చకచకా రెవెన్యూ ముసాయిదా చట్టం

24 May, 2019 02:40 IST|Sakshi

త్వరలో జరిగే కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం

టైటిల్‌ గ్యారంటీ అమలుకు ప్రభుత్వం మొగ్గు

రాజీవ్‌శర్మ నేతృత్వంలో చట్టానికి తుదిరూపు

రెవెన్యూ శాఖ ప్రక్షాళనపైనా కసరత్తు  

సాక్షి, హైదరాబాద్‌: కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో ప్రభుత్వం చకచకా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సలహాదారు, మాజీ సీఎస్‌ రాజీవ్‌శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందిస్తోన్న నూతన చట్టానికి ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసే దిశగా అడుగులు పడుతున్నా యి. కేవలం కొత్త చట్టానికి పరిమితంకాకుండా రెవెన్యూ శాఖనూ సంస్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలో రెవెన్యూశాఖను రద్దు చేయ డమా? లేక ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేయడమా? అనే అంశంపైనా ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వేర్వేరు చట్టాలను ఒక్కగొడుగు కిందకు తీసుకురావాలనే ఆలోచనతో ముసాయిదా చట్టాన్నిరూపొందిస్తోంది. భూ వివాదాలకు తావు లేకుండా, రెవెన్యూ వ్యవస్థను అవినీతిరహితంగా మలిచేలా కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా చట్టం రూపకల్పన చేస్తామని అధికారులు చెబుతున్నారు.

టైటిల్‌ గ్యారంటీకే మొగ్గు..
కొత్త రెవెన్యూ చట్టంపై లోతుగా అధ్యయనం చేస్తున్న సర్కారు.. టైటిల్‌ గ్యారంటీ చట్టంతోనే భూవివాదాలకు అంతిమ పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలు, రాష్ట్రాల్లో అమలు చేస్తున్న చట్టాలను మదింపు చేస్తున్న కమిటీ.. టైటిల్‌ గ్యారంటీయే కాకుండా ప్రత్యామ్నాయాలనూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్‌ గ్యారంటీ చట్టం తేవడం సులువే అయినా.. ఆచరణలోకి వచ్చేసరికి సవాలక్ష సమస్యలున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. రికార్డుల ఉన్నతీకరణ, భూ సరిహద్దులపై స్పష్టత లేకపోతే టైటిల్‌ గ్యారంటీ సాధ్యపడదని స్పష్టం చేస్తున్నాయి. దీంతో సమగ్ర భూసర్వే అనంతరమే టైటిల్‌ గ్యారంటీ అమలు చేసే వీలుంది. ఇదిలావుండగా త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో టైటిల్‌ గ్యారంటీకి ఆమోద ముద్ర వేసి.. దశలవారీగా అమలు చేయనున్నట్లు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు చెప్పాయి.  

అంశాలపై జాగ్రత్త..
కొత్త చట్టంలో ఏయే అంశాలను పొందుపరుస్తున్నారు? ఇతర శాఖల్లో ఉద్యోగుల విలీనం? రెవెన్యూ వ్యవస్థలో చేపట్టే సంస్కరణలపై సమాచారం బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. రెవెన్యూ శాఖ రద్దు, ఉద్యోగుల విలీనంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తుండటంతో అనవసర రాద్ధాంతానికి ఆస్కారం ఇవ్వకూడదని అనుకుంటోంది. అయితే, మంత్రుల సంఖ్యకు అనుగుణంగా శాఖల కూర్పు జరపాలనిచూస్తున్న సీఎం కేసీఆర్‌.. రెవెన్యూ శాఖతోనే ఇతర శాఖల కుదింపుపైనా స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

వీఆర్‌వో, వీఆర్‌ఏల లెక్క తీయండి..
గ్రామస్థాయిలో సేవలందించే గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని ప్రకటించిన సీఎం.. జూన్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన శరత్‌ అనే రైతుతో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రకటించారు. ఇందులో భాగంగానే వీఆర్‌వో, వీఆర్‌ఏల వివరాలను రాబడుతున్నట్లు తెలుస్తోంది. అవినీతి సిబ్బందితో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని భావిస్తున్న సీఎం.. శాఖలో సంస్కరణలు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.

ఈ క్రమంలోనే కిందిస్థాయి ఉద్యోగులను పంచాయతీరాజ్‌ శాఖలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వీఆర్‌వో, వీఆర్‌ఏల వివరాలను పంపాలని జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్‌వోల కేడర్‌ స్ట్రెంత్‌ 7,039 కాగా, 5,088 పనిచేస్తున్నారని, అలాగే వీఆర్‌ఏల కేడర్‌ స్ట్రెంత్‌ 24,035 కాగా, 22,174 మంది పనిచేస్తున్నట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయని, ఈ లెక్కన జిల్లాలవారీగా ఉద్యోగుల వివరాలను నిర్దేశిత నమూనాలో పంపాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న సంస్కరణల కారణంగానే ఇప్పుడు ఈ వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది.  

మరిన్ని వార్తలు