మంచి మాట వింటే మంచి సమాజం వస్తుంది

18 Apr, 2018 00:51 IST|Sakshi
దేవిరెడ్డి పద్మావతి

‘మాతృదేవోభవ అని తల్లిని పూజించిన భారతదేశంలో ఆడపిల్ల నేడు ఎందుకు ఆక్రోశిస్తోంది? యత్రనార్యస్తు  పూజ్యంతే రమంతే తత్ర దేవతాః... అని నమ్మిన నేల మీద ఆడపిల్లలకు రక్షణ కరువవుతోంది ఎందుకు?  సమాజం ఎక్కడో బ్యాలెన్స్‌ తప్పుతోంది. యువత ప్రాధాన్యాలు మారిపోతున్నాయి. తల్లిదండ్రుల దారిలో డబ్బునే చూస్తున్నారు పిల్లలు. డాలర్ల రేసులో పడి మోరల్స్‌ మర్చిపోతున్నారు. సిలబస్‌లో మోరల్‌ ఎడ్యుకేషన్‌ కోసం పేజీలు ఉండటం లేదు. మనిషికి దైవభక్తి ఉన్నా, పాపభీతి ఉన్నా నాడు నిర్భయ ఘటన నిన్న ఆసిఫా ఘాతుకమూ జరిగేది కాదు. పాప మార్గాన్ని నిరోధించే దైవభక్తిపగలు– ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు, మమత–సమత పెంచడానికే’  అంటారు దేవిరెడ్డి పద్మావతి.సమాజంలో నైతిక విలువలను నిలబెట్టడం ఒక తక్షణ అవసరం అని నమ్ముతున్నారు ఆమె. అందుకు అన్నమయ్యను ఒక సాధనంగా చేసుకున్నారు. ‘ఈ సమాజాన్ని తిరిగి సంస్కారవంతం చేయడం కష్టం కాదు. ప్రయత్నించాలి అంతే’ అని విశ్వాసం వ్యక్తం చేస్తారామె. తిరుపతిలో ఆమె చేస్తున్న ప్రయత్నమే ఈ కథనం.

అన్నమయ్య దారిలో...
‘పొరుగువాడిని ప్రేమించలేని జీవితం జీవితమే కాదు. ఆకలి బాధ పేదవాడికైనా సంపన్నుడికైనా ఒకటే. సమాజంలో పాతుకుపోతున్న పేద–ధనిక, కులమతాల అడ్డుగోడల్ని కూలగొట్టాలి. అన్నమయ్య చెప్పిన సమ సమాజాన్ని స్థాపించాలి. అందుకే నేను కోరుకుంటున్న సమాజ నిర్మాణానికి అన్నమయ్య సంకీర్తనలతోనే దారులు వేస్తున్నాను’ అంటారు దేవిరెడ్డి పద్మావతి. ‘లైవ్‌ తిరుపతి డాట్‌కామ్‌’ పేరుతో ఆధ్యాత్మిక వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నారామె. రోజుకో మంచిమాట చెబుతూ, రోజుకో అన్నమాచార్య కీర్తనను పరిచయం చేస్తుంటారు. భగవద్గీత శ్లోకాలను సామాన్యులకు అర్థమయ్యే తేలిక పదాలతో వివరిస్తారు. 

జనం బాటలోనే మంచిమాట
‘జనం మనదారిలోకి రావాలని కోరుకోకూడదు, మనమే జనం దారిలో వెళ్లి చెప్పదలుచుకున్న మంచి మాట చెప్పాలి. వాళ్ల చెవికెక్కేటట్లు చెప్పాలంటే వాళ్లను నచ్చిన మాధ్యమంలోనే వాళ్లను చేరాలి. చదువులేని రోజుల్లో జనానికి మంచి చెడులను హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, తోలుబొమ్మలాటలతో చెప్పేవాళ్లు. అప్పుడవే ప్రసారమాధ్యమాలు. ఇప్పుడు నూటికి అరవై మంది చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటోంది. క్లాస్‌ బుక్కులను కూడా ఫేస్‌బుక్కులోనే చదవాలన్నంతగా విస్తరించింది సోషల్‌ మీడియా. డ్రాయింగ్‌ రూమ్‌లో ఉన్న భర్త ‘టీ ఇస్తావా’ అని భార్యను వాట్సాప్‌లో అడగాల్సిన స్థితి. సమాజంలో సమన్వయం తప్పుతోన్న మానవసంబంధాలను క్రమబద్ధం చేయడానికి కూడా వాట్సాప్, ఫేస్‌బుక్‌లే మంచి మార్గాలనుకున్నాను’ అంటారు పద్మావతి. 

