ఎర్ర కుందేలు

25 Feb, 2018 00:27 IST|Sakshi

పచ్చజొన్న చేనులో ఏదో కదిలినట్టనిపించింది. ఏంటది? పులా? దాని ముఖం. ఈ ఇలాకాలో ఒకటే పులి ఉంది. అది తను. ఒక్క క్షణం కూసుగా చూపు సారించి, కదలిక లేకపోవడంతో చెల్కపార భుజాన పెట్టుకొని చేనుగట్టు మీద తల ఎగరేస్తూ నిలబడింది. ఆకాశం ఇంకా చీకటిని విడిచిపెట్టలేదు. చీకటి విడిచిపెట్టే లోపే– చలి అంటున్నా వినకుండా– ఒక్కదానివే అన్నా వినకుండా– చిన్నపిల్లవు అంటున్నా వినకుండా వచ్చేస్తుంది. వేరుశనగపంట ఎదుగుదలలో ఉంది. చేను నీళ్లు తాగాల్సిన అదను. నీళ్లు తాగకపోతే చచ్చిపోదూ? ఇరుగుపొలం వాళ్లు పొరుగు పొలంవాళ్లు వచ్చేలోపే పాచిపళ్లతో వచ్చి నీళ్లు పారించుకుంటుందని అందరికీ కోపం. ‘ఒసేవ్‌ దెయ్యం’ అని ఒక జీతగాడంటాడు.

‘ఏమే తాటకి’ అని ఇంకో జీతగాడంటాడు. వాళ్లు ఆలస్యం అయ్యేలోపు నీళ్లు మలుపుకుని చేను తడుపుకుంటుంది. చెరువు కాలువకు అందరూ మొగుళ్లే. అందరూ నీళ్లు మలుపుకుంటే కాలువ పలుచబడి చేను తడవాల్సినంత తడవదు. తడవకపోతే తండ్రి కష్టం చేతికి అందదు. తండ్రంటే చాలా ఇష్టం తనకు. తండ్రికి తనంటే కూడా. ‘నన్ను కని మాయప్ప నాకు చాకిరీ చేసేవాడు. నాకు కూతురులా పుట్టి మళ్లీ చాకిరీ చేస్తున్నాడు’ అని పొంగిపోతుంటాడు. మొన్నటి మొల్కల పున్నమికి పన్నెండు వచ్చాయనీ అప్పుడే అన్ని పనులు చేతనవుతున్నాయని తల్లి దిష్టి తీసి బొగ్గునీ తమలపాకునీ దారిలో పారేసి వచ్చింది. చూసి నవ్వుకుంది. తనకెవరు దిష్టి పెడతారు? దొరికితే ఆ దిష్టిదాని ఊపిరి తీయదూ? పచ్చజొన్న చేనులో మళ్లీ ఏదో కదలిక అయ్యింది.

ఉలిక్కిపడి చూసింది. ఏమీ కనిపించలేదు. చీకటి వదలడానికి ఇంకా టైముంది. చలి ఎక్కువగా ఉంది. పక్కనే ఉన్న పచ్చజొన్న చేను జీతగాడు ఈసరికి రావాలి. రాలేదు. చలికి ముడుక్కుని నీళ్లు మలుపుకునే పని మరిచాడా? నిజానికి తను కూడా ఆలస్యం అయినట్టే లెక్క. దానికి కారణం కుందేలు. నిన్న సాయంత్రం చెరువు దగ్గర సోబతు పిల్లలతో గిల్లిదండా ఆడుతూ గిల్లిని లగాయించి కొట్టింది. అది గాలిలో తేలుతూ వంకరలు తిరుగుతూ వెళ్లి తునికి పొదల దగ్గర పడింది. లోపల నక్కి ఉన్న కుందేలు ఒకటే పరుగు. ‘కుందేలు.. కుందేలు’ అన్నారు సోబతులు. అడవి కుందేలు కూరను తండ్రి జన్మకో శివరాత్రి అన్నట్టు కళ్లకద్దుకుని తిని తృప్తి పడటం గుర్తొచ్చింది. ‘దారి మళ్లించండి... దారి మళ్లించండి’ అరిచింది.

సోబతులు రెండుగా చీలి ‘ఓ...ఓ...ఓ...ఊ....హూ’ అని మొత్తుకుంటుంటే కుందేలు కంగారు పడి చేన్ల వైపు మళ్లడానికి భయపడి చెరువు వైపు మళ్లి నీళ్లలో దూకింది. ‘ఇంకేంది... చెరువు దాటి అవతలి గట్టుకు వెళ్లిపోతుంది’ అన్నాడు సోబతు. ‘మధ్యలోనే చస్తుంది’ అన్నాడింకొకడు. ఇద్దరూ చెరువులోకెళ్లడానికి భయపడుతున్నారు లోతుకి. కుందేలు వేగంగా ఈదుతోంది. ఏం చేయాలి? లంగాను గోచి పోసి ఒక్క దూకు దూకింది. చేప చాలదు ఈతలో. కుందేలు ఎంత. వెళ్లి వెళ్లి మెడ మీదున్న ఒదులు చర్మాన్ని కతుక్కున పట్టుకుంది. తండ్రి కల్లు సీసాతో ప్రత్యక్షమయ్యాడు ఇది తెలిసి. ఇప్పుడిక చాలా సంతోషంగా ఉంటాడు. రెండు ముద్దలు ఎక్కువ తింటాడు. తండ్రి ఎప్పుడూ పరేషానుగా ఉంటాడని తనకు బెంగ. ‘ఎందుకు పరేషానీ’ అడిగింది ఒకసారి.

