కష్టాలను ఎదిరించి సాగటమే సజ్జనుల నైజం

13 Sep, 2013 23:48 IST|Sakshi
కష్టాలను ఎదిరించి సాగటమే సజ్జనుల నైజం

 ‘‘క్రియాసిద్ధిః సత్త్వే భవతి మహతాం నోపకరణే’’ అని పెద్దల సూక్తి. మానవ జీవితంలో అనేక లక్ష్యాలుంటాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే వాటిని భారతీయ సంస్కృతి పురుషార్థాలుగా చెప్పింది. అంటే ప్రతి మానవుడు జన్మనెత్తిన తరువాత పైవాటిని సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. అసలు ఏదీ సాధించకపోతే జీవితానికి అర్థం ఉండదు. ఏ అర్థాన్నీ చెప్పక సాధారణంగా మిగిలిపోయే శబ్దంలాగ లక్ష్యం లేని జీవితం విలువ లేనిది అవుతుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే మానవులకేగాక, జ్ఞానం కలిగిన జంతువులకూ లక్ష్యం ఉండటం గమనిస్తాం.

రామాయణంలో పరిశీలిస్తే జటాయువుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. అది కేవలం పక్షి మాత్రమే కాక, ఎంతో ధర్మజ్ఞానంతో కూడినది. సీతను రావణుడు అపహరిస్తున్నప్పుడు పక్షి అయినా వీరులకు సైతం సాధ్యం కాని విధంగా పోరాడటం మాత్రమేగాక సీతాపహరణ వార్తను శ్రీరామునికి చెప్పాలని చాలాకాలం ఎదురుచూసింది. చివరకు ఆ వార్తను రామునికి అందించి తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంది. అందుకే అది శాశ్వతమైన కీర్తిని పొందింది. ఒక సామాన్యమైన పక్షే తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటే దానితో సమానంగా మానవులు కూడా లక్ష్యాన్ని నెరవేర్చుకోకపోతే తక్కువ అవుతారు.
 
 లక్ష్యం సాధించాలని ఉండాలేకాని, సాధనాలు అన్నీ లేకపోయినా లక్ష్యాన్ని సాధిస్తారు. కష్టాలను ఎదిరించి సాగటమే సజ్జనుల నైజం. రాముడి విషయం చూస్తే, ఎక్కడో సముద్రం అవతల లంక ఉంది. మధ్యలో అగాథమైన సముద్రాన్ని దాటాలి. పోనీ శత్రువు ఏమైనా సామాన్యుడా అంటే, కాదు. పులస్త్యబ్రహ్మ వంశంలో పుట్టిన రావణుడు. పోనీ గొప్పవాళ్ల అండదండలేమైనా ఉన్నాయా అంటే, అదీ లేదు. కేవలం సానుభూతితో చుట్టూ చేరిన కోతులే సహాయకులు. రావణునికి ఉన్నంత గా రథాలు, ఏనుగులు, గుర్రాలు, బంట్లు లేరు. ప్రతిపక్షంలో ఇంద్రజిత్తు ఉన్నాడు. అతడు మహా మాయావి. అలాంటి మాయలు తెలిసినవారు ఎవరూ రాముని వద్ద లేరు. అయినా రాముడు జయించాడంటే దానికి కారణం ఆయనకు గల ధైర్యం, విశ్వాసం, ధర్మదీక్ష.

 ఇలాగే పరిశీలిస్తే సూర్యుడు కూడా మంచి ఉదాహరణ అవుతాడు. అతని రథానికి ఒకటే చక్రం, పాములతో రథానికి కట్టబడ్డ ఏడుగుర్రాలు. శూన్యమైన ఆకాశమే మార్గం. పైగా సారథి అయిన అనూరునికి కాళ్లు లేవు. అయినా అనంతమైన ఆకాశం చివరి భాగం వరకు ప్రతిరోజూ ప్రయాణిస్తున్నాడు. అదే కార్యదీక్ష, దృఢసంకల్పం, అచంచలమైన ఆత్మవిశ్వాసం. ఈ గుణాలనే భారతీయ సంస్కృతి నేర్పింది.
 
 - డా. నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రి
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా