పిల్లల్లో ఐక్యూ ఎక్కువైతే ఆయుర్దాయమూ ఎక్కువే!

21 Jul, 2017 00:18 IST|Sakshi
పిల్లల్లో ఐక్యూ ఎక్కువైతే ఆయుర్దాయమూ ఎక్కువే!

పరిపరిశోధన

స్మార్ట్‌గా ఎక్కువ ఐక్యూతో ఉండే పిల్లల ఆయుర్దాయం ఎక్కువ అంటున్నారు స్కాట్‌లాండ్‌ సైంటిస్టులు. ఇలాంటి పిల్లలకు గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్లు, శ్వాసకోశసమస్యలు వచ్చే అవకాశాలు బాగా తక్కువట. స్కాట్‌ల్యాండ్‌లో 1936లో పుట్టిన 33,536 మంది పురుషులు, 32,229 మంది మహిళల పై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా నిపుణులు ఈ నిర్ణయానికి వచ్చారు. మంచి ఐక్యూతో ఉన్న ఆ పిల్లలను పదకొండో సంవత్సరం నుంచి మొదలుకొని... వాళ్లకు 79వ ఏడు వచ్చే వరకు సుదీర్ఘకాలం పాటు అంచెలంచెలుగా ఈ అధ్యయనం సాగించారు. అందులో  తేలిన విషయం ఇది.

మిగతావాళ్లతో పోలిస్తే ఐక్యూలో మంచి స్కోర్లు సాధించే పిల్లల్లో – శ్వాసకోశవ్యాధుల వల్ల వచ్చే ముప్పు 28 శాతం తక్కువనీ, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 25 శాతం తక్కువనీ, పక్షవాతం వచ్చే రిస్క్‌ 24 శాతం తక్కువని చెబుతోంది ఈ స్కాటిష్‌ అధ్యయనం. ఈ విషయాలన్నీ ప్రతిష్ఠాత్మకమైన మెడికల్‌ జర్నల్‌ బీఎమ్‌జేలోనూ ప్రచురిత మయ్యాయి. ‘‘అయితే ఇలా జరడానికి కారణాలు ఏమిటన్నది మాత్రం ఇంకా పూర్తిగా తెలియరావడం లేదు. బహుశా ఇలాంటి వారికి ఉండే మంచి విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం, సామాజిక వివక్ష లేకపోవడం లేదా తక్కువగా ఉండటం వంటి అంశాలు వాళ్ల సుదీర్ఘ ఆయుర్దాయానికి  తోడ్పడుతుండ వచ్చు’’ అంటున్నారు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న నిపుణులు.

మరిన్ని వార్తలు