కూచిపూడికి క్రాంతి ఒరవడి

14 Mar, 2019 01:44 IST|Sakshi

లక్ష్యం

నృత్యంలో సాధారణంగా ఆడపాత్రలను సైతం మగవారే వేయడం కనిపిస్తుంటుంది. అయితే క్రాంతి మగ పాత్రలే ఎక్కువగా పోషించి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించారు. అయితే అదొక్కటే ఆమె ప్రత్యేకత కాదు!

►ఉన్నతోద్యోగాన్ని వదులుకుని కూచిపూడి సేవకు అంకితం
►పేదలకు సంప్రదాయ నృత్యాన్ని నేర్పించడమే లక్ష్యం
►‘రూపానురూపకం’ ద్వారా మరింత ప్రత్యేకంగా దేశవిదేశాల్లో ప్రదర్శనలు
►‘మోహినీ భస్మాసుర’ నాట్యానికి సాహిత్యం లేకుండా సంగీతంతో చేసిన సరికొత్త ప్రయోగానికి  దేశవిదేశాల్లో స్టాండింగ్‌ ఒవేషన్‌

తెలుగు సంప్రదాయ కూచిపూడి నృత్యమే జీవితంగా క్రాంతి నారాయణ తుపాకుల ముందుకెళుతున్నారు. కూచిపూడినే శ్వాసగా భావిస్తున్న ఆమె సాధ్యమైనంత ఎక్కువమంది పేదలకు ఈ నృత్యాన్ని నేర్పించేందుకు తనవంతుగా కృషి చేస్తున్నారు. మన సంప్రదాయ కూచిపూడి నృత్యాన్ని అనేకమంది నాట్య ప్రవీణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టగా, ఆ ఒరవడిని మరింతగా కొనసాగించేందుకు క్రాంతి పాటుపడుతున్నారు. ఇందులో భాగంగా తన గురువు శోభానాయుడు మార్గదర్శకత్వంలో కొందరికే ప్రత్యేకమైన ‘రూపానురూపకం’ ద్వారా మగపాత్రలతో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చి దేశవిదేశాల్లో మంచి పేరు సంపాదించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఆడపాత్రలను సైతం మగవారే వేసేవారు. అయితే క్రాంతి మాత్రం మగ పాత్రలే ఎక్కువగా పోషించి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించారు.

శివుడు, రాముడు, రావణుడు, విష్ణుమూర్తి, గౌతమబుద్ధ, అశోకుడు, నానవలి తదితర పాత్రలతో కూచిపూడి ప్రదర్శిస్తూ ప్రత్యేకత సాధించారు. అదేవిధంగా ‘మోహినీ భస్మాసుర’ నాట్యాంశాన్ని సరికొత్త ప్రయోగంతో ప్రదర్శించి దేశవిదేశాల్లో స్టాండింగ్‌ ఒవేషన్‌ పొందారు. సాంప్రదాయ నాట్యం చేసేందుకు సహజంగా సంగీతంతో పాటు సాహిత్యం ఉంటుంది. అయితే క్రాంతి నారాయణ ఈ నృత్య రూపకానికి సాహిత్యం (లిరిక్స్‌) లేకుండా కేవలం సంగీత వాయిద్యాలను మాత్రమే ఉపయోగించి సరికొత్త ప్రయోగంతో ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలవారికి అర్థమయ్యేలా చేశారు. భరతనాట్యమే ప్రధానంగా భావించే తమిళనాడు నుంచి అనేక ఇతర దేశాల్లోనూ ఈ కూచిపూడి ప్రదర్శనకు స్టాండింగ్‌ ఒవేషన్‌ సాధించారు క్రాంతి. సంగీతం అనేది యూనివర్సల్‌ లాంగ్వేజ్‌ కావడంతో దీని ద్వారా ప్రయోగం చేశారు.

