ఇషాజీ... ఈసారైనా...

21 Aug, 2015 23:47 IST|Sakshi
ఇషాజీ... ఈసారైనా...

గాసిప్
 
బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ తరహా సినిమాలకు తగిన ఆదరణ ప్రేక్షకుల నుంచి వస్తుండడంతో వాటి ఊపు కొనసాగుతోంది. అలాంటి ఓ బయోపిక్‌లో నటించాలని ఇషా కొప్పీకర్ కొంతకాలంగా తహతహలాడుతోంది. అయితే ఇప్పటివరకు ఆమె ఖాతాలో పెద్దగా హిట్ సినిమాలు ఏవీ లేవు. ఎలాగైనా సరే, ఒక పెద్ద హిట్ కొట్టాలని  ఆమె  ఎదురు చూస్తోంది.

‘‘వెండి తెరపై కిరణ్ బేడీగా నటించాలని ఉంది’’ అని ఇషా ఎన్నోసార్లు చెప్పింది. ఆమె మాటను పెద్దగా ఎవరూ సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు. స్పందన కూడా పెద్దగా లేదు. దీంతో మాట మార్చి- ‘‘ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనేది నా బలమైన కోరిక’’ అంటోంది. ఇప్పటికీ స్పందన రాకపోతే -‘‘మాయావతిగా నటించాలనేది నా చిరకాల కోరిక’’ అంటుందని ఇషాపై జోక్‌లు మొదలయ్యాయి. సరే ఈ జోక్‌లకేంగానీ, సన్నిహితులెవరో ఇషాకు గొప్ప సలహా ఇచ్చారట-

 ‘‘మధ్య తరగతి కుటుంబం  నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన స్మృతి  ఇరానీ జీవితకథపై సినిమా తీస్తే ఖచ్చితంగా బంపర్ హిట్ కొడతావు’’ అని!ఇది ఎంత వరకు నిజమో తెలియదుగానీ రేపో మాపో ఇషా నోటి నుంచి ఈ మాట కచ్చితంగా రావచ్చు... ‘‘స్మృతి జీవితం నన్నెంతో ఇన్‌స్పైర్ చేసింది. ఏదో ఒకరోజు...వెండితెరపై స్మృతి పాత్రలో ఖచ్చితంగా నటిస్తాను’’ అని అయ్యా... దర్శక, నిర్మాతల్లారా... ఇప్పటికైనా ఒక చెవి వేస్తారా!
 
 

మరిన్ని వార్తలు