నలుపే దైవం

22 Jan, 2018 00:56 IST|Sakshi

తెలుపును కోరుకోవడంలో తప్పేం లేదు. నలుపును చెరిపేయాలనుకోవడంలోనే..n తెలుపంటే మనకున్న ‘పెద్దచూపు’ బయటపడుతుంది. చూపు పెద్దదవకూడదు. చిన్నదవకూడదు. సమంగా ఉండాలి.


శ్రీకృష్ణుడు నల్లనివాడు. ఈవెన్‌ థో అందగాడు. ఆరాధించేస్తారు గోపికలు. ఆయన మురళీరవంలో ఉందీ అందం. ఫ్లూట్‌ ప్లే చేస్తున్నప్పుడు కాలు మీదుగా కాలు పోనిచ్చి నిలుచోవడంలో ఉంది అందం. కబుర్లేం చెప్పేవాడో గానీ వాటిల్లో ఉండేది అందం. చుట్టూ చేరేవారు పదహారువేల మంది ఫెయిర్‌ అండ్‌ లవ్లీ గర్ల్స్‌. ఆ నీలమేఘశ్యాముడి కళ్లలోకి చూస్తూ టైమ్‌ మర్చిపోయేవారు. వాళ్లెప్పుడూ లార్డ్‌ కృష్ణ.. బ్లాకా వైటా అని చూసుకోలేదు!అయితే, మనవాళ్లు చూసుకుంటున్నారు.

మనవాళ్లు అంటే.. ఇండియన్స్‌. ఈమధ్య క్యాలెండర్లలో, స్టిక్కర్‌లలో శ్రీకృష్ణుడు ఫెయిర్‌ స్కిన్‌తో కనిపిస్తున్నాడు. పురాణాలను ఇలా ఇష్టంవచ్చినట్లు మార్చేయొచ్చా! నల్లగా ఉంటే తెల్లగా!! మార్చేస్తున్నారు. ఇంట్లో తగిలించుకునే పోస్టర్‌లో, ఇంటి తలుపుకు అంటించుకునే స్టిక్కర్‌లో నల్లనయ్య తెల్లనయ్యగా దర్శనం ఇస్తున్నాడు. గణపయ్య అయితే మన చిన్నప్పట్నుంచే వైట్‌ కలర్‌తో భారతీయ భువిలోకి వచ్చి ఉంటున్నాడు.ఎప్పుడైనా, ఎక్కడైనా చూశామా.. బ్లాక్‌ విఘ్నేశ్వరుడిని! పోనీ బాడీ మొత్తాన్ని వదిలేసినా ఆయన తల నల్లరంగులోనే ఉండాలి కదా.. ఇండియాలో కనిపించేవన్నీ బ్లాక్‌ ఎలిఫెంట్సే కాబట్టి! అలా ఉండడు.

పాల మీగడ రంగులో ఉంటాడు. తెలుపంటే మనకు పిచ్చి ప్రేమ కాబట్టి, చర్మాన్ని తెల్లగా మార్చే క్రీములు పూసుకోవడంతో సరిపెట్టుకోవడం లేదు. నలుపు రంగులో ఉండే దేవుళ్లను కూడా తెలుపులోకి మార్చుకుంటున్నాం. పెళ్లి చేసుకోవడానికి తెల్లటివాళ్లు కావాలి. íసినిమాల్లో యాక్ట్‌ చెయ్యడానికి తెలుపే కావాలి. యాడ్‌ షూటింగుల్లో మోడలింగ్‌కీ ౖవైటే. ఇప్పుడు నల్లగా ఉండే దేవుళ్లకి కూడా వైట్‌ పెయింట్‌ వేసుకుంటున్నాం!

తెలుపును కోరుకోవడంలో తప్పేం లేదు. నలుపును చెరిపేయాలనుకోవడంలోనే.. తెలుపంటే మనకున్న ‘పెద్దచూపు’ బయటపడుతుంది. చూపు పెద్దదవకూడదు. చిన్నదవకూడదు. సమానంగా ఉండాలి.ఇన్నాళ్లు నలుపుపై ఉన్న చిన్నచూపును పోగొట్టడానికి క్యాంపెయిన్‌లు నడిచాయి. ‘డార్క్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’, ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ ఇలాంటివి.  ఫెయిర్‌నెస్‌ క్రీములకు పబ్లిసిటీ ఇచ్చే సినీ తారలు కూడా అవేర్‌నెస్‌తో అవతలికి వెళ్లిపోతున్నారు.. మేం చెయ్యం పొమ్మని. అయినా గానీ, వైట్‌కి ఉన్న వెయిట్‌ తగ్గడం లేదు. బ్లాక్‌కి ఉన్న ‘డ్రాబ్యాక్‌’ తగ్గడం లేదు. అమ్మాయిల విషయమైతే మరీ అన్యాయం. ఎంత టాలెంట్‌ ఉన్నా, ఎంత క్యూట్‌గా ఉన్నా, ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నా.. చివరికి కౌంట్‌ అయ్యేది తెలుపే కానీ, నలుపు కాదు.

అందుకనిప్పుడు.. భరద్వాజ్‌ సుందర్‌ అనే చెన్నై యాడ్‌మేకర్, నరేశ్‌ నీల్‌ అనే ఫొటో గ్రాఫర్‌ కలిసి ‘డార్క్‌ ఈజ్‌ డివైన్‌’ అనే రివర్స్‌ క్యాంపెయిన్‌ మొదలుపెట్టారు. తెల్లటి దేవతామూర్తులను, తెల్లటి పౌరాణిక పాత్రలను నలుపు రంగులో ప్రెజెంట్‌ చేస్తున్నారు! అందుకోసం డార్క్‌గా, డాషింగ్‌గా ఉన్న మోడల్స్‌ని ఎంపిక చేసుకుని ఫొటోలు షూట్‌ చేస్తున్నారు. అపచారం కదా! ‘‘కానే కాదు’’ అంటున్నారు సుందర్, నరేశ్‌ నీల్‌. ‘‘దేవుడి సృష్టిలో అన్నీ సమానం అయినప్పుడు నలుపు ఇన్ఫీరియరు, తెలుపు సుపీరియరు ఎలా అవుతాయి? కావు అని చెప్పడానికే దేవుణ్ణి ఆశ్రయించాం. దేవుణ్ని దేహీ అనడం అపచారం అవుతుందా’’ అంటున్నారు. పాయింటే.

మరిన్ని వార్తలు