నా ప్రతి చరణం ఒక ఆత్మ విమర్శ

16 Mar, 2020 00:33 IST|Sakshi
గోరటి వెంకన్న రేపు ప్రతిష్టాత్మకమైన కబీర్‌ సమ్మాన్‌ అందుకుంటున్న సందర్భంగా...

మట్టిపొరలను సుతిమెత్తగా తొలగించుకుంటూ వచ్చే లేతమొక్కలా గోరటి వెంకన్న పాట మొలకెత్తుతుంది. పల్లె పొత్తిళ్ళ నుంచి ఎగిరొచ్చిన పసితనం అద్దుకున్న పాట రాజ్యధిక్కారాన్ని నింపుకుని నల్లతుమ్మముల్లులా గుచ్చుకుంటుంది. గోరటి పాట ప్రకృతిలోని నిసర్గ సౌందర్యాన్ని దోసిట్లో పోసుకొని తాగుతున్నట్లుగా ఉంటుంది. ఒక జీవితానికి సరిపడినంత తాత్త్విక దాహం తీర్చుకున్నట్లుగా దేహం విశ్వాంతరాల్లోకి తేలిపోతుంది. ఎవరూ పట్టుకోని హీనప్రతీకలను, ఎవరూ ముట్టుకోని కవిసమయాలను అందుకున్న సహజకవి. ప్రబంధ కవితా పాదాల వరుసలో సాగుతూ, ప్రజా వ్యథల్ని వినిపిస్తున్న వాగ్గేయకారుడు. ‘వాగు ఎండిపాయెరో పెదవాగు తడి పేగు ఎండిపాయెరా!’ అని వెంకన్న వేదనా చెందాడేమోగాని ఏనాటికీ ఎండిపోని పాటల వాగును తెలుగుజాతికి అందించిన గోరటి వెంకన్నతో ప్రత్యేక సంభాషణ.

మీ పాట ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయగలిగారా? ఆ సంకేతం మీకు అందిందా?
అది ప్రజలు చెప్పాలి. నేనైతే ప్రభావితం చేశానని అనుకోవటం లేదు. పాట ఎప్పుడూ ఒక అసంపూర్తి వాక్యమే. ఉద్యమ చైతన్యం, ఆ బలమైన నేపథ్యమే సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. పాట అందుకు ఒక ప్రధాన సాధనంగా ఉపయోగపడుతుంది. నాకు నేను బయటపడటానికి, నా బాధల బరువును దించుకోవటానికి పాడుకున్న. పల్లెతో నాది గాఢానుబంధం. పల్లెల దుస్థితిని చూశాక, సంక్షోభ స్థితిని అనుభవించాక పల్లె కన్నీరు పెడుతుందని గీతం రాశాక గాని కొంత ఉపశమనం కలగలేదు. నాది ప్రిమిటివ్‌ స్వభావం. నాలోని వెలితిని, బాధను, వేదనను దూరం చేసుకోవడానికి పాటను ఆశ్రయించా. ఇంత వేగవంతమైన ప్రపంచంలో నా పాట ఏమేరకు ప్రభావితం చేసిందో సమాజమే చెప్పాలి.

మీ రచనా ప్రయాణంలో మిమ్ముల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకున్న సందర్భాలున్నాయా?
పాట రాస్తున్నప్పుడు ప్రతి చరణం నాలో ఆత్మవిమర్శను ప్రేరేపిస్తుంది. నాలో కాంట్రడిక్షన్‌ ఎక్కువ. ఆత్మసంఘర్షణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. నేను రాసిందంతా వాస్తవమా, కాదా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ‘పాపాలు, శాపాలు లోకమందు ఉంటాయి. కోపాలు, తాపాలు సహజంగా వస్తాయి.’ ఉద్యమ స్ఫూర్తి ఉ«ధృతంగా ఊపేస్తూ ఉంటుంది. అట్లా అని హింసకు వ్యతిరేకం. ప్రతిక్షణం తెలియని ఆత్మసంవేదనకు, అసంతృప్తికి గురవుతూ ఉంటాను. సంచారమే నన్ను నేను సరిదిద్దుకునేటట్లుగా చేస్తుంది. 

