సాక్షాత్తూ ‘మల్లీశ్వరి’ కెమెరామేన్ మెచ్చుకున్నారు!

12 Apr, 2014 23:15 IST|Sakshi

‘గూండా’ సినిమా క్లైమాక్స్. విలన్లు రైలు కింద బాంబులు అమర్చారు. ఏ క్షణంలోనైనా పేలిపోతాయి. హీరో చిరంజీవి ఊరుకుంటాడా! ఎంతో సాహసంతో కదులుతున్న రైల్లోంచి ఆ బాంబుల్ని తీసి పారేశాడు. ఈ క్లైమాక్స్‌కి క్లాప్స్ పడ్డాయి. తెరపై రిస్క్ చిరంజీవిదైతే, తెరవెనుక రిస్క్ మాత్రం కెమెరామేన్ ఎ. వెంకట్‌ది.  కదులుతున్న రైలు కింద కెమెరా పెట్టి రకరకాల యాంగిల్స్‌లో షాట్స్ తీయడమంటే మాటలు కాదు. వెంకట్ కెరీర్‌లో ఇలాంటి సాహసాలు, ప్రయోగాలు చాలా ఉన్నాయి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీల్లో సుమారు 80 చిత్రాలకు పని చేసిన ఈ అనుభవజ్ఞుడైన ఛాయాగ్రాహకుడు చెన్నైలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయన ‘సాక్షి’కి చెప్పిన కొన్ని ముచ్చట్లు.
 
మాది బాపట్ల తాలూకా అప్పికట్ల గ్రామం. స్టిల్ కెమెరాపై ఆసక్తి నన్ను మూవీ కెమెరా దగ్గరకు చేర్చింది. మా ఊరి ప్రొడక్షన్ మేనేజర్ పుణ్యమా అంటూ చెన్నై చేరుకున్నాను. కష్టపడి రేవతీ స్టూడియోలో అప్రెంటిస్‌గా చేరా. అలా మొదలైన ప్రయాణం విన్సెంట్ గారి పరిచయంతో మలుపు తిరిగింది. ఆయన దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. ఎంతలా అంటే... సేమ్ టూ సేమ్ ఆయనలా షాట్స్ తీయాలంటే నా వల్లే అవుతుందన్నంతగా అన్నమాట. విన్సెంట్‌గారి దగ్గర పని చేస్తున్నప్పుడే నాకు ‘రాజమల్లి’ (1964) అనే మలయాళ సినిమాకు స్వతంత్రంగా ఛాయాగ్రహణం చేసే అవకాశం వచ్చింది.
 
ఓ పక్క నా సినిమాలు చేసుకుంటూనే, మరో పక్క విన్సెంట్‌గారి దగ్గర ఆపరేటివ్ కెమెరామేన్‌గా పని చేసేవాణ్ణి. గురువుగారి ఆధ్వర్యంలో చాలా గొప్ప గొప్ప సినిమాలకు పని చేశానన్న సంతృప్తి ఉంది. భక్త ప్రహ్లాద, లేత మనసులు, వసంత మాళిగై (తమిళం), ప్రేమనగర్ (హిందీ)... ఆ జాబితాలో ఉన్నాయి. ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ సినిమాకి నేనే సెకండ్ యూనిట్ కెమేరామేన్‌ని.
 
నా దగ్గరకు వచ్చిన అవకాశాలే చేశాను. ఎవర్నీ అడగలేదు. మిచెల్, యారీఫ్లెక్స్ కెమెరాలన్నీ నాకు కొట్టిన పిండి. ఇప్పటి డిజిటల్ కెమెరాలపై అవగాహన లేదు.
 