లాభాపేక్షతో కాకుండా ఎక్కువమంది పేదలకు సంప్రదాయ నృత్య కళ నేర్పించడమే లక్ష్యమని, ఇలా చేస్తే కళ ఎప్పటికీ నిలిచి ఉంటుందని క్రాంతి చెబుతున్నారు. అదేవిధంగా సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ప్రేమ, అనురాగం పెరుగుతాయంటున్నారు.ఇప్పటివరకు దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు చేసి తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న క్రాంతికి అనేక అవార్డులు వచ్చాయి. మరోవైపు ఆమెకు అనేక పెద్ద స్థాయి పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఇప్పటివరకు ఆమె సాధించినదాన్ని చూసి అభినందిస్తూనే పెళ్లి అయిన తరువాత కొనసాగించకూడదని నిబంధన పెట్టడంతో క్రాంతి అన్ని సంబంధాలను తిరస్కరించి కూచిపూడిని తన జీవిత సర్వస్వంగా భావించారు. ఈ కళను వదిలేస్తే అన్నివర్గాలకు కూచిపూడిని చేరువ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోలేనని ఆమె చెబుతున్నారు. దేవుడు తనను కళారంగంవైపు పిలవడంతోనే ఇటు వచ్చానని అంటున్నారు.

శోభానాయుడు సంశయించారు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంకు చెందిన తుపాకుల క్రాంతి స్థానిక సెయింట్‌మేరీస్‌ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. నాలుగో తరగతి చదువుతున్నప్పుడు కొన్ని నెలలు కూచిపూడి నేర్చుకున్నారు. ఆ సమయంలో పలు ప్రదర్శనలు చేశారు. తండ్రి మాత్రం వేరే రంగంలో ఎదగాలని సూచించారు. ఈ క్రమంలో అప్పుడు ఆమె నృత్యం ఆపేశారు. అయితే నృత్యం నేర్చుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండడంతో ఉస్మానియా క్యాంపస్‌లో బీఈ మెకానికల్‌ తృతీయ సంవత్సరంలో శోభానాయుడు వద్దకు వెళ్లి కూచిపూడి నేర్పించమని అడిగారు. ఇంజనీరింగ్‌ వాళ్లు ఈ రంగాన్ని మధ్యలోనే వదిలేస్తారని శోభానాయుడు నాట్యం నేర్పించేందుకు సంశయించారు. అయితే ఈ రంగంలోనే కొనసాగుతానని మాటిచ్చిన క్రాంతి ఆమె వద్ద నేర్చుకుని ఈ రంగంలోకొచ్చారు. బీఈ తరువాత ఉస్మానియాలో ఎంబీఏ చేస్తూనే క్రాంతి అనేక ప్రదర్శనలు ఇచ్చారు.

ఎంబీఏ తరువాత మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం సాధించిన క్రాంతి ఆ కంపెనీ ద్వారా రక్షణ విభాగంలో దేశంలో పలుచోట్ల పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు రెండున్నరేళ్లపాటు ఉద్యోగం చేసి దాన్ని మానేశారు. అనంతరం కృష్ణా జిల్లా కూచిపూడిలో ఎంఏ (మాస్టర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌) కోర్సు చేశారు. వేదాంతం రామలింగశాస్త్రి సారథ్యంలో ఆ కోర్సు పూర్తి చేసి ఈ రంగంలో కొనసాగుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో క్రాంతి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 2013లో హైదరాబాద్‌లో క్రాంతి కూచిపూడి నాట్యాలయ స్థాపించి నృత్యంపై శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా సొంతూరిపై మమకారంతో 2017 నుంచి కొత్తగూడెంలోనూ శని, ఆదివారాల్లో ఇన్‌స్టిట్యూట్‌ నడిపిస్తున్నారు. విశ్వభారతి, నాట్య అభినయ కౌముది, కళాంజరి, నటరాజ సంగీత తరంగ్‌ యువ పురస్కారం, అవుట్‌స్టాండింగ్‌ యంగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇయర్‌ తదితర అవార్డు, ఇంకా మరెన్నో అవార్డులు అందుకున్నారు.

తూమాటి భద్రారెడ్డి, సాక్షి, 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మరిన్ని వార్తలు