జీవితం అంతుచూసిన కవి

30 Dec, 2019 00:51 IST|Sakshi
హైనరిష్‌ వన్‌ క్లైస్ట్‌

గ్రేట్‌ రైటర్‌

పంతొమ్మిదో శతాబ్దపు జర్మన్‌ సాహిత్యంలో ఒక అలలా ఎగిసినవాడు హైనరిష్‌ వన్‌ క్లైస్ట్‌ (Heinrich von Kliest). నాటకకర్త, కవి, పాత్రికేయుడు అయిన క్లైస్ట్‌ను తదనంతరపు జర్మన్, ఫ్రెంచ్‌ కవులు ఒక నమూనాగా తీసుకున్నారు. 1777లో బెర్లిన్‌లో జన్మించిన క్లైస్ట్, కొంతకాలం సైన్యంలో పనిచేశాడు. ‘ఏడు విలువైన సంవత్సరాలను కోల్పోయిన’ తర్వాత సైనికోద్యోగిగా రాజీనామా చేశాడు. ఉన్నత చదువులు ప్రారంభించినా, జ్ఞానం అనేది అర్థ రహితం అన్న అవగాహనతో వాటిని కొనసాగించలేదు.

హేతువును పక్కనపెట్టి, ఉద్వేగానికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చాడు. లోపలి అశాంతి దొరికిన ఉద్యోగంలో కుదురుకోనివ్వలేదు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌ లాంటి దేశాలు తిరిగాడు. గూఢచారి అన్న అనుమానాల మీద జైలులో కొంతకాలం నిర్బంధించబడినాడు. ఇక్కడే ‘ద ష్రోఫెన్‌స్టెయిన్‌ ఫ్యామిలీ’ నాటకం రాశాడు. మరో నాటకం ‘రాబర్ట్‌ గిస్కార్డ్‌’ రాతప్రతుల్ని కాల్చేశాడు. అత్యంత గాఢమైన కవిత్వంతో మాస్టర్‌పీస్‌గా ఇప్పుడు కొనియాడబడుతున్న

‘పెంథెసిలియా’కు సమకాలీన సాహితీ ప్రపంచం పెద్దగా స్పందించలేదు. ఎనిమిది నవలికలు రాశాడు. అందులో ‘ద అర్త్‌క్వేక్‌ ఇన్‌ చిలీ’ని ఇప్పుడు క్లాసిక్‌గా పరిగణిస్తున్నారు. ద ప్రిన్స్‌ ఆఫ్‌ హాంబర్గ్, ద బ్రోకెన్‌ జగ్‌ ఆయన ఇతర రచనలు.  నెపోలియన్‌కు వ్యతిరేకంగా దేశాన్ని కూడగట్టడానికి ఒక రాజకీయ పత్రికను స్థాపించడానికి విఫలయత్నం చేశాడు. మరో పత్రికకు ఆరు నెలలు సంపాదకుడిగా ఉన్నాడు. ఇది మూతపడటంతో బతుకుతెరువు కోల్పోయాడు. వీటన్నింటిమధ్య అప్పటికే పెద్ద పేరున్న కవి గొథేతో నాటక ప్రదర్శన విషయంలో తీవ్రమైన విభేదాలు వచ్చాయి.

జీవితం పట్లా, సాహిత్యం పట్లా ఏ విధమైన ఆశ కనబడని దశలో– సంగీతంతో గాఢమైన పరిచయం ఉన్న యువతి హెన్రియెట్‌ వొగెల్‌ ఆయనకు పరిచయమైంది. అనారోగ్యంతో తన చివరి రోజులు గడుపుతున్న వొగెల్‌తోపాటు తాను కూడా జీవితం నుంచి సెలవు తీసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. 1811 నవంబర్‌ 21న ఇద్దరూ వాన్‌సీ తీరానికి చేరుకున్నారు. అంతకుముందే ఫేర్‌వెల్‌ లెటర్స్‌ రాశారు. ముందుగా వొగెల్‌ను కాల్చి, అదే పిస్టల్‌ను తనవైపు తిప్పుకున్నాడు క్లైస్ట్‌. జర్మనీలో అత్యున్నత సాహితీ పురస్కారం ‘క్లైస్ట్‌ ప్రైజ్‌’ను ఆయన పేరు మీదుగా ఇస్తున్నారు.

మరిన్ని వార్తలు