జరిగే పనేనా!
‘మంచిచెడుల గురించి చెప్పేవాళ్లు చెబుతుంటారు, వినాలనుకున్నవాళ్లు వింటుంటారు. వినగానే మనిషిలో గూడుకట్టుకుని ఉండే కరడుగట్టిన కర్కశత్వం సమూలంగా తుడిచిపెట్టుకుపోవడం జరిగేపనేనా? జరగవచ్చు, జరగకపోవచ్చు. రెండింటికీ చాన్సెస్‌ ఫిఫ్టీ ఫిఫ్టీ. అయితే నా నమ్మకం ఒక్కటే... మనిషిలో స్వతహాగా మానవత్వం ఉంటుంది. దానిని జాగృతం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సత్వరజతమోగుణాలను అదుపు చేసుకోలేకపోయినప్పుడు అవి మానవత్వం మీద దాడి చేస్తాయి. వాటిని అదుపు చేసుకోవాలనే క్రమశిక్షణ ఎవరో ఒకరు నేర్పాలి. పిల్లలకు స్కూలుకి టైమ్‌కి వెళ్లడం, హోమ్‌వర్క్‌ చేయడం, పెద్దలను గౌరవించడం నేర్పించినట్లే ఇది కూడా. ట్రాఫిక్‌రూల్స్‌ని పాటించడం నేర్పించినట్లే, సివిక్‌సెన్స్‌ నేర్పించినట్లే ధార్మిక క్రమశిక్షణను కూడా నేర్పించాలి. ట్రాఫిక్‌ రూల్‌ పాటించకపోతే ఫైన్‌ కట్టాల్సి వస్తుందని బుద్ధి మనిషిని హెచ్చరిస్తుంది. అలాగే తాత్కాలిక వ్యామోహంలోనో, క్షణికావేశంలోనో నేరాలకు పాల్పడేటప్పుడు కూడా ఇది పాపం, దేవుడు ఒప్పుకోడు అనే భక్తి గుర్తొస్తుంది. భక్తిగా కాకపోయినా దేవుడు ఏదో ఒక రూపంలో శిక్షిస్తాడు అనే భయం అయినా గుర్తొస్తుంది. విన్నది, కన్నది మెదడులో నిక్షిప్తమవుతుంది. అవసరం వచ్చినప్పుడు విచక్షణ దానిని వెలికి తీస్తుంది. అందుకే మంచిమాటటను పలుమార్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను’ అంటారు పద్మావతి. ఆ సేవ కోసమే తన జీవితం అంటోందామె.

దేవుడు కోరిన సమాజం కోసం
నేను వేంకటేశ్వరస్వామి భక్తురాలిని. ఆ స్వామి తాను చెప్పదలుచుకున్న మంచిమాటలను అన్నమయ్య చేత చెప్పించుకున్నాడని నమ్ముతాను. ఆ స్వామి కోరుకున్న సమాజం అన్నమయ్య పదాల్లో కనిపిస్తుంది. అలాంటి సమాజం తిరిగి రావాలన్నదే నా కోరిక. నేను అన్నమయ్యలాగా సంకీర్తనలు రాయలేను.  ఆ సంకీర్తనాచార్యుడు చెప్పిన మంచిని మంది దగ్గరకు చేర్చడమే నా పని. ఈ పనిని చక్కగా చేస్తే దైవభక్తి, పాపభీతి నిండిన ధార్మిక సమాజం రూపొందుతుంది. అప్పుడు నేరాలు వాటంతట అవే తగ్గిపోతాయి. 
– దేవిరెడ్డి పద్మావతి,
సి.ఇ.ఓ, లైవ్‌ తిరుపతి వెబ్‌సైట్‌ 
– వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు