మంచి నిద్రతో ఆరోగ్యం.. కారణం తెలిసింది!

27 Feb, 2019 01:05 IST|Sakshi

కంటి నిండా నిద్రపోవడం ఆరోగ్యానికి మేలన్నది చాలాకాలంగా తెలిసిన విషయమే. కారణమేమిటన్నది మాత్రం తెలియదు. ఈ లోటును భర్తీ చేశారు మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల ద్వారా, నిద్రలేమికి – ఎముక మజ్జలో తెల్లరక్తకణాల ఉత్పత్తికి మధ్య సంబంధం ఉందని గుర్తించామని ఫిలిప్‌ స్విర్‌స్కీ అనే శాస్త్రవేత్త తెలిపారు. తెల్ల రక్తకణాలు శరీరంలో మంట/వాపులకు కారణమవుతున్నట్లు తెలిసిందని చెప్పారు. అంతేకాకుండా మనం మెలకువగా ఉండేందుకు ఉపయోగపడే మెదడులోని ఒక రసాయనం కూడా తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. నిద్రలేమికి – రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెజబ్బులు వచ్చేందుకు మధ్య సంబంధాలను తెలుసుకునేందుకు తాము ఎలుకలపై ప్రయోగాలు చేశామని చెప్పారు.

తరచూ నిద్రాభంగానికి గురయ్యే ఎలుకల రక్తనాళాలల్లో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతున్నట్లు, బరువు, కొలెస్ట్రాల్, రక్తంలో గ్లూకోజ్‌ మోతాదులతో సంబంధం లేకుండా ఇది జరుగుతున్నట్లు స్పష్టమైందని ఫిలిప్‌ వివరించారు. దీంతోపాటు నిద్ర తక్కువైన ఎలుకల్లో తెల్ల రక్తకణాల ఉత్పత్తికి కారణమవుతున్న మూలకణాలు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయని, మెదడులోని హైపోక్రెటిన్‌ రసాయనం కూడా తక్కువైనట్లు తెలిసిందని చెప్పారు. గుండెజబ్బుల నివారణకు మరింత సమర్థమైన చికిత్స అందించేందుకు ఈ ప్రయోగం తోడ్పడుతుందని అంచనా. 

మరిన్ని వార్తలు