గొల్లభామ సునంద

18 Jun, 2018 00:28 IST|Sakshi
గొల్లభామ సునంద

కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులు.. వెళ్లే దారికి ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటాయి. అయినప్పటికీ  పట్టువీడకుండా ప్రయత్నిస్తే కాలం కార్పెట్‌ పరిచి మరీ గులామ్‌ అయిపోతుంది. అందుకు ఉదాహరణ సునంద సాధించిన విజయం. చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని కుటుంబం కోసం గృహిణిగా ఉండిపోయిన సునందను ఆ కాలమే ‘గొల్లభామ సునంద’గా మార్చేసింది. దాదాపు నలభై ఏళ్ల క్రితమే అంతరించిపోయిన నూరేళ్ల నాటి ‘గొల్లభామ’ చేనేత కళకు మళ్లీ ఊపిరిపోసినందుకు సునందకు ఈ గుర్తింపు, గౌరవం దక్కాయి.  

సునంద.. కర్ణాటకలో స్త్రీ శిశుసంక్షేమ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి. భర్త, ఇద్దరు పిల్లలు. సాఫీగా గడిచిపోతున్నాయి రోజులు. భర్త రవీంద్రకు హైదరాబాద్‌లోని అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. భర్త హైదరాబాద్‌లో, తను కర్ణాటకలో. ‘కుటుంబం కావాలా, ఉద్యోగం కావాలా!’ అనే డోలాయమాన పరిస్థితి. తుదకు కుటుంబమే కావాలని.. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పిల్లలిద్దరినీ తీసుకొని అలా పద్నాలుగేళ్ల కిందట భర్తతో పాటు హైదరాబాద్‌ వచ్చేశారు సునంద.

‘వచ్చేశాక ఏమీ అర్థం కాలేదు. ప్రాంతం వేరు, ఇక్కడి భాష తెలియదు. పిల్లలు స్కూల్‌కి వెళ్లిపోయాక నాకేం చేయాలో తోచేది కాదు. ఏడాది పాటు ఖాళీగానే ఉన్నాను. అప్పటికే టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో చేసిన ఎమ్మెస్సీ చదువు ఉంది నాకు. దీంతో టెక్స్‌టైల్స్‌ వైపు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల కోసం వెతికాను.

ఆ క్రమంలో హ్యామ్‌స్టెక్‌ వంటి ఫ్యాషన్‌ డిజైనర్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో హెచ్‌ఓడీగా చేశాను. 2009లో ఆప్కోలో హ్యాండ్లూమ్‌ డిజైనింగ్‌లో క్యాడ్‌ ట్రెయినింగ్‌ తీసుకున్నాను. ఆ తరువాత ఏడాది మెదక్‌లోని దుబ్బాక క్లస్టర్‌కి డిజైనర్‌ పోస్ట్‌ వచ్చింది. అప్పుడు హ్యాండ్లూమ్‌లో నాకో ప్లాట్‌ ఫామ్‌ దొరికింది..’ అంటూ, తన కెరీర్‌ ప్రస్థానాన్ని వివరించారు సునంద.

ముగిసిన కథ మళ్లీ మొదలైంది!
‘‘దుబ్బాక క్లస్టర్‌ డిజైనర్‌గా ఉన్నప్పుడు సిద్ధిపేట ప్రాంతంలో ‘గొల్లభామ’ చేనేత చీరల గురించి తెలిసింది. వందేళ్ల క్రితం ఓ చేనేతకారుడు  అందమైన పడతి తన తలమీద పాలు, పెరుగు కుండలు పెట్టుకొని అమ్మడం చూసి బొమ్మగా గీసుకున్నారట. ఆ బొమ్మను నేతలో డిజైన్‌గా తీసుకొచ్చారట. అలా వచ్చిన గొల్లభామ చీరలకు అప్పట్లో మంచి డిమాండ్‌ ఉండేది. తర్వాత.. దాదాపు 40 ఏళ్లు.. అంటే ఒక తరానికి తరం గొల్లభామను మర్చిపోయింది.

ఆ డిజైన్‌ని సేకరించి 2015లో సిద్ధిపేటకు వెళ్లి చేనేతకారులను కలిసి ‘గొల్లభామ’ డిజైన్‌ కాటన్‌ ఫ్యాబ్రిక్‌ మీద కావాలని అడిగాను. ‘మేడమ్, ఆ కథ అక్కడితోనే అయిపోయింది. వదిలేయండి. ఒక్క బొమ్మ తేవాలంటే రోజంతా పట్టుద్ది. దీన్నే నమ్ముకుంటే మాకు రోజు గడవదు’ అన్నారు. మా పైఅధికారులను కలిశాను. ‘సార్, ఆ నేతకారుల దగ్గర కళ ఉంది, నైపుణ్యాలు ఉన్నాయి. కావల్సినన్ని వనరులు కల్పిస్తే మూలనపడేసిన ‘గొల్లభామ’ వర్క్‌కు జీవం పోసిన వాళ్లం అవుతాం’ అన్నాను. అందుకు ‘సరే’ అనే అంగీకారం లభించింది.

