ఎర్రదిబ్బలో ఎన్నియలో...

22 Jan, 2015 23:23 IST|Sakshi
ఎర్రదిబ్బలో ఎన్నియలో...

విశాఖకు ప్రకృతి ప్రసాదించిన వరం ఈ ఎర్రమట్టి దిబ్బలు. దక్షిణాసియాలో మరో రెండు చోట్ల మాత్రమే ఇలాంటి దిబ్బలున్నాయి. రెండవది తమిళనాడులోని పేరి వద్ద ఉన్నా అవి జనావాసానికి దూరంగా ఉండడం వల్ల అందుబాటులో లేక అంతగా ఆదరణకు నోచుకోవడం లేదు. మూడోది శ్రీలంకలో ఉన్నాయి. వైజాగ్‌లోని ఎర్రమట్టి దిబ్బలు విశాఖ నుంచి భీమిలి వెళ్లే ప్రధానరోడ్డులో సముద్రానికి ఆనుకుని ఉన్నాయి. రోడ్డుకు అటు సముద్రం, ఇటు ఎర్రమట్టి దిబ్బలు ఉంటాయి. ఇక్కడికి రవాణా సదుపాయాలూ ఉన్నాయి. వైజాగ్ వచ్చే పర్యాటకులు ఈ ఎర్రమట్టి దిబ్బలను చూడకుండా వెళ్లలేరు. అలా వెళ్తే ఆ పర్యటన అసంపూర్తిగా ముగిసినట్టే ఫీలవుతారు.
 
ఎక్కడున్నాయి?


విశాఖ నుంచి భీమిలి వెళ్లే రోడ్డులో 20 కిలోమీటర్ల దూరంలో ఎర్రమట్టి దిబ్బలున్నాయి. ఇవి 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. రోడ్డు దిగివెళ్తే మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. నేలంతా ఇసుక పరచినట్టుగా కనిపిస్తుంది. దిబ్బల మధ్య సందులు, పాయలు ఉంటాయి. అందులోంచి వెళ్తే ఎటు వెళ్లామో, ఎటు వైపు నుంచి వచ్చామో తెలియనంత అయోమయంగా ఉంటుంది. చిన్న చిన్న మట్టి కొండల్లాంటి దిబ్బల మధ్య జీడిమామిడి, సరుగుడు, ఇతర చెట్లు ఉంటాయి. ఇవి అక్కడకు వచ్చే వారికి నీడతో పాటు చల్లదనాన్ని పంచుతాయి. అటు వైపు నుంచి సముద్రపు గాలులు కూడా తోడై పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఎర్రమట్టి దిబ్బల ఇంతటి అందాలను చూడడానికి సముద్రం ముందుకు దూసుకు రాకుండా మధ్యలో భీమిలి వెళ్లే రోడ్డు నిర్మించినట్టుగా అనిపిస్తుంది.

ఇలా వెళ్లొచ్చు...

ఎర్రమట్టి దిబ్బలకు వెళ్లడానికి విశాఖ నుంచి బస్సు, కారు, జీపు, ఆటో వంటి సదుపాయాలున్నాయి. విశాఖ నుంచి భీమిలి (బీచ్‌రోడ్డులో) వెళ్లే ఆర్టీసీ బస్సులు (ద్వారకా బస్ స్టేషన్ నుంచి) ప్రతి 15 నిమిషాలకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 5.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకూ 900కె, 900టి నంబర్ల బస్సులు వెళ్తాయి. సిటీ బస్ టిక్కెట్ ధర రూ.15లు. రైళ్లలో వచ్చే వారు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వస్తే అక్కడ నుంచి ఈ బస్సుల్లో వెళ్లవచ్చు.

ఇవి చూడొచ్చు...

ఎర్రమట్టి దిబ్బలు చూశాక అక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమిలిని సందర్శించవచ్చు. భీమిలి కొండపై అతి పురాతన నరసింహస్వామి ఆలయం, ఊరిమధ్యలో పాండవుల కాలం నాటివిగా చెబుతున్న 14 దేవాలయాల సముదాయం, బీచ్‌పార్క్, లైట్‌హౌస్, డచ్ సమాధులు, బ్రిటిషర్లు నిర్మించిన సెయింట్‌పీటర్స్ చర్చి, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి, గోస్తనీ నది సముద్రంలో కలిసే సాగర సంగమ ప్రాంతాలను సందర్శించవచ్చు. ఆసక్తి ఉన్న వారు బోటు షికారు చేయవచ్చు. అక్కడకు రెండు కిలో మీటర్ల దూరంలో సద్గురు శివానందమూర్తి ఆనంద వనాన్ని దర్శించవచ్చు. ఎర్రమట్టి దిబ్బలకు సమీపంలో బౌద్ధ కట్టడాలున్న పావురాలకొండ, తొట్లకొండ, బావికొండలతో పాటు మంగమారిపేట వద్ద బ్యాక్‌వాటర్స్‌ను కూడా తిలకించవచ్చు.
 
ప్రవేశం ఉచితం...

ఈ ఎర్రమట్టి దిబ్బల్లోకి ఉచితంగానే ప్రవేశించవచ్చు. ఎలాంటి రుసుము వసూలు చేయరు. ఎంతమందినైనా అనుమతిస్తారు. నిత్యం వందల్లో, దసరా, కార్తీకమాసం పిక్నిక్, వేసవి సీజన్లలో వేలాది మంది సందర్శిస్తుంటారు. వీరిలో ఇతర రాష్ట్రాల వారితో పాటు విదేశీయులూ ఉంటారు.

 - బొల్లం కోటేశ్వరరావు,
 ఫోటోలు: పి.ఎన్..మూర్తి
 సాక్షి, విశాఖపట్నం
 

మరిన్ని వార్తలు