పెద్ద లక్ష్యం

9 Oct, 2018 00:18 IST|Sakshi

చెట్టు నీడ

లక్ష్యం ఏమిటో నిర్థారించుకున్నాక దాని కోసం చేయవలసిన కష్టమంతా చేయాల్సిందే.

అతనిదొక ఎగువ మధ్యతరగతి కుటుంబం. తన వాటాగా తండ్రి ఇచ్చిన డబ్బుకు మరికాస్త అప్పు చేసి ఆ వచ్చిన డబ్బుతో కాస్త పెద్ద హోటల్‌ పెట్టాలనుకున్నాడు. లక్ష్యం నిర్ణయించుకున్నాడు కాబట్టి దానిని నెరవేర్చుకోవడం కోసం ముందు ఏదయినా హోటల్‌లో పనిచేసి కొంత అనుభవం గడించాలనుకున్నాడు. ఓ హోటల్‌కు వెళ్లి లెక్కలు రాసే పని అడిగాడు. తన దగ్గర పనేమీ లేదు పొమ్మని చెప్పి లోపల ఏదో పని చూసుకుని కొద్దిసేపటి తర్వాత వచ్చాడు యజమాని. ఆ యువకుడు అక్కడే ఉండటం చూసి ఇంకా ఎందుకున్నావని అడిగాడు. ‘‘సార్, నాకు ఉద్యోగం ఏమీ లేదు కాబట్టి, మీరు ఏ పని చెప్పినా చేస్తాను. బజారుకు వెళ్లి హోటల్‌కి కావలసిన సరుకులు తీసుకు వస్తాను, వచ్చిన కష్టమర్లను రిసీవ్‌ చేసుకుని వారికి ఏం కావాలో అడిగి తెలుసుకుంటాను. మీరు జీతం ఎంత ఇచ్చినా ఫరవాలేదు’’ అని ప్రాధేయపడ్డాడు. ఆ యజమానికి జాలేసి, వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. ఈ యువకుడు హోటల్‌లోకి అవసరమైన సరుకులు, కూరగాయలు మధ్యవర్తులతో పని లేకుండా స్వయంగా తనే వెళ్లి కొనడం దగ్గర నుంచి çహోటల్‌ను శుభ్రంగా ఉంచడం, వచ్చిన వారికి మర్యాద చేయడం వంటి పనులతో హోటల్‌కు ఖర్చులు తగ్గించి, రాబడి పెంచాడు.

తన మంచితనంతో, సామర్థ్యంతో తొందరలోనే అసిస్టెంట్‌ మేనేజర్‌గా, ఆ తర్వాత మేనేజర్‌గా ఉద్యోగోన్నతి పొందాడు. కొద్దికాలానికి ఆ పెద్దాయన పొరుగు దేశంలో స్థిరపడదలచి ఈ యువకుడికి నామమాత్రపు ధరకే ఆ హోటల్‌ను విక్రయించాడు. ఆ యువకుడు తాను పని చేసే హోటల్‌కు యజమాని అయ్యాడు. అలా మొదలైన ఆ యువకుడి ప్రస్థానం అంతటితో ఆగలేదు. ఎన్నో హోటల్స్‌ను స్థాపించాడు. ఎందరో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ప్రేరణ అయ్యాడు. ఆనాటి ఆ యువకుడే మోహన్‌ సింగ్‌ ఒబెరాయ్‌. స్టార్‌ హోటల్స్‌లో తనదైన ముద్ర వేసిన ఒబెరాయ్‌ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ చైర్మన్‌ అయ్యాడు. పెద్ద లక్ష్యాన్ని ఎంచుకోగానే సరిపోదు, అది స్పష్టంగానూ, అర్థవంతంగానూ ఉండాలి. దానిని ఎలాగైనా నెరవేర్చుకునే తపన, వచ్చిన చిన్న అవకాశాలని కూడా అందిపుచ్చుకునే ఓర్పూ నేర్పూ ఉండాలి. 
– డి.వి.ఆర్‌.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు