సంబరంగా.. ‘సట్ల’ సందడి!!

18 Dec, 2014 23:40 IST|Sakshi
సంబరంగా.. ‘సట్ల’ సందడి!!

కుక్కలో భగవంతుణ్ణి (మల్లన్న దేవుణ్ణి) చూసుకుని పూజిస్తారిక్కడి ప్రజలు. విశ్వాసంతో తమ పంటలను, పశు, పక్ష్యాదులను కంటికి రెప్పలా కాపాడే మల్లన్నలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మల్లన్న దేవుణ్ణి బంతి పూలదండలతో అలంకరిస్తారు. పట్టెమంచంపై కూర్చుండ బెడతారు. ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలతో కడుపారా భోజనాలు పెడతారు. ఏటా డిసెంబర్ నుంచి జనవరి వరకు అంటే దత్త పౌర్ణమి నుండి ముజ్గ పౌర్ణమి వరకు సుమారు నెల రోజుల పాటు ప్రతి ఆదివార మూ ఘనంగా జరుపుకుంటారు. ఈ సట్టి పండగ సందడి ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఘనంగా ప్రారంభమైంది.

 ఆదిలాబాద్ జిల్లాలోని ముథోల్ తాలుకా పరిధిలో ఉన్న కుబీర్, ముథోల్, తానూరు, లోకేశ్వరం, కుంటాల, మండలాల తదితర గ్రామాలలోనూ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోనూ వ్యవసాయాధారిత కుటుంబాలు ఈ పండగను ఘనంగా నిర్వహిస్తారు. బంధువులను, స్నేహితులను ఇంటికి పిలిపించుకుని సాంప్రదాయ బద్ధంగా జరుపుకుంటారు. గ్రామంలోని ఒక్కో కులస్తులు ఒక్కో రోజు చొప్పున ఈ పండగను నిర్వహిస్తారు. సట్టి పండగ రోజున ఇల్లంతా శుభ్రంగా కడుక్కుని ఇంటిని బంతిపూలతోరణాలతో అలంకరిస్తారు. గోధుమలతో పాయసం వండుతారు. కొత్త బియ్యం, ఇతర పప్పుదినుసులు (నవధాన్యాలు)లతో పలు రకాల వంటలు చేస్తారు. ఆ వంట పాత్రలను కూడా పూలదండలతో అలంకరిస్తారు. అనంతరం గ్రామ దేవతలు మహాలక్ష్మి అమ్మవారు, ఉరడమ్మ, పోశమ్మ, మైసమ్మ.. ఇలా ఒక్కో గ్రామానికి ఒక్కో పేరుతో వెలసిన అమ్మ వార్లకు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పిస్తారు.

అనంతరం ఇంటికి వచ్చిన తమ పెంపుడు కుక్క (మల్లన్న దేవుని)ను ప్రత్యేకంగా అలంకరిస్తారు. మెడలో బంతిపూల మాలలు వేసి, పట్టెమంచంపై కూర్చోబెట్టి  తాము తయారు చేసిన వంటకాలతో కడుపారా భోజనం పెడతారు. తర్వాత ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులతో కలిసి భోజనాలు చేస్తారు. దుక్కి దున్నే నాటి నుంచి పంటలు చేతికందే వరకు తమకు తోడు, నీడగా నిలిచిన వ్యవసాయ కూలీల కుటుంబాలను సైతం ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెడుతుంటారు. పాడి రైతులు ఆ రోజు తమ ఇంటి పశువులు ఇచ్చిన పాలను బయట విక్రయించరు. ఎన్ని పాలు ఉత్పత్తి అయినా వాటిని వారే వినియోగించడం ఆనవాయితీ. ఈ సట్టి పండగ జరుపుకున్న తర్వాతే కొందరు రైతులు తమ పంట చేలల్లో పండించిన పంటలను భుజించే వారు. అప్పటివరకు ధాన్యాన్ని కూడా విక్రయించరు. ఈ పండగను నిష్టతో నిర్వహించిన ప్రతిరైతు ఇంట సిరుల పంట పండుతుందని నమ్మకం. ఇప్పటికీ కొన్ని రైతు కుటుంబాలు ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి.
 - పాత బాలప్రసాద్,
 సాక్షి ప్రతినిధి,
 ఆదిలాబాద్
 

మరిన్ని వార్తలు