కొత్త సొబగులతో గొల్లభామ
గొల్లభామ బొమ్మ డిజైన్‌లో కొన్ని మార్పులు చేశాను. సిద్ధిపేట వీవర్స్‌ను మళ్లీ కలిసి ఈ డిజైన్‌ని ఎలాగైనా సరే బట్ట మీద నేసి ఇవ్వాలని చెప్పాను. డిజైన్‌ బాగుందన్నవారే కానీ, ఎవ్వరూ ముందుకు రాలేదు. రోజులు నెలలు అవుతున్నాయి. ఆ టైమ్‌లోనే మోడిఫై చేసిన డిజైన్‌కి జిఐ (జాగ్రఫీ ఇండికేషన్‌) వచ్చింది. అంటే, గొల్లభామ డిజైన్‌ సిద్ధిపేట చేనేతకారులు తప్ప మరెవ్వరూ తయారుచేయడానికి లేదన్నమాట.

ఇది తెలిసిన వెంటనే మళ్లీ వీవర్స్‌ని కలిశాను. మీటింగ్‌ పెట్టాను. ఈ డిజైన్‌ దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా నేయరు. ఇది ఈ ప్రాంతం ప్రత్యేకత. దీనిని బతికించాలి. ఒక్కసారి చేసి చూపించండి’ అని రిక్వెస్ట్‌ చేశాను. చివరకు ఇద్దరు వీవర్స్‌ ముందుకు వచ్చారు. వాళ్లకా డిజైన్‌ ఇచ్చి, ఎప్పుడు పూర్తయితే అప్పుడే చెప్పమని నా పనిలో పడిపోయాను.

మార్కెటింగ్‌ ప్లస్‌లూ మైనస్సులు
హ్యాండ్లూమ్‌కి సంబంధించిన నాలెడ్జ్‌ నాకు ఇంకా అవసరం అనిపించింది. అందుకే హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లలో నానోటెక్నాలజీపై పీహెచ్‌డి చేశాను. హ్యాండ్లూమ్‌ మార్కెటింగ్‌లోని ప్లస్‌ అండ్‌ మైనస్‌లు తెలుసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌గా చేరాను. కొన్ని నెలలు అక్కడే ఉండి మార్కెట్‌లో నైపుణ్యాలు నేర్చుకున్నాను. తర్వాత మళ్లీ సిద్ధిపేట వెళ్లి వీవర్స్‌ని కలిసి ‘మీకు గొల్లభామ రివైవల్‌ డిజైన్‌ ఇచ్చాను కదా ఏమైంది’ అని అడిగాను.

‘మేడమ్, ఈ గొల్లభామ బొమ్మ చాలా పెద్దగా ఉంది. అంత చేయలేం. కొన్ని ఇంచులు తగ్గిస్తే చేసిస్తాం అన్నారు. వాళ్లు చెప్పిన విధంగా డిజైన్‌ని తగ్గించి ఇచ్చాను. అలా మొత్తానికి 2016 నవంబర్‌ 15 న డిజైన్‌ నా చేతికి వచ్చింది. చూసిన ప్రతీ ఒక్కరూ ఈ డిజైన్‌ బ్రహ్మాండంగా వచ్చింది అన్నారు. ఆ ప్రశంసలు నాలో పట్టుదలను మరింత పెంచాయి.

బతుకుకు కొత్త దారి
ట్రెడిషనల్‌ గొల్లభామ నుంచి రివైవ్డ్‌ గొల్లభామ డిజైన్‌ని అంచు మీద, చీరలో అక్కడక్కడా బుటాగా అంతా సెట్‌ చేసుకుని ఒక చీర నేసివ్వాలని కోరాను. ముందు దుపట్టా చేసిచ్చారు. అది సక్సెస్‌ అయ్యింది. ‘వీటి ఉత్పత్తి పెంచాలంటే జాల మగ్గాలు సరిపోవు. జకార్డ్‌ మిషనరీ కావాలి’ అన్నారు. జకార్డ్‌ ఎక్కడ దొరుకుతుంది? మళ్లీ వెతుకులాట. అన్ని చేనేత యూనిట్స్‌ వద్ద సర్వే చేయించాను. మొత్తానికి 120 జకార్డ్‌ని తెచ్చి సెట్‌ చేయించాను. పని మొదలయ్యింది.

