుంటూ నేర్పుగా నడవాలి. అది కూడా కాదంటే... ముళ్లు గుచ్చుకున్నా నొప్పిని భరిస్తూ సాగిపోగలగాలి? వీటిలో ఏది తేలిక? ఒక్కోసారి ఒక్కో మార్గం మేలనిపిస్తూ  ఉంటుంది.
 
నా దారిలో నాకు ఎన్నో ముళ్లు తగిలాయి. ఒక్కోసారి వాటిని ఏరి పారేశాను. కొన్నిసార్లు అది సాధ్యం కాక తప్పించుకు సాగడానికి ప్రయత్నం చేశాను. మరికొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా వాటి బారినపడి గాయపడ్డాను. ప్రపంచమంటే ఏమిటో తెలియకముందే ప్రపంచంలో ఇలాంటివి ఉంటాయా అని భయపడే సందర్భాలు ఎదురయ్యాయి నా జీవితంలో. పేదరికం, అవహేళనలు, అత్యాచారాలు, వేధింపులు, సాధింపులు... అబ్బ, ఎన్ని చూశాను చిన్ని జీవితంలో! వయసు పెరిగే కొద్దీ నా చుట్టూ ఉన్న ప్రపంచం కుచించుకుపోసాగింది. నాకంటూ ఎవరూ కనిపించేవారు కాదు. చుట్టూ ఉన్నవాళ్లంతా శత్రువులేమో అన్న భావన. ఎప్పుడు ఎవరేం ద్రోహం తలపెడతారో అన్న భయం.
 
వీటి మధ్య ఓ ఆడపిల్ల జీవితం ఏమవుతుంది? అస్తవ్యస్తమవుతుంది. అభాసుపాలు అవుతుంది. నా విషయంలో అది కూడా జరిగింది. ఆ నవ్వుల్ని నేను మర్చిపోలేదు. వాటిని విజయపథానికి చేర్చే మెట్లు అనుకున్నాను. ఇతరులు చేసిన ఎగతాళిని, అవహేళనలను విస్మరించలేదు. వాటిని లక్ష్యానికి గురిచూసి కొట్టే ఆయుధాలుగా మలచుకున్నాను. పట్టుదలతో ఎదిగాను. పర్వతంలా నిటారుగా నిలబడ్డాను. నా తలను చూడాలంటే ఎవరైనా వారి తల ఎత్తి చూడాల్సిందే తప్ప నేనెప్పుడూ తల దించుకోవాల్సిన అవసరం రాలేదు.
 
ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే... భయం, నిస్సహాయత, నిస్పృహలు ఏదో ఒక సమయంలో మనసును ముసురుకుంటాయి. భయపెడతాయి. వెనక్కి లాగుతాయి. నీ పని అయిపోయిందంటూ కంగారు పెట్టేస్తాయి. అప్పుడే ధైర్యంగా ఉండాల్సింది. అప్పుడే తెగించి అడుగు ముందుకేయాల్సింది. అప్పుడే మహిళ సత్తాను చూపించాల్సింది. అప్పుడే సంకల్పబలమంటే ఏంటో తెలియజేయాల్సింది. లేవండి. లేచి నడవండి. నడక ఆపకండి. ఆపే అవకాశం ఎవరికీ ఇవ్వకండి.
 
- ఓప్రా విన్‌ఫ్రే
 (పలు సందర్భాల్లో చెప్పిన విషయాల ఆధారంగా)

 

మరిన్ని వార్తలు