మీ పై యక్షగానాలు, పద్యనాటకాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది? దానికి కారణం ఏమిటి?
మా నాన్న మంచి యక్షగాన కళాకారుడు. ఊహ తెలిసిన నాటినుంచే యక్షగానం నా ఎదలో ప్రతిధ్వనించింది. చిన్నప్పటి నాటకాలు బలమైన ముద్రలు వేశాయి. యక్షగానాల్లోని రాగఛాయలు, తాళగతులు, సంగతులు నా పాటకు శిక్షణనిచ్చాయి. నా పాటల్లో యక్షగానాల్లోని నడక కనిపిస్తుంది. నేను పనిగట్టుకొని అల్లిక చేయనవసరం లేదు. చిన్నప్పటి జ్ఞాన ప్రభావంతో అలవోకగా రాగం మొలకెత్తుతుంది. నా పాటలోని పిట్ట, చెట్టు, వేకువ, వెన్నెల, తత్వాలన్నింటికి మూలం నేను విన్న పద్యాలు, గేయాల్లోంచే ఉబికివచ్చాయి. సత్యహరిశ్చంద్ర నాటకం కంటే వందేళ్ళ ముందేవచ్చిన కందాల రాఘవాచార్యులు, రామాచార్యుల పద్యధార, సంస్కృత పదజాలం నన్ను ప్రభావితం చేసింది. నేను రాసిన తెలంగాణ బ్రీత్‌లెస్‌ సాంగ్‌మీద ‘అడిగెదనని కడువడి జను...’ లాంటి పోతన పద్యాల ప్రభావం ఉంది.

ఈ మధ్య మీరు అలంకార శాస్త్ర అధ్యాపకుడిగా, వర్ధమాన సాహిత్య విమర్శకుడిగా కనబడుతున్నారు. ఈ మార్పుకు కారణాలేంటి?
నాకు చిన్నప్పటినుంచి చదవడం అలవాటు. అది ఒక వ్యసనం. ఒక ఆరాధన. నాకు పాట ఎంత ఇష్టమో, విమర్శ అంతే ఇష్టం. ఎం.ఏ. తెలుగు చదివాను. దొరికిన ఏ పుస్తకాన్ని వదల్లేదు. చిన్నప్పుడు క్లాసిక్స్‌ దొరకని ప్రదేశంలో ఉన్నాను. ఇప్పుడు అర్థం కాకపోయినా అలంకారశాస్త్రం లాంటి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను. ఎప్పుటికైనా అర్థంకాకపోదా? అనే నమ్మకం. నా అభిప్రాయాలు, పరిశీలనలు పంచుకునే సందర్భంలో అనుభవంలోంచి వచ్చిన విశ్లేషణల వల్ల నాలో విమర్శకుడు కనిపించవచ్చు మీకు. 

‘జీవనసారం నిలుపుకున్న పామరులే నిజ సిద్ధుల’న్న మీరు వారి గాఢతత్త్వాన్ని ఎలా అందుకోగలిగారు?
నా బాల్యం, మా ఊరు, ఆ మట్టిదారులు, అక్కడి పల్లెజనులు, పెద్దలు... నా బలమంతా అక్కడే ఉంది. మా ఊరి మాదిగ నారాయణదాసులాంటి వారి ప్రభావం నా మీద ఉంది. అతనిలాగా నేను ఉండాలని ప్రయత్నించానా అనే అనుమానం వస్తుంది. ఆ అనుభవాలు సామాన్యమైనవేం కాదు. ప్రతిపాటను మా ఊరి పామరులే రాయించారు. పామరులే నా హీరోలు. పామరత్వంలోనే పరమతత్వం ఉంది. పామరులు ఏ సమస్యనైనా సంక్లిష్టం చేసుకోరు. వారి సహజ సంభాషణలో లోతైన లోకతత్వం నెలకొని ఉంటుంది. పామరత్వంలో వున్న శోభ, అలంకారాల్ని నిత్యం నేను ఆస్వాదించాను. అదే నా పాటలో ప్రతిఫలించింది. రచయితలు కేశవరెడ్డి, బండి నారాయణస్వామిలో పామరత్వం, కవి దేవులపల్లి కృష్ణశాస్త్రిలో సౌందర్యం నేను దర్శించాను. అవే నా పాటలో పామరతత్వంగా ప్రతిఫలించాయి.

తెలంగాణ ఉద్యమం కంటే ముందునుంచే మీరు అనేక సామాజిక రాజకీయ సమస్యల మీద రాశారు. ఇప్పుడెందుకు రాయడం లేదు?
తెలంగాణ వచ్చాక కూడా రాస్తున్నాను. కాకపోతే వస్తువులు మారాయి. పొద్దునే లేచి కనబడిన సమస్యల మీద రన్నింగ్‌ కామెంట్రీ రాయాలన్న కండీషన్‌ కవికి లేదు. అలా రాయాలనే ఆసక్తి, అభినివేశం నాకు లేదు. ఉద్యమం చేయనప్పుడు రాయడం ఎందుకు? రాయడం ఐదు నిముషాల పని. ‘నా పల్లె కన్నీరు పెడుతుంది, సంత, అడవి’ పాటలు కొన్ని యేండ్ల తరబడి నలిగిపోయి వచ్చిన పాటలు. అయినా ఇటీవల యురేనియం సమస్య మీద నేనే మొదట రాశాను. ఈ మధ్య ట్రంప్‌ వచ్చినప్పుడు ‘రక్తపింజర చూపు ఎట్లుందో ట్రంప్‌ చూపు అట్లుంది’ అని రాశా. తెలంగాణ వచ్చాక వెలువడిన ‘వల్లంకితాళం’లోనూ కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ ప్రకృతి, సమాజం, ఉద్యమమే నా గేయాలకు మాతృక. బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వస్తాయేమో.

