అన్ని స్థితులూ ఆ దైవం కల్పించినవే

20 Oct, 2019 05:22 IST|Sakshi

ఇస్లాం వెలుగు

జీవితం విభిన్న స్థితుల సంగమం. సుఖ దుఃఖ సమ్మేళనం. సంతోషం– బాధ, ఆనందం– విచారం, తీపీ– చేదూ; శీతలం– ఉష్ణం; సంతృప్తీ– అసంతృప్తీ; శాంతి–అశాంతీ  ఉన్నాయి. ఇదంతా దైవాభీష్టం. అందుకని ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నిరాశానిస్పృహలకు లోను కాకూడదు. ఇవన్నీ దేవుని తరఫునే అని భావిస్తూ, ఆ కరుణామయుడే వీటినుండి విముక్తి కలిగిస్తాడని నమ్మాలి. ఇదేవిధంగా కష్టాలు దూరమై, పరిస్థితులు మెరుగు పడి, అంతా సజావుగా జరిగిపోతూ, సుఖసంతోషాలు ప్రాప్తమైతే అది తమ గొప్పదనమేనని, తమ రెక్కల కష్టార్జిత ఫలితమేనని భావించి విర్రవీగకూడదు.

ఇదంతా అల్లాహ్‌ అనుగ్రహమని, ఆ కరుణామయుని ప్రసాదితమన్న విశ్వాసంతో ఉండాలి. ఆయన ఎప్పుడు కోరితే అప్పుడు తాను ప్రసాదించిన అనుగ్రహాలను తిరిగి లాక్కోగలడు. కాబట్టి ప్రతి అనుగ్రహానికీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. అల్లాహ్‌ ఇలా అంటున్నాడు:‘మానవులారా! నా ప్రసన్నత కోసం, నేను ప్రసాదించే పుణ్యాన్ని పొందే సంకల్పంతో, దుఃఖ సమయం ఆసన్నమైనప్పుడు సహనం వహించినట్లయితే, నేను స్వర్గం కన్నా తక్కువైన దాన్ని, స్వర్గం తప్ప మరిదేన్నీ మీకు ప్రసాదించడానికి ఇష్టపడను.’ప్రతి వ్యవహారంలో, ప్రతిస్థితిలోనూ వారికి శుభాలే శుభాలు. వారికి శాంతి, సుఖ సంతోషాలు ప్రాప్తమైతే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.

ఇది వారి పాలిట శుభాలపంట. ఒకవేళ వారికి దుఃఖ విచారాలు కలిగితే, ఇదీ దైవ నిర్ణయమేనని భావిస్తూ సహనం వహిస్తారు. ఈ సహనం వహించడం కూడా వారి పాలిట శుభాల పంటే అవుతుంది. ప్రాపంచిక జీవితంలో కష్టనష్టాలు, సుఖ సంతోషాలు చాలా సహజ విషయాలు. వీటి ద్వారా దైవప్రసన్నత, ఆయన సామీప్యం పొందడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి. సుఖ సంతోషాలు, శాంతి సంతృప్తులు ప్రాప్తమైనప్పుడు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. కష్టాలు కడగండ్లు ఎదురైతే, జరగరాని సంఘటనలు ఏమైనా జరిగి కష్టనష్టాలు, బాధలు సంభవిస్తే సహనం వహించాలి. అంటే, అన్ని స్థితులనూ సమానంగా ఆస్వాదించగలగాలి. ఇలాంటి వారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు. తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు.

మరిన్ని వార్తలు