ఛాయాగ్రాహకునిగా రాసి కన్నా వాసి ప్రాధాన్యమిచ్చేవాణ్ణి. అవకాశం ఎక్కడ దొరికినా ప్రయోగాలకు సిద్ధమయ్యేవాణ్ణి. మాస్క్ షాట్స్ అందరూ చేస్తారు కానీ, బ్యాక్ ప్రొజెక్షన్‌లో చేయడం చాలా కష్టం. తమిళంలో ‘మదనమాళిగై’ కోసం కదులుతున్న రైల్లో మాస్క్ షాట్స్ తీశా. ఇద్దరు శివకుమార్‌లు ఒకే ఫ్రేమ్‌లో ప్రయాణిస్తున్నట్టు బ్యాక్ ప్రొజెక్షన్‌లో చిత్రీకరించా. సాక్షాత్తూ ‘మల్లీశ్వరి’ కెమెరామేన్ కొండారెడ్డి ఈ షాట్‌ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ‘జగమొండి’లో ఫ్రేమ్‌లో అయిదుగురు శోభన్‌బాబులు కనిపించేలా తీశా.
 
 తమిళ చిత్రం ‘అక్కర పచ్చై’లో రెండే రెండు లాంగ్ షాట్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా కాబట్టి అన్నీ మిడ్ షాట్స్ తీశా. మలయాళ చిత్రం ‘తీర్థయాత్ర’కి కొవ్వొత్తి వెలుగులో నది ఒడ్డున కార్తికస్నానం షాట్ తీశా. ఆ షాట్స్ గురించి ఇప్పటికీ గొప్పగా చెబుతుంటారు.
 
 విన్సెంట్‌గారు డెరైక్ట్ చేసిన 10 సినిమాలకు నేనే ఛాయాగ్రాహకుణ్ణి. అది నా అదృష్టం. ముఖ్యంగా, మలయాళ చిత్రం ‘నది’ అంతా పడవ లోనే నడుస్తుంది. 15-20 రోజులు ఆల్వాయ్ నదిలో షూటింగ్ చేశాం. కొన్ని మ్యాచింగ్ షాట్స్ మిగిలిపోతే మద్రాసులోని జెమినీ స్టూడియోలో సెట్ వేసి తీయాల్సి వచ్చింది. నాకు వేరే సినిమా వర్క్ ఉండి, మల్లీ ఇరానీని పంపించాను. ‘‘ఒక్క రోజుకే నా నడుము పడిపోయింది. ఆయనతో ఇన్ని రోజులు ఎలా పనిచేశావు. అన్నీ లోయాంగిల్ షాట్స్ అంటున్నారు’’ అని చెప్పాడు నాతో.
 
హిందీలో దిలీప్‌కుమార్, జితేంద్ర, రాజేష్‌ఖన్నా, మిథున్ చక్రవర్తి, ధర్మేంద్ర, రిషీకపూర్‌ల చిత్రాలకు పనిచేశా. తెలుగులో నా తొలి సినిమా ‘సావాసగాళ్లు’. ఆఖరి సినిమా ‘హలో గురూ’.
 
 నేను గర్వంగా చెప్పుకునే సినిమా - ‘ముందడుగు’. ఆ భారీ మల్టీస్టారర్‌లో ఆర్టిస్టులను డీల్ చేయడం చాలా కష్టం కదా. అయినా సునాయాసంగా చేయగలిగా. జితేంద్ర, రాజేశ్‌ఖన్నాలతో తీసిన హిందీ వెర్షన్ ‘మక్సద్’కి నేనే వర్క్ చేశా. ‘అగ్ని పూలు’ కూడా నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. ‘రామరాజ్యంలో భీమరాజు’లో కృష్ణను అందంగా చూపించానంటూ శతదినోత్సవ సభలో దాసరి ప్రశంసించారు. ‘‘కెమెరాను ఆపరేట్ చేయడంలో వెంకట్‌ని ఎవ్వరూ కొట్టలేరు’’ అని విన్సెంట్ గారు అందరికీ చెబుతుంటారు. అదే నాకు పెద్ద పురస్కారం.        

- పులగం చిన్నారాయణ
 

మరిన్ని వార్తలు