కాల ‘మహిమ’!

11 Oct, 2015 00:56 IST|Sakshi
కాల ‘మహిమ’!

గాసిప్

‘పర్‌దేశ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది మహిమా చౌధురి. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయింది. అందులో ‘గంగ’ పాత్రలో మెప్పించిన మహిమ ‘బెస్ట్ డెబ్యూ అవార్డ్’ అందుకుంది. అయినప్పటికీ ఆమె కెరీర్ పెద్దగా ఊపు అందుకోలేదు. ‘మనసులో మాట’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన మహిమ... ఆ తరువాత గ్లామర్‌కు మాత్రమే పరిమితమై పోకుండా నట ప్రాధాన్యం ఉన్న పాత్రలను ధరించింది. ‘ధడ్కన్’ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకుంది. మహిమా చౌధురిలో మంచి నటి ఉంది. ఆయితే ఆమెకు కాలం కలిసి రాలేదు. ఆ కాలమేదో ఇప్పుడు ఆమెకు నిజ జీవిత కథాంశాల చిత్రాల అవకాశంతో కలిసి వస్తున్నట్లే ఉంది.

నిజ జీవిత ఘటనలు వెండితెరకు ఎక్కడం, ప్రేక్షకాదరణ  పొందడం మనకు కొత్తేమీ కాదు. ‘తల్వార్’ సినిమా దీనికి ఉదాహరణ. ఈ సినిమాకు దేశవిదేశాల్లో ప్రశంసలు లభిస్తున్నాయి. అలాగే ఈమధ్య కాలంలో షీనా బోరా ఉదంతం సంచలనం కలిగించింది. వెండి తెర కథ కంటే ఎక్కువ మలుపులు, సంచలనాలు, ఆశ్చర్యాలు ఆ నిజజీవిత కథలో ఉన్నాయి.  ఈ అవకాశాన్ని సినిమా వాళ్లు ఎందుకు జార విడుచుకుంటారు? షీనా బోరాపై  తాజాగా ‘డార్క్ చాక్లెట్’ అనే బెంగాలీ సినిమా రూపొందుతోంది.  ఇందులో మహిమ కీలక పాత్ర పోషిస్తోంది. ‘‘నాకు బెంగాలీ వచ్చు. నేను పెళ్లి చేసుకుంది కూడా బెంగాలీ అబ్బాయినే కాబట్టి ఈ సినిమాలో నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు’’ అంటోంది మహిమ.

ఈ సినిమా పుణ్యమా అని మహిమా చౌధురి పేరు మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది.  ‘బ్లాక్ చాక్లెట్’ సినిమా హిందీలోకి రిమేక్ అయినా, డబ్ అయినా....మహిమా చౌధురికి అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం అని, సెకండ్ ఇన్నింగ్స్ ఊపందుకోనుందని అంటున్నారు సినీ పండితులు.
 

 

మరిన్ని వార్తలు