ఏలక్కాయలో ఏముంది?

5 Jul, 2017 00:49 IST|Sakshi
ఏలక్కాయలో ఏముంది?

గుడ్‌ ఫుడ్‌

ఏలక్కాయలో పోషకాలు ఏముంటాయి? మంచి వాసన తప్ప... అనుకుంటాం. వంటల్లో సువాసనకోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఇదొక ఔషధం. ఏలక్కాయ కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. మంట అనిపించినప్పుడు వేడి నీటిలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే ఉపశమనం ఉంటుంది. కడుపులో ఒడుదొడుకులు కూడా అదుపులోకి వస్తాయి.   ఏలక్కాయ అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది.
   
తల తిరుగుతున్నప్పుడు ఏలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది. కొందరికి ప్రయాణాల్లో తల తిరుగుతుంటుంది. అటువంటి వాళ్లు ఏలక్కాయ దగ్గర పెట్టుకోవడం మంచిది. ప్రయాణం మొదలు పెట్టినప్పుడే ఒక ఏలక్కాయ నోట్లో వేసుకుంటే తల తిరిగే సమస్య రానే రాదు. దాహం కూడా అనిపించదు.  రోజుకు ఒక ఏలక్కాయ తింటే, జీర్ణశక్తిని మెరుగుపరిచి అపానవాయువు సమస్యను తొలగిస్తుంది. యూరినరీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారు రోజూ ఉదయం, సాయంత్రం ఏలకుల పొడిని నీటిలో కలుపుకొని తాగాలి. అలా వారం రోజులు చేస్తే ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా తగ్గుతుంది.    రెండు ఏలకులు, చక్కెర కలుపుకొని తింటే కడుపునొప్పి తగ్గుతుంది.

మరిన్ని వార్తలు