‘చేను గురించమ్మా. ఈ చేను మన్ది కాదని దొర అంటాడు. మూడు తరాలకు ముందు బూదానోద్యమం జరిగి వాళ్ల తాత మన తాతకు రాసిచ్చాడట. తిరిగి తీసుకోవచ్చులే అనుకున్నారు. సీలింగు చట్టం వచ్చి ఆ భూమి మనకు మిగిలింది. అప్పటి నుంచి తకరారే. ఇప్పుడున్న దొర కిరికిరీ చేస్తూనే ఉంటాడు దాని కోసం. కొట్టాడు కూడా’... ఆ బాధంతా మరిచి ఇవాళ కూర తింటాడని సంతోషం. తను కూడా పీకల్దాకా తిని పడుకుంది. లేచే సరికి ఆలస్యం. దూరంగా ఏదో పిట్ట నిద్ర లేచి కూత పెడుతూ ఎగిరెళ్లిపోయింది. చేను తృప్తిగా నీరు తాగుతూ ఉంది. దొర చేను కంటే ముందు తన చేను తడుపుకుంటుంది. జీతగాడు బెదిరిస్తుంటాడు దొరకు చెప్తానని... చెప్పుకోపో అని తల ఎగరేస్తుంది.

ఏం.. దొరంటే భయమా? పచ్చజొన్న చేను ఈసారి నిజంగానే కదిలింది. చెయ్యెత్తు జొన్నమొక్కలను చీల్చుకుంటూ ఎలుగ్గొడ్డులా దొర ప్రత్యక్షమయ్యాడు. పై ప్రాణాలు పైనే పోయాయి. వచ్చి రెక్క పట్టుకున్నాడు. ‘ఏమే లంజ... మొగోని లెక్క చేనుకు నీళ్లు పారబెడుతున్నావే. మా ఇళ్లలో నీఅంత ఆడపిల్లలు చేను వైపే రారు. ఆడపిల్లలను ఎలా ఉంచాలో మీ మాల మాదిగోల్లకు తెలియదానే. చెప్తా ఉండు’ అని రెండు చేతులు పైన వేసి వెతుకుతున్నాడు. దొర గురించి విన్నదంతా గుర్తుకొస్తోంది. గుండె గుబగుబలాడిపోతోంది. ‘దొర.. ఇడిచిపెట్టు.. ఇడిచిపెట్టు’ గింజుకుంటోంది. దొర రెక్క పట్టి జొన్నచేనులోకి లాక్కు వెళుతున్నాడు. ‘నీ బాబు చేనియ్యమంటే నకరాలు చేస్తున్నాడు. వాణ్ణి చంపితే కేసయ్యి నేను ఊరిడచాల.

నిన్ను చెరిచితే సిగ్గుతో మీ అయ్య ఊరిడుస్తాడు. నిన్నూ’... లాక్కు వెళుతున్నాడు. పన్నెండేళ్ల పిల్ల. పులికి చిక్కిన కుందేలులా ఉన్న పిల్ల. కాని కుందేలు పిల్లా తను? చేయి గట్టిగా కొరికింది. ‘స్స్‌’.. నేలకు విసిరి కొట్టాడు. కింద పడింది. ‘బాడ్‌కవ్‌’.... మళ్లీ పట్టుకోవడానికి రాబోయాడు. పాదాలున్నాయి తనకు. రెండు పాదాలు. మట్టి తొక్కిన పాదాలు. చెట్లెక్కిన పాదాలు. చెరువు గెలిచిన పాదాలు. తేళ్లు, జెర్రెలు కనబడితే నిమిషంలో నలిపిన పాదాలు. దగ్గరకు చేర్చింది. ఒక్క తాపు... ‘చచ్చాన్రో’ దొర విరుచుకుపడ్డాడు. ‘పట్టుకోండి... పట్టుకోండి’ అరుస్తున్నాడు. దొరుకుతుందా తను. ఆ మరుసటి రోజంతా ఊళ్లో ఒకటే గోల. ‘మనూరు తాటకి దొర పిచ్చలు పగలగొట్టింది’ అని వాడ ఆడవాళ్లంతా మూతికి కొంగడ్డం పెట్టుకొని ఒకటే నవ్వడం. కథ ముగిసింది.

గోగు శ్యామల రాసిన ‘తాటకి’ కథ ఇది. సామాజిక ఆధిపత్యం, ఆర్థిక ఆధిపత్యం కోసం కూడా మొదటి ప్రతీకారం స్త్రీల మీదే తీర్చుకోవాలని చూస్తుంది మగ వ్యవస్థ. యుద్ధాలలో, అల్లర్లలో అందుకే స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతుంటాయ్‌. మగాణ్ణి అణచడానికి స్త్రీని భయభ్రాంతం చేయడం ఒక మార్గం. సరే.. మనింటి ఆడపిల్లలను ఎలా పెంచుతున్నాం. అమ్మో.. అయ్యో.. అక్కడకు వెళ్లకు, ఇక్కడకు వెళ్లకు అని పెంచుతున్నామా? లేదా రెండు పాదాలు ఉన్న అమ్మాయిగా ఆయువు మీద తన్నే అమ్మాయిగా పెంచుతున్నామా? శక్తి కావాలిప్పుడు.

- గోగు శ్యామల

మరిన్ని వార్తలు