దేశమంతటా అనేక చర్చలు, వాదనలు అలుముకుంటున్న వేళ ప్రత్యేకంగా ఏమన్నా రాయదలుచుకుంటున్నారా?
చెడుకాలం కమ్ముకుంటున్నప్పుడు భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. క్రూరత్వం అలుముకున్న వేళ ప్రకృతే ఆ పరిణామం తీసుకొస్తుంది. కులాలు, మతాలు, దేవుడు వ్యక్తిగతం నుంచి రాజకీయంగా మారాయి. ఈ గోడు ఎల్లకాలం ఉండదు. ‘దుష్టరిగే బంధ సంపత్తు, సజ్జనరిగే బంధ విపత్తు, యశ్టో కాల ఇరలారదు’ (దుష్టులకొచ్చిన సంపద, సజ్జనులకొచ్చిన ఆపద ఎల్లకాలం వుండవు). కవి గూడా సరైన అదును కోసం ఎదురు చూస్తుంటాడు. 

పాటకు, వచన కవితా ప్రక్రియల మధ్య వ్యత్యాసాలున్నాయా? మిమ్ముల్ని ప్రభావితం చేసిన వచన కవులు ఉన్నారా?
పాటకు, వచన కవితకు కొన్ని వ్యత్యాసాలున్నా రెండూ ఒకటే. భావనా పటిమ, రసనిష్ఠ, అభివ్యక్తి వైవిధ్యం ఉంటేనే ఏదైనా కవిత్వమౌతుంది. కబీర్, గాలిబ్, గుల్జార్, జావేద్‌ అలాంటివారు. వచన కవితలో సంక్లిష్ట ప్రతీకలు, కఠినమైన పదప్రయోగాలు చేయొచ్చు. పాటకు అది కుదరదు. కాని పాట ప్రజల్లోకి సులువుగా వెళుతుంది. ఈ సందర్భంలో పాటను ప్రజాపరం చేసిన గద్దర్‌ స్ఫూర్తిని విస్మరించలేం. పాట నడక నాకిష్టం. పాట నా స్వభావం. శివసాగర్, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, నండూరి, పుట్టపర్తి, సినారె గేయాల ప్రభావం నా పాటల్లో వినిపిస్తుంది. వచన కవుల్లో అజంతాను చాలా ఇష్టపడతాను. ఆలూరి బైరాగి, తిలక్‌ను మర్చిపోలేను. అస్తిత్వ ఉద్యమాల్లో పైడి తెరేష్‌బాబు, మద్దూరి నగేష్‌బాబు, త్రిపురనేని శ్రీనివాస్, అయిల సైదాచారి ఇంకా చాలా మంది మంచి కవులున్నారు. ఇప్పుడు రాస్తున్న కవులందరిది ఎవరి ప్రత్యేకత వారిదే. వారందరిని ఇష్టపడతాను. సీనియర్‌ కవుల్లో ఎన్‌.గోపి, శివారెడ్డి కవిత్వాన్ని అభిమానిస్తాను. 

గోరటి వెంకన్నలో ఆనాటి ధిక్కారస్వరం మూగబోయిందా? ప్రభుత్వం నుండి పదవులు, అవార్డులు ఆశిస్తున్నాడా?
ఇంతకు ముందే చెప్పినట్లు నేనేం మూగపోలేదు. మూగబోయే అదృష్టం, ప్రాప్తం నాకెక్కడిది. ఇది మౌనం మాత్రమే. నా అలజడిలో ప్రశాంతత, ప్రశాంతతలో అలజడి. నా మౌనంలో ఒక అంతర్మథనం, ఒక చలనం, జ్వలనం దాగి వున్నాయి. అవార్డులు కోరుకుంటే వస్తాయా? ఆశిస్తే వస్తాయా? గుర్తించి ఇచ్చిన సాహితీ మూర్తుల గొప్పతనం అది.

సంభాషణ: డాక్టర్‌ ఎస్‌.రఘు

మరిన్ని వార్తలు