గుచ్చిగుచ్చి ప్రశ్నించదు ‘గౌరవి’

25 Jun, 2014 00:11 IST|Sakshi
గుచ్చిగుచ్చి ప్రశ్నించదు ‘గౌరవి’

ప్రభుత్వాలు.. తీసుకునే చర్యలు తీసుకుంటున్నా, మహిళలపై దేశవ్యాప్తంగా అత్యాచారాలు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అయితే,  ఇలాంటి వార్తలను ఇంకా ఎక్కువగా వింటున్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో అత్యాచారాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ‘యాక్షన్ ఎయిడ్’ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో భూపాల్‌లోని జై ప్రకాష్ హాస్పిటల్‌లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘గౌరవి’ అనే సహాయకేంద్రాన్ని నెలకొల్పింది. అత్యాచార బాధితులు, గృహహింసను అనుభవిస్తున్నవారు, అదనపు కట్నం వేధింపులకు గురవుతున్నవారు, ఇంకా అనేకరకాలైన దౌర్జన్యాలను ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. వైద్య సహాయం పొందవచ్చు. న్యాయపోరాటం జరుపవచ్చు. తమకు జరిగిన అన్యాయంపై కేసుపెట్టవచ్చు. ఇందుకు అవసరమైన అన్ని రకాల సహాయాలను ‘గౌరవి’ సిబ్బంది అందిస్తారు. వాళ్లేమీ ఆషామాషీ సిబ్బంది కాదు. బాగా చదువుకున్నవారు, వైద్యవృత్తిలో ఉన్నవారు, చట్టం గురించి తెలిసిన వారు, పోలీసు శాఖతో సత్సంబంధాలు కలిగి ఉన్న వారు. అన్నిటినీ మించి, ఆపదలో సహాయం కోసం వచ్చిన మహిళలను సగౌరవంగా కూర్చోబెట్టి, వారి బాధను ఓపిగ్గా విని, అవసరమైతే కౌన్సెలింగ్ కూడా ఇచ్చి, వారికి తమ సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా వారి మనసు బాధపడేలా గుచ్చిగుచ్చి ప్రశ్నించరు.

దేశంలోనే అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్న మధ్యప్రదేశ్‌లో ఇలాంటి కేంద్రం ఒకటి ఉండడం వల్ల బాధిత మహిళలకు పూర్తి భరోసా కాకపోవచ్చు కానీ, కొంత ప్రయోజనం ఉంటుందని ‘గౌరవి’ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ హీరో, ‘సత్యమేవ జయతే’ టీవీ షో రూపకర్త ఆమిర్ ఖాన్ ఇదివరకే తన షోలో మహిళపై జరుగుతున్న అత్యాచారాలపై హృద్యమైన కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేశారు కనుక ఆయనను‘గౌరవి’ ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమిర్ మాట్లాడుతూ ‘‘మార్పు ఒక్క రోజుతో వచ్చేయదు. మొదట ఆడవాళ్ల పట్ల మగవాళ్ల వైఖరి మారాలి. అంతవరకు ఎవరి పరిధిలో వాళ్లు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నోరు విప్పాలి’’ అన్నారు. కాగా, భోపాల్‌తో పాటు మిగిలిన 50 జిల్లాల్లోనూ ‘గౌరవి’ సెంటర్లను ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. అయితే ‘గౌరవి’ లాంటి సహాయ కేంద్రాలు బాధితులకు ఎంతవరకు తోడ్పడతాయి అనే విషయమై సామాజిక కార్యకర్తలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘సిబ్బందిలో అధికారులు, నిపుణులు, వైద్యులు ఉండడం సంతోషించదగిన విషయమే. అయితే వారు క్రమం తప్పకుండా కేంద్రానికి వస్తారా?’’ అంటారు రోలీ షివ్రానే అనే కార్యకర్త. ఏదైనా ఒక ప్రయత్నం అంటూ జరిగింది. క్రమంగా ఫలితాలు ఉంటాయని ఆశించవచ్చు.
 
 

మరిన్ని వార్తలు