మనిషి స్వార్థంతో మసకబారిన దేవుని ప్రేమ!!

12 Jan, 2020 02:14 IST|Sakshi

సువార్త

పస్కా పండుగనాచరించడానికి యూదులంతా యెరూషలేము పట్టణానికి రావాలన్నది ధర్మశాస్త్ర నిబంధన (నిర్గమ 23:7). అందువల్ల యేసుప్రభువు కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయంలోనే పస్కాపండుగ కోసం యెరూషలేము పట్టణానికి వచ్చాడు. యెరూషలేము ప్రజలను, పండగనాచరించడానికి అక్కడికి వచ్చిన యూదులనుఉద్దేశించి ‘నేను ఆకలితో ఉన్నపుడు నాకు మీరు భోజనం పెట్టారు, నాకు దాహమైనపుడు నీళ్లిచ్చారు, పరదేశిగా ఉన్నపుడు ఆశ్రయమిచ్చారు, వస్త్రాలు లేనపుడు వస్త్రాలిచ్చారు, రోగినై వుంటే, చెరసాలలో ఖైదీగా ఉంటే నన్ను మీరు పరామర్శించారంటూ యేసు చేసిన బోధ యెరూషలేములో పెద్ద సంచలనమే రేపింది (మత్తయి 25;35,36), ఈ బోధ విన్న వాళ్లంతా, ‘ప్రభువా, మీకోసం మేము ఇవన్నీ ఎప్పుడు చేశాము?’ అంటూ అమాయకంగా ప్రశ్నించారు. ‘‘నాకు ప్రత్యక్షంగా చెయ్యలేదేమో, కానీ మీ చుట్టూ ఉన్న పేదలు, నిరాశ్రయులైన వారికి మీరు చేసిన ప్రతి మేలూ, సహాయమూ నాకు చేసినట్టే’’ అని వివరించి, ఇలా పేదలను ఆదుకున్న ‘మీరంతా నా పరలోకపు తండ్రిచేత ఆశీర్వదించబడినవారు’ అని ప్రకటించాడు.

దేవుని దర్శనం కోసం ఎక్కడెక్కడినుండో వచ్చిన నాటి యూదులందరికీ, ‘దేవుని చూసేందుకు ఇంత దూరం రానఖ్ఖర్లేదు, మీరుండే ప్రాంతాల్లోనే మీ చుట్టూ ఆపదల్లో, అవసరతల్లో ఉన్న పేదలు, బలహీనులకు అండగా నిలిస్తే చాలు, దేవుని చూసినట్టే, ఆయన్ను సేవించినట్టే’ అంటూ యేసు చేసిన నాటి బోధతో పండుగ తర్వాత సొంత ఊళ్లకు వెళ్లిన యూదు ప్రజలు, ప్రభావితులై వచ్చే ఏడాది యెరూషలేముకు రాకపోతే, వారి కానుకలు లేక ఆలయ ఖజానా వెల వెలబోతే, యాజకులు, ఆలయ నిర్వాహకులైన లేవీయులు బతికేదెలా? ఆలయ ప్రాంగణంలో అనుబంధంగా సాగుతున్న వ్యాపారాలు మూతపడితే ఎంత నష్టం? వెంటనే యాజకులు, యూదు ప్రముఖులు సమావేశమై ‘ఇక యేసును చంపాల్సిందే. కాకపోతే పండుగలో చంపితే ప్రజలు తిరుగబడతారు గనుక నిదానంగా ఆ పని చేద్దాం’ అని తీర్మానించుకున్నారు (మత్త 26:3,4). దేవుని మానవరూపమూ, తానే దేవుడైన యేసును చంపేందుకు, ఆయనకు ఆరాధనలు నిర్వహించే వారే కుట్ర చెయ్యడం కన్నా మరో విషాదం ఉంటుందా? దేవాలయ యాజక వ్యవస్థ స్వార్ధపూరితమైన ప్రతిసారీ, చరిత్రలో ఇలాంటి అనర్థాలే జరిగాయి.

దేవుని ఉదాత్తమైన సంకల్పాలను మరుగు పర్చగల ‘నాశనకరమైన శక్తి’ మనిషి స్వార్థానిదని మరోసారి రుజువైంది. దీనికన్నా విషాదకరమైన పరిణామం మరోటి జరిగింది. పస్కా పండుగ మరునాడే అంటే అర్ధరాత్రి దాటగానే, ప్రజలంతా గాఢనిద్రలో ఉండగానే యేసును తాను అప్పగిస్తానని, ఆయన్ను అర్ధరాత్రే బంధించి, ప్రజలు నిద్ర లేచేలోగా విచారణ చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని యేసు శిష్యుల్లోనే ఒకడైన యూదా ఇస్కరియోతు ఆలయ యాజకులకు సూచించి అందుకు ముప్పై వెండినాణేలకు వారితో ఒప్పందం చేసుకున్నాడు. చివరికి అదే జరిగి మరునాడే యేసును సిలువ వేశారు.  యేసు బోధల్ని ఉన్నవి ఉన్నట్టుగా లోకానికి చేరవేయవలసిన చర్చి, పరిచారకుల వ్యవస్థ తమ స్వార్థం కోసం వాటిని కలుషితం చేస్తున్నందువల్లే, దేవుని రాజ్య నిర్మాణం ఆగిపోయింది, ఎంతోశక్తితో సమాజాన్ని ప్రభావితం చేసి లోక కల్యాణానికి కారణం కావలసిన క్రైస్తవం’ పేలవమైంది.
– రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్‌   

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు