శక్తినిచ్చే ఉపాహారంతో మధుమేహులకు మేలు!

20 Mar, 2018 01:22 IST|Sakshi

ఊబకాయంతో పాటు మధుమేహంతో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఉపాహారం తీసుకోవాలి. ఆ ఉపాహారంలో ఎక్కువ శక్తి ఉండేలా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు. అధిక కేలరీలున్న ఉపాహారం... కొంచెం తక్కువ కేలరీతో మధ్యాహ్న భోజనం, అతితక్కువ కేలరీలతో రాత్రి భోజనం తీసుకుంటుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నామని వారు ఇటీవలే ముగిసిన ఓ అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. చిన్న మోతాదుల్లో ఆరు సార్లు ఆహారం తీసుకోవాలని మధుమేహులకు చెబుతూంటారని.. తాము సూచించే పద్ధతి వల్ల వారు బరువు తగ్గడమే కాకుండా ఇన్సులిన్‌ మోతాదు నియంత్రణలో ఉంటుందని, ఆకలి తగ్గడంతో పాటు తక్కువ ఇన్సులిన్‌తోనే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునేందుకూ ఇది ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డేనియాలే జకోబోవిచ్‌ తెలిపారు.

ఏ సమయంలో ఆహారం తీసుకుంటామన్నదే ముఖ్యం గానీ.. ఎన్ని కేలరీలు అన్నది కాదని చెప్పారు. దాదాపు 70 ఏళ్ల వయసున్న, ఊబకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులపై మూడు నెలలపాటు అధ్యయనం చేశారు. కొంతమందికి సంప్రదాయ పద్ధతుల్లోనూ.. ఇంకొందరికి కొత్త పద్ధతి ద్వారా ఆహారం అందించాక, జరిపిన పరిశీలనలో, కొత్త పద్ధతి ద్వారా మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు