మనకేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు!

8 Nov, 2017 23:53 IST|Sakshi

ఆత్మీయం

భక్తిలో తొమ్మిది మార్గాలున్నాయని, అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన చేయడం, నమస్కరించడం, దాస్యం, సఖ్యం, ఆత్మార్పణ చేసుకోవడం అని, వాటిలో ఏ ఒక్కమార్గాన్ని చిత్తశుద్ధితో అవలంబించినా భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చని బాబా బోధించాడు. భక్తజనుల పక్షపాతి అయిన శ్రీ షిర్డిసాయి క్తులకు వచ్చిన కష్టాలను తాను స్వీకరించి, వారిని ఆయా బాధలనుంచి విముక్తులను చేసిన ఉదంతాలు సాయి సచ్చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రేమించటం తప్ప ద్వేషించటం ఎరుగని సాయి తన భక్తులు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు మందలిస్తారు. మొక్కులు మొక్కి, అది తీరగానే అది చేస్తాం యిది చేస్తాం అని ఆ తర్వాత ముఖం చాటేసేవారిని సాయినాథుడు వదలడు. వారినుంచి తనకు రావలసిన బాకీని బహు చక్కగా వసూలు చేసుకుంటాడు.

సమాధి నుంచే తాను భక్తులు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పిన సాయి భగవానుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం ఒక్కనాటికి కూడా మరచిపోలేదు. ప్రశాంతచిత్తంతో మొరపెట్టుకుంటే చాలు ఆయన భక్తుల మొర ఆలకిస్తాడు. అడిగినది ఇస్తాడు. అయితే ఆయన చెప్పేది ఒకటే, జలతారు వస్త్రం ఇవ్వడానికి తాను సిద్ధపడితే గుడ్డపీలికలు కోరుకోవద్దంటాడు. అంటే ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో తనకు తెలుసునని, అల్పమైన కోరికలు కోరకుండా, ఆత్మజ్ఞానం కలగాలని కోరుకున్న వారికి తాను అన్నీ ఒసగుతానంటాడు. సాయిబాటలో నడవాలంటే  ముందుగా సాటి మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్చుకోవాలి.

మరిన్ని వార్తలు