14 ఇంచుల గొల్లభామ హ్యాండ్లూమ్‌ మీద వన్నెలు పోయింది. తర్వాత ఒక పెద్ద గొల్లభామ, రెండు చిన్న గొల్లభామలు, దుపట్టా గొల్లభామ, ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్‌.. ఇలా దశలవారీగా తీసుకున్నాం. దుబ్బాకలో పనిచేసినప్పుడు అక్కడ రెండు జకార్డ్‌ మగ్గాలను చూశాను. అక్కడ వాటిని ఎవరూ ఉపయోగించడంలేదు. దీంతో వాటిని అక్కడ నుంచి సిద్ధిపేటకు తీసుకొచ్చాను. కర్ణాటక నుంచి మిషనరీ ఫిట్‌చేసే ఇద్దరిని తీసుకొచ్చి మిషనరీ సెట్‌ చేయించాను.

జకార్డ్‌ మీద ‘గొల్లభామ’ డిజైన్‌ పని వేగం పుంజుకుంది. ‘జకార్డ్‌ వల్ల పని సౌకర్యంగా ఉంది. కాళ్ల నొప్పులు తగ్గాయి’ అన్నారు వీవర్స్‌. ఈ చేనేతకారుల్లో టాలెంట్‌ ఉంది. కానీ, బతుకుదెరువు లేదు. నెలంతా కష్టపడితే 4–5 వేలు సంపాదన. వీళ్లకి మంచి బతుకుదెరువు లభిస్తే నా పనికి సార్థకత అనుకున్నాను. మరో 4 జకార్డ్స్‌ పెట్టించడంతో చేనేతకారులు పెరిగారు.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేయడానికి వచ్చినట్టు చేనేతకారులు పోటీ పడటంతో నాకు చాలా ఆనందమేసింది. కిందటేడాది ఆగష్టు 17న మొదటిసారి ‘గొల్లభామ హ్యాండ్లూమ్‌ ఎగ్జిబిషన్‌’ ద్వారా ఈ కళ మళ్లీ వెలుగులోకి వచ్చింది.  ఇప్పుడా చేనేతకారుల ఒక్కొక్కరి నెలసరి ఆదాయం 10 నుంచి 15వేల పైనే ఉంటుంది.

ప్రోత్సహిస్తే ఫలితాలు
సిద్ధిపేటకు గొల్లభామ ఎలా స్పెషల్‌  అయ్యిందో మిగతా ప్రాంతాలలోని చేనేత పట్ల కూడా అలా శ్రద్ధ వహిస్తే ఆ ప్రాంతాలూ అలా స్పెషల్‌ అవుతాయి. ఒక కార్పోరేట్‌ కంపెనీకి దీటుగా చేనేత ఎదగాలన్నదే నా ఆకాంక్ష’’ అంటున్నారు సునంద. ప్రస్తుతం అగ్రికల్చర్‌ యూనివర్శిటీలో పోస్ట్‌ ప్రాజెక్టర్‌గా వర్క్‌ చేస్తున్న సునంద.. ‘చేసే పని పట్ల నిబద్ధత, పట్టుదల ఉంటే మన చుట్టూ ఉన్నవారి సహకారం తప్పక ఉంటుంద’న్నారు.

మేడమ్‌ మార్పులు చేశారు
మొదట జాల మీద నేసినప్పుడు గొల్లభామ డిజైన్‌ చిన్నగా వచ్చింది. టైమ్‌ కూడా ఎక్కువ పట్టింది, సునంద మేడమ్‌ డిజైన్‌లో మార్పులు చేశారు. ఈ డిజైన్‌ వల్ల పని సులువు అయ్యింది. డిజైన్‌ అందంగా వచ్చింది. ఇప్పుడు 17 ఇంచుల గొల్లభామ డిజైన్‌ని కూడా నేస్తున్నాం. పల్లూ వేరేగా తీయాలి. చిన్న చిన్న బుటా ఒకలా తీసుకోవాలి. ఒక్క చీర నేయాలంటే మూడున్నర రోజులు పడుతుంది. – కైలాస్, చేనేతకారుడు, సిద్ధిపేట

సమంత కూడా వచ్చారు
మేడమ్‌ గొల్లభామ డిజైన్‌ని అందంగా మార్పులు చేశారు. డిజైన్‌ బాగా వచ్చింది. ముందు దుపట్టా చేశాం. తర్వాత చీరలు. సినీ నటి సమంత కూడా మా దగ్గరికి గొల్లభామ డిజైన్‌ చీరల కోసం వచ్చారు. ఫ్యాషన్‌ డిజైనర్లు వచ్చారు. దీంతో గొల్లభామ చీరలకు మంచి ప్రాచుర్యం వచ్చింది. ప్రస్తుతానికి కాటన్‌ ఫ్యాబ్రిక్‌ మీద గొల్లభామ డిజైన్‌ని నేస్తున్నాం. పట్టు మీద నేసే అవకాశం ఉంటే అలాగే నేస్తాం. – సత్యం, చేనేతకారుడు, సిద్ధిపేట


– నిర్మలారెడ్డి
 

మరిన్ని వార్తలు